వామ్మో కొత్త కరోనా!

ప్రధానాంశాలు

వామ్మో కొత్త కరోనా!

వణికిపోతున్న ప్రపంచ దేశాలు
బ్రిటన్‌కు ప్రయాణాలు బంద్‌
రేపటి నుంచి 31 వరకు విమాన సర్వీసులు రద్దు చేసిన భారత్‌
అదే బాటలో మరిన్ని దేశాలు
ఇటలీకి పాకిన కొత్త వైరస్‌
కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు
మహారాష్ట్రలోని కొన్ని నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ

దిల్లీ, లండన్‌: కొత్త రకం కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మానవాళిని మళ్లీ భయం గుప్పిట్లో బిగిస్తోంది. కాస్త రూపు మార్చుకున్న ఈ నూతన వైరస్‌ ప్రస్తుతానికి బ్రిటన్‌తోపాటు మరో 4-5 దేశాల్లో మాత్రమే వెలుగుచూసినా.. దాని దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ గడగడలాడుతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్‌ పేరెత్తితేనే అంతర్జాతీయ సమాజం వణికిపోతోంది. భారత్‌ సహా అనేక దేశాలు ముందుజాగ్రత్త చర్యగా ఆ దేశానికి విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి. దీంతో క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకల వేళ బ్రిటన్‌ నుంచి స్వదేశాలకు వెళ్లాలనుకున్నవారికి నిరాశ తప్పట్లేదు. ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో పలువురు భారతీయులు కూడా బ్రిటన్‌లో చిక్కుకున్నారు. మరోవైపు- కొత్త కరోనా వైరస్‌ భయంతో అంతర్జాతీయ మార్కెట్లు సోమవారం చిగురుటాకులా వణికాయి. ముఖ్యంగా భారత్‌లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలడంతో ఆరున్నర గంటల వ్యవధిలో మదుపర్ల సంపద రూ.6.59 లక్షల కోట్ల మేర ఆవిరైంది.
భారత్‌ ముందు జాగ్రత్త చర్య
బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. ఆ దేశం నుంచి వైరస్‌ మన దగ్గరికి చేరకుండా నిలువరించే చర్యలకు ఉపక్రమించింది. ఇరు దేశాల మధ్య నడిచే విమాన సర్వీసులన్నింటినీ బుధవారం నుంచి ఈ నెల 31 వరకు రద్దు చేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. మంగళవారం రాత్రి వరకు మాత్రం సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించింది.  అయితే- మంగళవారం రాత్రి వరకు బ్రిటన్‌ నుంచి భారత్‌లో అడుగుపెట్టే ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలని పేర్కొంది. తాజా నిషేధాజ్ఞలు సరకు రవాణా విమానాలకు మాత్రం వర్తించబోమని స్పష్టంచేసింది. బ్రిటన్‌ నుంచి ప్రయాణికులు వేరే ప్రాంతాలకు వెళ్లి.. అక్కడి నుంచి భారత్‌కు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విమానయాన సంస్థలను పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌(డీజీసీఏ) ఆదేశించింది.

వారి ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ
బ్రిటన్‌ నుంచి వచ్చే ప్రయాణికులు కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలితే.. వారిని సంస్థాగత క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచుతామని పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి తెలిపారు. నెగిటివ్‌ వచ్చినవారు ఏడు రోజులపాటు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలని, ఆ సమయంలో వారి ఆరోగ్య పరిస్థితిని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు నిరంతరం పర్యవేక్షిస్తాయని చెప్పారు. ఈ నెల 31 వరకు విమాన సర్వీసులు రద్దు కావడంతో నష్టపోయే ప్రయాణికులు మరోసారి ఉచితంగా తమ ప్రయాణాన్ని షెడ్యూల్‌ చేసుకునేందుకు అనుమతిస్తామని ‘విస్తారా’ విమానయాన సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు.
వేడుకల వేళ నిరాశ
విమాన సర్వీసుల రద్దు నేపథ్యంలో బ్రిటన్‌లోని పలువురు భారతీయ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి క్రిస్మస్‌, నూతన సంవత్సరం వేడుకలు జరుపుకొనేందుకుగాను భారత్‌కు రావాలని చాలామంది విద్యార్థులు ఇప్పటికే ప్రణాళికలు వేసుకున్నారు. విమాన టికెట్లు కూడా బుక్‌ చేసుకున్నారు. ప్రస్తుతం విమాన సర్వీసులు రద్దు కావడంతో వారందరికీ నిరాశే ఎదురైంది.
‘మహా’ నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ
కొత్త రకం కరోనా ప్రబలతున్న దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. మంగళవారం నుంచి వచ్చే నెల 5 వరకు రాష్ట్రంలోని పురపాలక సంఘాల ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఐరోపా, పశ్చిమాసియా దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు ఆసుపత్రులు, హోటళ్లలో 14 రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరి చేసింది.
ఆంక్షల బాటలో ఫ్రాన్స్‌, కెనడా
బ్రిటన్‌లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో అక్కడి నుంచి ప్రయాణికుల రాకపై అనేక దేశాలు నిషేధాజ్ఞలు విధిస్తున్నాయి. బ్రిటన్‌తో విమాన సర్వీసులపై నెదర్లాండ్స్‌, బెల్జియం, ఇటలీ ఇప్పటికే ఆంక్షలు ప్రకటించగా.. ఫ్రాన్స్‌, కెనడా, టర్కీ, డెన్మార్క్‌, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌, ఆస్ట్రియా, ఐర్లాండ్‌, ఇరాన్‌, క్రొయేషియా, అర్జెంటీనా, చిలీ, మొరాకో, కువైట్‌ కూడా తాజాగా ఆ జాబితాలో చేరాయి. బ్రిటన్‌తో సరిహద్దులన్నింటినీ మూసివేస్తున్నట్లు ఫ్రాన్స్‌ ప్రకటించింది. నూతన రకం కరోనా వైరస్‌ ఆనవాళ్లు తాజాగా ఇటలీలో కూడా బయటపడ్డాయి. దానికి సంబంధించిన ఓ కేసును తమ దేశంలో గుర్తించినట్లు ఇటలీ వైద్య శాఖ వెల్లడించింది.
70 శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తి
కొత్త రకం కరోనా వైరస్‌ ఇంతకుముందు వైరస్‌తో పోలిస్తే 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోంది. బ్రిటన్‌లో బుధవారం నుంచి నమోదైన మొత్తం కేసుల్లో 60 శాతానికి పైగా కొత్త వైరస్‌కు చెందినవేనని అధికారులు తెలిపారు.


టీకాల సమర్థతపై ప్రభావం ఉండకపోవచ్చు
‘ఈనాడు’తో ఆస్ట్రేలియా వైరాలజిస్టు శేషాద్రి వాసన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్న కొత్తరకం కరోనా వైరస్‌.. ‘ఎన్‌501వై’ అనే మార్పు (ఉత్పరివర్తన) కారణంగా ఉత్పన్నమైందని భారత సంతతి వైరాలజిస్టు ప్రొఫెసర్‌ శేషాద్రి వాసన్‌ తెలిపారు. వ్యాప్తి ఉద్ధృతంగా సాగుతున్నప్పటికీ.. దీనివల్ల తీవ్ర అనారోగ్యం కలుగుతుందనడానికి ఆధారాలు లేవన్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆధ్వర్యంలోని కామన్వెల్త్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (సీఎస్‌ఐఆర్‌వో)లో ప్రమాదకర సూక్ష్మజీవులపై పరిశోధన సాగిస్తున్న బృందానికి నేతృత్వం వహిస్తున్న వాసన్‌.. కొత్తరకం వైరస్‌పై తన పరిశీలనలను ‘ఈనాడు’తో పంచుకున్నారు. ‘‘ కొత్త రకం వల్ల తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ కలుగుతుందనడానికి ఆధారాల్లేవు. ఇప్పటికే రూపొందిన కొవిడ్‌-19 టీకాల సమర్థతనూ ఇది దెబ్బతీయకపోవచ్చు. కరోనా వైరస్‌లో వచ్చిన ‘డీ614జీ’ అనే ఉత్పరివర్తన (జి రకం)పై మా ప్రయోగశాల నిర్వహించిన పరిశోధన ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నా. జి రకం వల్ల టీకాల సమర్థతకు ఢోకా ఉండబోదని మేం రుజువు చేశాం.
జన్యుక్రమాలను ఆవిష్కరించకుంటే కష్టం: ప్రపంచవ్యాప్తంగా ప్రతి 279 కరోనా కేసుల్లో కనీసం ఒక కేసులో వైరస్‌కు సంబంధించిన జన్యుక్రమాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఫలితంగా.. వైరస్‌లో ఎలాంటి జన్యు ఉత్పరివర్తనలు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి వీలవుతోంది. భారత్‌లో మాత్రం ప్రతి 2733 కేసుల్లో ఒకదానిలోనే వైరస్‌ జన్యుక్రమాన్ని ఆవిష్కరిస్తున్నారు. అంటే.. 10 రెట్లు తక్కువగా దీన్ని చేపడుతున్నారన్నమాట. ఎన్‌501వై రకం వ్యాప్తిలో ఉన్న దేశాల నుంచి వచ్చే ‘కొవిడ్‌ పాజిటివ్‌’ ప్రయాణికులందరిలోని వైరస్‌ జన్యుక్రమాన్ని ఆవిష్కరించడం చాలా ముఖ్యం. లేకుంటే అది భారత్‌లోకి ప్రవేశించిందా.. లేదా.. అన్నది గుర్తించడం కష్టం. అలాగే.. దాని వ్యాప్తిని కట్టడి చేయడానికి అవసరమైన నిర్దిష్ట చర్యలనూ సకాలంలో తీసుకోలేరు’’.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని