close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భాష హుందాగా ఉండాలి

ప్రజాప్రతినిధులు క్రమశిక్షణతో మెలగాలని ప్రజలు ఆశిస్తారు
అఖిల భారత సభాపతుల సదస్సులో రాష్ట్రపతి ఉద్ఘాటన
మూడు వ్యవస్థలూ సమానమే: ఉప రాష్ట్రపతి వెంకయ్య

కేవడియా (గుజరాత్‌): ఎన్నికైన ప్రజా ప్రతినిధుల నుంచి క్రమశిక్షణను ప్రజలు ఆశిస్తారని, దానిని దృష్టిలో పెట్టుకుని వారంతా చట్టసభల్లో హుందాగా మెలగాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. పార్లమెంటులో, శాసనసభల్లో వాడే భాష అభ్యంతరకరంగా ఉండకూడదని చెప్పారు. క్రమశిక్షణరాహిత్యం, అమర్యాదకర భాష వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. గుజరాత్‌లోని నర్మదా జిల్లా కేవడియాలో బుధవారం మొదలైన 80వ అఖిల భారత స్పీకర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘ప్రజాస్వామ్య విలువలకు ప్రజా ప్రతినిధులు కట్టుబడి ఉండాలని ప్రజలు ఆశిస్తారు. ప్రజాకాంక్షలను నెరవేర్చడమే ప్రజా ప్రతినిధులకు, ప్రజాస్వామ్య సంస్థలకు పెద్ద సవాల్‌. అనవసర తీవ్రత పెరగకుండా ఆరోగ్యవంతమైన చర్చలు జరిగేలా సభాపతులు చొరవ తీసుకోవాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతో పాటు విపక్షానికీ ముఖ్యమైన పాత్ర ఉంది. ఇరు పక్షాల మధ్య అవగాహన, సహకారం, అర్థవంతమైన రీతిలో ఆలోచనల కలబోత అవసరం’ అని కోవింద్‌ చెప్పారు.

రాజ్యాంగమే సర్వోన్నతం: వెంకయ్యనాయుడు
ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ- రాజ్యాంగంలోని మూడు మూలస్తంభాలూ సమానమేనని, ఏదీ తనదే పైచేయి అనుకోరాదని చెప్పారు.  కొన్ని తీర్పుల్ని చూస్తే.. పైచేయి సాధించడానికి న్యాయవ్యవస్థ ప్రయత్నిస్తోందనే భావన ఏ మూలనో కలుగుతోందని వ్యాఖ్యానించారు.  శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు తమ పరిధుల్లో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. మూడు వ్యవస్థల మధ్య సామరస్యపూర్వక సమన్వయం ప్రజాస్వామ్యానికి ముఖ్యమనే అంశంపై ఆయన మాట్లాడారు. ‘‘ఏ వ్యవస్థ పనిని ఆ వ్యవస్థ చేసుకోవడంపైనే సామరస్యం ఆధారపడి ఉంటుంది. దురదృష్టవశాత్తూ పరిధులను అతిక్రమిస్తున్న దాఖలాలు అనేకం ఉంటున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఉన్నత న్యాయస్థానాలు అనేకాంశాలపై కీలక తీర్పులు ఇచ్చాయి. శాసన, కార్యనిర్వాహక విభాగాల్లోకి చొరబడేందుకు న్యాయవ్యవస్థ ప్రయత్నిస్తోందా అనే ఆందోళన అప్పుడప్పుడు కలుగుతోంది’’ అని వెంకయ్యనాయుడు వివరించారు. దీపావళి టపాసుల వినియోగం, కొలీజియం ద్వారా జరిగే న్యాయమూర్తుల నియామకాల్లో కార్యనిర్వాహక వ్యవస్థకు ఎలాంటి పాత్ర లేకపోవడం, జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ చట్టాన్ని చెల్లకుండా చేయడం వంటివి ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. కొన్నిసార్లు శాసనవ్యవస్థ కూడా రేఖ దాటుతోందన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎన్నికలో న్యాయవ్యవస్థ సమీక్షకు వీల్లేదని 1975లో చేసిన రాజ్యాంగ సవరణను ఆయన ఉదహరించారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు