రైతు సంక్షేమమే మా విధానం

ప్రధానాంశాలు

రైతు సంక్షేమమే మా విధానం

వారి ఆదాయాన్ని పెంచేందుకే సంస్కరణలు
నిర్దేశిత మండీలకు వెలుపలా విక్రయాలకు వీలు
ప్రధాన మంత్రి ఉద్ఘాటన

దిల్లీ: రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారికి ప్రత్యామ్నాయ మార్కెట్‌ అవకాశాలను కల్పించి, ఆదాయాన్ని పెంచేందుకే కొత్త చట్టాలు తెచ్చామన్నారు. వీటి వల్ల ఈ రంగంలోకి సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. కొత్త సంస్కరణల ఉద్దేశం రైతులకు అడ్డంకులు తొలగించడమేనని తెలిపారు. భారత వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఫిక్కీ) వార్షిక సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. కొత్త వ్యవసాయ చట్టాలపై నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు స్పష్టంచేసిన నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన తన ప్రసంగంలో ఎక్కడా అన్నదాతల ఆందోళనలను నేరుగా ప్రస్తావించలేదు. తమ విధానాలు, చర్యల ద్వారా రైతుల సంక్షేమానికి, ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. ‘‘ఇటీవలి సంస్కరణల వల్ల రైతులకు కొత్త మార్కెట్లు, అవకాశాలు లభిస్తాయి. నిర్దేశిత మండీలతో పాటు వెలుపల కూడా తమ ఉత్పత్తులను విక్రయించుకునే వెసులుబాటును కల్పిస్తాయి. నూతన సాంకేతిక పరిజ్ఞాన తోడ్పాటు సైతం లభిస్తుంది. దేశ కోల్డ్‌ స్టోరేజీ మౌలిక వసతులు కూడా ఆధునిక రూపును సంతరించుకుంటాయి. వీటన్నింటి వల్ల వ్యవసాయ రంగంలో అధిక పెట్టుబడులు వస్తాయి. మండీలను ఆధునికీకరిస్తున్నాం. ఉత్పత్తుల విక్రయాల కోసం డిజిటల్‌ వేదికనూ రైతులు ఉపయోగించుకోవచ్చు. ఈ చర్యలన్నీ కర్షకుల ఆదాయాన్ని పెంచేందుకు ఉద్దేశించినవే. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు గరిష్ఠంగా ప్రయోజనం దక్కుతుంది. రైతులు సంపన్నులైతే.. దేశం సుభిక్షంగా ఉంటుంది’’ అని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని మోదీ చెప్పారు. వ్యవసాయ రంగంలో పరిశ్రమల భాగస్వామ్యం చాలా పరిమితంగా ఉందని, ఈ రంగంపై మరింత ఆసక్తి చూపి పెట్టుబడులను పెంచాలని పరిశ్రమలను ఆయన కోరారు.

ప్రోత్సాహకరంగా ఆర్థిక సూచికలు
కొవిడ్‌-19 అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నట్లు సంబంధిత సూచికలు చెబుతున్నాయని మోదీ చెప్పారు. ప్రభుత్వ నియంత్రణను బాగా తగ్గించి, ప్రైవేటు పెట్టుబడులను పెంచేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రాణ రక్షణకు అధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్నామని చెప్పారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కలిగించేందుకు గత ఆరేళ్లుగా అనేక చర్యలను తీసుకున్నామని తెలిపారు. దీనివల్ల రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయన్నారు. భారత్‌ను ప్రపంచ శక్తిగా నిలబెట్టేందుకు ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

అది రైతుల ఉద్యమం కాదు: గోయల్‌
కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమం ఇప్పుడు వారి చేతుల్లో లేదని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. ఆందోళనలోకి వామపక్షవాదులు, మావోయిస్టులు చొరబడ్డారని ఆరోపించారు. జైళ్లలో ఉన్న ‘జాతి వ్యతిరేక శక్తుల’ విడుదలకు వారు డిమాండ్‌ చేస్తున్నారని చెప్పారు. వ్యవసాయ సంస్కరణలను దెబ్బతీయాలన్న ఉద్దేశం వారిలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలని ‘ఫిక్కీ’లో ఉన్న మేధావులు, వ్యాపారవేత్తలను ఆయన కోరారు.

భద్రతా సవాళ్లను అధిగమిస్తాం : జైశంకర్‌
జాతీయ భద్రతా సవాళ్లను భారత్‌ అధిగమిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ ధీమా వ్యక్తంచేశారు. ఏడు నెలలుగా తూర్పు లద్దాఖ్‌లో చైనాతో సైనిక ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో.. భారత్‌ సవాళ్లను ఎదుర్కొంటోందని ఈ సదస్సులో ఆయన పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి చోటుచేసుకున్న పరిణామాలు చైనాకు ప్రయోజనకరమైనవి కావన్నారు. కానీ అవి భారతీయుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని తెలిపారు. ‘‘ఈ ప్రతిష్టంభన ఎంతకాలం కొనసాగుతుందో, సమస్య అంత సులభంగా పరిష్కారమవుతుందో.. లేదో.. చెప్పలేను’’ అని జైశంకర్‌.. ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని