
ప్రధానాంశాలు
పాంగాంగ్లో మెరైన్ కమాండోలను రంగంలోకి దించిన భారత్
త్వరలో అందుబాటులోకి అధునాతన బోట్లు
తూర్పు లద్దాఖ్‌లో సత్తా చాటుతున్న భారత ప్రత్యేక బలగాలు
దిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనా దురుసు వైఖరికి గట్టిగా చెక్ పెట్టేందుకు భారత్ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కోవడానికి వీలుగా ప్రత్యేక బలగాలను దించింది. తాజాగా నౌకాదళంలోని మెరికల్లాంటి మెరైన్ కమాండోల (మార్కోస్)ను మోహరించింది.
ఏప్రిల్, మే నెల నుంచి భారత్, చైనా సైనికుల మధ్య తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాంగాంగ్ సరస్సు వద్ద ఇరు దేశాల బలగాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రెండు పక్షాలూ పోటాపోటీగా సైనికులను, భారీ ఆయుధాలను మోహరించాయి. చైనా దుందుడుకు చర్యలను మెరుపు వేగంతో స్పందించేందుకు, అవసరమైతే ప్రతిదాడికి దిగేందుకు భారత సైన్యంలోని పారాచూట్ ప్రత్యేక బలగాలు, వాయు సేనకు చెందిన ‘గరుడ్’ కమాండోలను తూర్పు లద్దాఖ్‌కు తరలించింది. కేంద్ర క్యాబినెట్ సచివాలయం ఆధ్వర్యంలో పనిచేసే రహస్య దళం ‘స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్’ కూడా రంగంలోకి దిగింది. సంప్రదాయేతర పోరులో సుశిక్షితులైన ఈ మూడు దళాల యోధులు.. గత ఆరు నెలలుగా చైనా బలగాలు హద్దు మీరకుండా చూస్తున్నాయి. ఇప్పుడు ఈ వీరులకు భారత నౌకాదళానికి చెందిన మెరైన్ కమాండో(మార్కోస్)లు కూడా తోడయ్యారు. పాంగాంగ్ సరస్సు వద్ద వీరిని ప్రభుత్వం మోహరించింది. త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం సాధించడంతోపాటు అత్యంత ప్రతికూల శీతల వాతావరణ పరిస్థితులను పరిచయం చేసే ఉద్దేశంతో వీరిని దించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పాంగాంగ్ సరస్సులో విధుల నిర్వహణ కోసం అధునాతన బోట్లనూ వీరికి సమకూర్చనున్నారు. నీటిపై పోరాటంలో వీరికి సాటిలేదు.
రేఖ దాటితే కూల్చివేతే..
ఎల్ఏసీ వెంబడి వ్యూహాత్మక పర్వత శిఖరాలపై ‘గరుడ్’ కమాండోలు డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. భుజంపై నుంచి పేల్చే ‘ఇగ్లా’ క్షిపణి వ్యవస్థలు వారి వద్ద ఉన్నాయి. భారత గగనతలంలోకి చైనా యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు ప్రవేశిస్తే వీటితో పేల్చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సైన్యంలోని పారాచూట్ ప్రత్యేక దళాలు కూడా వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించాయి. డ్రాగన్ సేనను నిలువరించడానికి ఎల్ఏసీ వెంబడి కొన్ని వ్యూహాత్మక పర్వత శిఖరాలను ఆగస్టు 29, 30 తేదీల్లో భారత్ తన ఆధీనంలోకి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ ఆపరేషన్‌లో ప్రత్యేక బలగాలు కీలక పాత్ర పోషించాయి. చైనా కూడా తన కమాండో దళాలను మోహరించింది.
కశ్మీర్లో రాటుదేలి..
భారత త్రివిధ దళాల్లోని ప్రత్యేక కమాండోలు కొన్నేళ్లుగా జమ్మూ-కశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని సమర్థంగా తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో.. చైనా దళాలను మించి అపార పోరాట అనుభవాన్ని గడించాయి.
* జమ్మూ-కశ్మీర్‌లోని వులార్ సరస్సు వంటి చోట్ల ‘మార్కోస్’ దళాలు వెయ్యి కళ్లతో పహారా కాస్తున్నాయి. 1987లో శ్రీలంక వెళ్లిన భారత ‘శాంతిసేన’లో భాగంగా ఉన్న ఈ కమాండోలు.. జాఫ్నాలోని ఉప్పునీటి కయ్యల వద్ద ఎల్టీటీఈ ఉగ్రవాదుల భరతం పట్టారు.
* 2016లో పఠాన్‌కోట్‌లో ఉగ్రవాద దాడిని ‘గరుడ్’ దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాద పోరులో ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించే ఉద్దేశంతో వారిని జమ్మూ-కశ్మీర్లో మోహరించారు. తక్కువ కాలంలోనే ఈ దళాలు తమ సత్తాను చాటాయి. ముంబయి దాడుల సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ మేనల్లుడు సహా పలువురు ఉగ్రవాదులను హతమర్చాయి. ఒక అశోక చక్ర, మూడు శౌర్య చక్ర, అనేక ఇతర పురస్కారాలను గెల్చుకున్నాయి.
* పారాచూట్ ప్రత్యేక దళ కమాండో బెటాలియన్లు సుదీర్ఘకాలంగా కశ్మీర్ లోయలో మోహరించాయి. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లలో అత్యంత సాహసోపేతంగా వ్యవహరిస్తూ.. ముష్కరుల వెన్నులో దడ పుట్టిస్తున్నాయి. 2016లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో మెరుపు దాడులనూ ఈ దళాలు నిర్వహించాయి.
ప్రధానాంశాలు
దేవతార్చన

- 2-1 కాదు 2-0!
- ఇక చాలు
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- సాహో భారత్!
- కొవిడ్ టీకా అలజడి
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- కీలక ఆదేశాలపై జో బైడెన్ సంతకం
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!