close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కారు ఖరారు.. ఇతరుల తకరారు!

బీఫారాలిచ్చి ప్రచారంలో ముందున్న తెరాస
భాజపాలో కొనసాగుతున్న మార్పులు చేర్పులు
ప్రక్రియ పూర్తిచేయని కాంగ్రెస్‌
రెబల్స్‌తో నామినేషన్ల ఉపసంహరణకు పార్టీల ప్రయత్నాలు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పాలకవర్గ ఎన్నికల పోలింగ్‌కు మరో 9 రోజులు మాత్రమే సమయమున్నా భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు శనివారం రాత్రి వరకు పూర్తిస్థాయిలో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయలేకపోయాయి. అన్ని స్థానాలకు ఖరారు చేసినట్లు చెబుతున్నా మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. భాజపా ఇతర పార్టీ నేతలను స్వాగతిస్తూనే ఉంది. తెరాస నేత స్వామిగౌడ్‌ను పార్టీలోకి ఆహ్వానించింది.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌, పార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌  ఆయనను కలిశారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) మాత్రం అన్ని డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించి ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసి అమలుచేస్తోంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ రోడ్‌షోలు ఆరంభించారు.

తెరాస: రెబల్స్‌ను బరి నుంచి తప్పించేలా

రెండు రోజుల వ్యవధిలోనే 150 డివిజన్లకు అభ్యర్థులను తెరాస ప్రకటించిన విషయం విదితమే. తమకు అవకాశం ఇవ్వలేదన్న ఉద్దేశంతో కొందరు రెబల్స్‌గా నామినేషన్లు వేశారు. వారిని బరి నుంచి తప్పించేందుకు కొంతమంది నాయకులను అధిష్ఠానం రంగంలోకి దింపింది. తొలుత ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇప్పటికే 50కు పైగా డివిజన్లలో రెబల్స్‌ నామినేషన్లు వేయగా ఎమ్మెల్యేల సంప్రదింపులతో చాలా మంది ఉపసంహరించుకోవడానికి అంగీకరించినట్లు సమాచారం. అభ్యర్థి విజయంపై ప్రభావం చూపిస్తారన్న వ్యక్తులతో మాత్రం మంత్రులు కేటీఆర్‌, తలసాని మాట్లాడి బుజ్జగిస్తున్నారు. ఈ ప్రయత్నాల వల్ల దాదాపుగా రెబల్స్‌ మెత్తబడి పోటీ నుంచి తప్పుకొంటున్నారని నేతలు చెబుతున్నారు. మరోవైపు డివిజన్ల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలకు బాధ్యతలు అప్పగించడంతో వారు ముందుగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. రోజుకు అయిదారు రోడ్‌షోలలో కేటీఆర్‌ పాల్గొనేలా ప్రణాళిక రూపొందించారు.

భాజపా: అభ్యర్థుల ఎంపిక, ప్రత్యర్థి పార్టీ నేతలపై దృష్టి

అభ్యర్థుల ఎంపికను నూటికి నూరుశాతం భాజపా పూర్తి చేయలేదు. శనివారం రాత్రికి దాదాపుగా జాబితాను ప్రకటించినా చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చేస్తోంది. ఆదివారం ఉదయానికి సిద్ధం చేసే పనిలో నాయకులున్నారు. బల్దియా పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు అభ్యర్థులు ఎవరన్నది తెలియకపోవడంతో చాలా డివిజన్లలో ఇంకా ప్రచారం ఊపందుకోలేదు. తెరాస, కాంగ్రెస్‌లోని అసంతృప్తి వాదులను అగ్రనేతలు కలిసి భాజపాలోకి ఆహ్వానించే ప్రక్రియ శనివారమూ కొనసాగింది. మరోవైపు ఆదివారం కేంద్రమంత్రి ప్రకాష్‌ జావడేకర్‌తో కలిసి తెరాస పాలనపై ఛార్జిషీటు విడుదల చేయనున్నారు.

కాంగ్రెస్‌: తగిన సమన్వయం లేక

ఎంపికచేసిన జాబితాపై కాంగ్రెస్‌ నేతలు కూడికలు, తీసివేతలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు అధికారికంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. 35 మందిని ప్రకటించలేదు. పార్టీ పార్లమెంటరీ సమన్వయ కమిటీకి, నియోజకవర్గ నాయకులకు సమన్వయం లేక ప్రక్రియ పూర్తి కాలేదు. ఇంకా అభ్యర్థులకు బీఫారాలను ఇవ్వలేదు.దీంతో ఇప్పటి వరకు ప్రకటించిన 115 మంది జాబితాలోనూ మార్పులున్నా ఆశ్చర్య పోనక్కరలేదని పార్టీ వర్గాలంటున్నాయి. ఆదివారం ఉదయం 12 గంటలలోపు పార్టీ నియమించిన ఇన్‌ఛార్జులు నేరుగా రిటర్నింగ్‌ అధికారులకు అభ్యర్థుల తరఫున బీ ఫారాలు అందజేయనున్నారని సమాచారం. ఇలా అయితే చివరి నిమిషం వరకు బీ ఫారాలు ఎవరికిచ్చారో తెలిసే పరిస్థితి లేకపోవడంతో..టికెట్‌ రాని వారిని బుజ్జగించి నామినేషన్లు ఉపసంహరింపచేయడానికి సమయం మిగలదు..దీని వల్ల ఇబ్బంది కలుగుతుందని కొందరు ఆశావహుల్లో టెన్షన్‌ నెలకొంది. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి మాత్రం తన పార్లమెంటరీ నియోజకవర్గంలో చాలావరకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇక్కడ కూడా ఒకటి రెండు చోట్ల ఎంపికలో ఇబ్బంది ఉందని చెబుతున్నారు. సీనియర్‌ నాయకులు గాంధీభవన్‌ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ నెల 23వ తేదీన పార్టీ మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.