బ్రిటన్‌లో కొత్త కలవరం

ప్రధానాంశాలు

బ్రిటన్‌లో కొత్త కలవరం

 

విజృంభిస్తున్న మరోరకం కరోనా వైరస్‌
మళ్లీ లాక్‌డౌన్‌ ప్రకటించిన జాన్సన్‌ ప్రభుత్వం
ఐరోపా దేశాలు అప్రమత్తం.. ప్రయాణాలపై ఆంక్షలు

లండన్‌: కొవిడ్‌ మహమ్మారి విజృంభణ నుంచి మానవాళి కాస్త తెరిపిన పడుతున్నట్లు కనిపిస్తున్నవేళ కొత్త కలవరం మొదలైంది. బ్రిటన్‌లో వెలుగుచూసిన నూతన రకం కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతూ గుబులు పుట్టిస్తోంది. ఈ రకం వైరస్‌ అడ్డూ అదుపూ లేకుండా ప్రబలుతోందంటూ బ్రిటన్‌ ప్రభుత్వం తాజాగా హెచ్చరించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కఠిన నిబంధనలతో మళ్లీ లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో నెదర్లాండ్స్‌, బెల్జియం తదితర ఐరోపా దేశాలు అప్రమత్తమయ్యాయి. బ్రిటన్‌ నుంచి విమాన సర్వీసులను నిలిపివేశాయి. భారత్‌ కూడా నూతన రకం వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు సన్నద్ధమవుతోంది. కొత్త రకం కరోనా వైరస్‌ ప్రస్తుతమున్న వైరస్‌ కంటే ఎక్కువ ప్రాణాంతకమని తేల్చి చెప్పే ఆధారాలేవీ లేవని బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు. అయితే దాన్ని ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. వైరస్‌ ప్రభావ తీవ్రతను నిర్ధారించే దిశగా తమ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ వైరస్‌ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)ను కూడా అప్రమత్తం చేశామన్నారు. నిత్యావసరం కాని సరకుల దుకాణాలు, వ్యాపారాలను మూసివేస్తున్నట్లు తాజా లాక్‌డౌన్‌లో భాగంగా ప్రకటించారు. వ్యాయామశాలలు, సినిమా హాళ్లు, క్షౌరశాలలు రెండు వారాలపాటు తెరుచుకోబోవని స్పష్టం చేశారు. మరోవైపు- కొత్త రకం వైరస్‌ వ్యాప్తితో దేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని బ్రిటన్‌ ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్‌ హ్యాంకాక్‌ పేర్కొన్నారు. ప్రధానంగా దక్షిణ ఇంగ్లాండ్‌లో తాజా వైరస్‌ ఎక్కువగా ప్రబలుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరులోనే తొలిసారిగా నూతన రకం కరోనా వైరస్‌ వ్యాప్తిని ఓ రోగిలో శాస్త్రవేత్తలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికాలోనూ కొత్త రకం కరోనా జాడ బయటపడింది.

విమాన సేవలు బంద్‌
కొత్త రకం కరోనా వ్యాప్తిని నిలువరించేందుకుగాను బ్రిటన్‌నుంచి ప్రయాణికుల రాకపై ఐరోపా దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఆ దేశం విమానాల రాకను జనవరి 1 వరకు నిషేధిస్తున్నట్లు నెదర్లాండ్స్‌ ప్రకటించింది. బ్రిటన్‌తో విమానాలు, రైలు సర్వీసులను 24 గంటలపాటు నిలిపివేస్తున్నట్లు బెల్జియం తెలిపింది. ఆస్ట్రియా, ఇటలీ కూడా ఈ తరహా ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. ఎప్పటి వరకో స్పష్టంగా చెప్పలేదు. బ్రిటన్‌, దక్షిణాఫ్రికాల విమానాలు నిలిపివేసేదిశగా యోచిస్తున్నట్లు జర్మనీ తెలిపింది.
అత్యవసర భేటీ ఏర్పాటుచేసిన కేంద్రం
బ్రిటన్‌లో కొత్త రకం వైరస్‌తో భారత్‌ అప్రమత్తమైంది. దాని పుట్టుక, వ్యాప్తిపై చర్చించేందుకుగాను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన పరిధిలోని సంయుక్త పర్యవేక్షణ బృందం (జేఎంజీ) భేటీని అత్యవసరంగా ఏర్పాటుచేసింది. ఆరోగ్య సేవల డైరెక్టర్‌ జనరల్‌ (డీజీహెచ్‌ఎస్‌) అధ్యక్షతన సోమవారం ఈ భేటీ జరగనుంది.


అంత అపాయం కాదు: డా. శ్రీనాథ్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: బ్రిటన్‌లో వైరస్‌ కేసులు అత్యధికంగా పెరగడానికి ప్రధాన కారణం అక్కడ కరోనా వైరస్‌ తన రూపు మార్చుకోవడమేనని భారతీయ ప్రజారోగ్య సంస్థ ఛైర్మన్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు డా. శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. ఐరోపాలో వైరస్‌ వ్యాప్తి ప్రబలుతుండటంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆయన ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. ‘‘కరోనా వైరస్‌ అంతర్గత కణజాలాల్లో చొచ్చుకుపోయేందుకు ప్రయత్నిస్తుంటుంది. దానికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి పోరాడుతుంటుంది. ఈ సమయంలో శరీరంలో తనకు జీవించడానికి అవకాశం స్వల్పంగా ఉంటుందని భావించినప్పుడు వైరస్‌ రూపాంతరం చెందుతుంది. ప్రస్తుతం బ్రిటన్‌లో ఈ తరహాలోనే వైరస్‌ తన రూపు మార్చుకొందని అక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ప్రభావం వల్ల కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వినాశకర రీతిలో అది ప్రభావం చూపించడం లేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి వైరస్‌ రూపు మారినా అంత అపాయకరంగా ఏమీ దాడి చేయడం లేదని తెలుస్తోంది’’ అని వివరించారు.

ఇవీ చదవండి

 


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని