కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేపట్టొద్దు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేపట్టొద్దు

మరో 6 ప్రాజెక్టుల విషయంలోనూ ముందుకెళ్లొద్దు
ఏపీలో పోతిరెడ్డిపాడు పనులకూ ఇదే వర్తిస్తుంది
తెలంగాణ ముఖ్యమంత్రికి కేంద్ర జల్‌శక్తి మంత్రి లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సమర్పించి ఆమోదం లభించే వరకు కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు సహా ఏడు ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లొద్దని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి సూచించింది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన పనులకూ ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ లేఖ రాశారు. ఈ నెల 11న దిల్లీలో ఆయన్ను కేసీఆర్‌ కలవగా, కేంద్ర మంత్రి లేఖ అదే తేదీతో రావడం గమనార్హం.  కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, అనేకసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అక్టోబరు 2న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారు. దీనికి అంశాల వారీగా కేంద్ర మంత్రి తన లేఖలో సమాధానమిచ్చారు.
లేఖలో ముఖ్యాంశాలు
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, కృష్ణా, గోదావరిలో న్యాయసమ్మతంగా రావాల్సిన నీటి వాటా గురించి ప్రయత్నిస్తున్నా పట్టించుకోలేదని కేంద్రానికి మీరు (కేసీఆర్‌) రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతర్‌ రాష్ట్ర నదీవివాద చట్టం-1956లోని సెక్షన్‌ 5(3) ప్రకారం ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయకపోవడం వల్ల 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా న్యాయబద్ధంగా నీటి వాటాను దక్కించుకోలేకపోయిందని ఆ లేఖలో తెలిపారు. ‘‘2014, 2018లో మీరు రెండు లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌-89 ప్రకారం ట్రైబ్యునల్‌కు పంపడం వల్ల తెలంగాణకు న్యాయం జరగలేదు’’ అని పేర్కొన్నారు. దీనికి సంబంధించి 2010లో కృష్ణా ట్రైబ్యునల్‌-2 ఇచ్చిన అవార్డుపై ఆంధ్రప్రదేశ్‌ పిటిషన్‌ ఆధారంగా 2011లో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. 2014లో తెలంగాణ ఇందులో ఇంప్లీడ్‌ అయింది. కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు కోసం కేంద్రానికి సూచించాలంటూ 2015లో తెలంగాణ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ అంశం ఇప్పటికీ కోర్టులో పెండింగ్‌లో ఉంది. న్యాయ సలహా తీసుకొని కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు లేదా.. ప్రస్తుత ట్రైబ్యునల్‌నే సెక్షన్‌ 5(3) ప్రకారం విచారణ జరపాలని కోరేందుకు కేంద్రం అంగీకరించడంతో సుప్రీంకోర్టులో పిటిషన్‌ ఉపసంహరించుకోవడానికి అక్టోబరు 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో మీరు (కేసీఆర్‌) అంగీకరించారు. గోదావరి జలాలకు సంబంధించి కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపుతామని రెండు తెలుగు రాష్ట్రాలూ ఒప్పుకొన్నాయి. రాష్ట్రాల నుంచి ఆ ప్రతిపాదనలు వచ్చాక కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకొంటుంది.
* పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ అనధికారికంగా విస్తరించడం వల్ల తెలంగాణ ప్రయోజనాలకు వాటిల్లే నష్టం గురించి మీ లేఖలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు కృష్ణా బోర్డుకు అందజేయాలి. బోర్డు సాంకేతికంగా పరిశీలించి.. అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదించాకనే పనులు చేపట్టాలి. దీనిపై బోర్డు, జల్‌శక్తి ఆంధ్రప్రదేశ్‌కు అనేక లేఖలు రాయడమే కాదు, పోతిరెడ్డిపాడు విషయంలో ముందుకెళ్లొద్దని ఆగస్టు 7న స్పష్టంగా లేఖ రాశాయి. డీపీఆర్‌ సమర్పిస్తామని అపెక్స్‌ కౌన్సిల్‌లో ఏపీ సీఎం చెప్పారు. దీనిపై కౌన్సిల్‌ ఆమోదం లభించే వరకు ఆంధ్రప్రదేశ్‌ ముందుకెళ్లడానికి వీల్లేదు.
* ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా బేసిన్‌ బయట ప్రాజెక్టుల నిర్మాణం, నీటి మళ్లింపు చేపడుతున్నా నిలుపుదల చేయడంలో బోర్డు విఫలమైందన్న తెలంగాణ ఆరోపణకు షెకావత్‌ సమాధానమిస్తూ.. ‘పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి డీపీఆర్‌ సమర్పించి అనుమతులు పొందేవరకు ముందుకెళ్లడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్‌కు అనేక లేఖలు రాశాం. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నోటిఫై చేయాలని నిర్ణయించాం. ఒకసారి బోర్డు పరిధి నోటిఫై అయితే శ్రీశైలం నుంచి నీటి విడుదల మొత్తం బోర్డు చేతిలో ఉంటుంది. రాష్ట్రాల నుంచి నిధుల విడుదలలో ఆలస్యం వల్ల టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటులో జాప్యం జరిగింది’ అని వివరించారు.
* ఆంధ్రప్రదేశ్‌ చెప్పినట్లుగా గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులు కొత్తవి కావని.. ఉమ్మడి ఏపీలో చేపట్టినవని.. కొన్ని ప్రాజెక్టుల కింద ముంపును నివారించడానికి స్థలం మాత్రమే మార్చామని మీ(కేసీఆర్‌) లేఖలో పేర్కొన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా రోజూ 2 టీఎంసీల నీటి మళ్లింపు పథకానికి 2018 జూన్‌లోనే కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. తర్వాత దీని పరిధిని పెంచి రోజుకు 3 టీఎంసీలు మళ్లించేలా చేపట్టారు. పరిధిని మార్చినప్పుడు కేంద్రం నుంచి నీటి లభ్యత, అంతర్‌ రాష్ట్ర, పర్యావరణం, పెట్టుబడి అనుమతులు పొందాలి. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై డీపీఆర్‌ అందజేయడానికి మీరు అంగీకరించారు. కాళేశ్వరం మూడో టీఎంసీ, సీతారామ ఎత్తిపోతల, గోదావరి ఎత్తిపోతల మూడోదశ, తుపాకులగూడెం, తెలంగాణ తాగునీటి పథకం, లోయర్‌ పెన్‌గంగ బ్యారేజీలు, రామప్ప లేక్‌ నుంచి పాకాల లేక్‌కు నీటి మళ్లింపు పథకాలను గోదావరి బోర్డు నుంచి అనుమతులు లభించేవరకు చేపట్టవద్దని మరోసారి చెబుతున్నాం.
* గోదావరి జలాల వాటా తెలంగాణకు 967.94 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 518.2 టీఎంసీలుగా ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి ప్రకటించినట్లు మీరు (కేసీఆర్‌)పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1486.15 టీఎంసీల కేటాయింపు ఉందని అంచనా వేసి అందులో తెలంగాణకు 65.13 శాతంగా తెలిపారు. గోదావరి అవార్డు ప్రకారం మిగులు జలాలు ఉమ్మడి ఏపీకి చెందుతాయి. కేంద్ర జలసంఘం వద్ద ఉన్న 53 ఏళ్ల రికార్డు ప్రకారం సరాసరిన 3 వేల టీఎంసీలు సముద్రంలో కలిశాయని.. ఇందులో తెలంగాణకు 1950 టీఎంసీలు రావాల్సి ఉందని మీరు వివరించారు. అక్టోబరు 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో మీరు, ఏపీ సీఎం గోదావరి జలాలకు సంబంధించి కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు అంగీకరించారు. ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు వినతి పంపుతానని కూడా మీరు చెప్పారు. మీనుంచి ఆ లేఖ రాగానే మా మంత్రిత్వశాఖ సానుకూల నిర్ణయం తీసుకొంటుంది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ వివాదాలను పరిష్కరించడానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర మంత్రి షెకావత్‌ తెలంగాణ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు