మరో వేషంలో మహమ్మారి!

ప్రధానాంశాలు

మరో వేషంలో మహమ్మారి!

బ్రిటన్‌లో ఇంకో కొత్తరకం వైరస్‌
దక్షిణాఫ్రికాలో ఉత్పరివర్తనం..
ప్రయాణికుల ద్వారా లండన్‌కు చేరిక
ఇప్పటికే ఇద్దరిలో గుర్తింపు
మరింత ప్రమాదకారి...వ్యాప్తిలో శరవేగమే

లండన్‌: జన్యుమార్పిడి జరిగిన కరోనాతో కొద్ది రోజులుగా సతమతమవుతోందన్న బ్రిటన్‌కు మరో కొత్త బెడద ముంచుకొచ్చింది. దక్షిణాఫ్రికాలో మార్పు చెంది, అక్కడ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న ఇంకో కొత్త రకం కొవిడ్‌ వైరస్‌ తాజాగా లండన్‌కు చేరుకుంది. ఇద్దరు పౌరులు ఇప్పటికే దీని బారినపడినట్లు బ్రిటన్‌ ఆరోగ్య మంత్రి మట్‌ హన్‌కాక్‌ బుధవారం వెల్లడించారు. కొత్త రకం కరోనా(వియుఐ202012/01)ను మించిన వేగంతో వ్యాపించే లక్షణాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వైరస్‌కు ఉన్నాయని, ఉత్పరివర్తనం కూడా త్వరత్వరగా జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని వారాల క్రితం దక్షిణాఫ్రికాకు వెళ్లి వచ్చిన వారి ద్వారా ఇది తమ దేశానికి చేరి ఉంటుందని తెలిపారు. కొత్త రకాల వైరస్‌ వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ను మరిన్ని ప్రాంతాలకు విస్తరించి, ఆంక్షలను కఠినంగా అమలుచేయనున్నట్లు వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికుల రాకపోకలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గత 15 రోజుల్లో దక్షిణాఫ్రికాకు వెళ్లి వచ్చిన వారు వెంటనే స్వీయ ఏకాంతానికి వెళ్లాల్సిందిగా కోరారు. దక్షిణాఫ్రికా రకం వైరస్‌పై వాయవ్య ఇంగ్లాండ్‌లోని ప్రత్యేక ప్రయోగశాలలో పరీక్షలు చేయనున్నారు. బ్రిటన్‌లో బుధవారం ఒక్క రోజే 36 వేల మందికి పైగా వైరస్‌ బారిన పడ్డారు.

బ్రిటన్‌ ప్రయాణికుల్లో 11 మందికి కరోనా
దిల్లీ: కొత్త రకం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలను బుధవారం నుంచి ఈ నెలాఖరు వరకు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ గడువు లోగా ఇక్కడకు చేరుకున్న ప్రయాణికులందరికీ ఆర్టీపీసీఆర్‌ టెస్టుల్ని నిర్వహిస్తోంది. మంగళవారం రాత్రి నాలుగు విమానాల్లో దిల్లీకి చేరుకున్న వారిలో 11 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. మరో 50 మందిని క్వారంటైన్‌కు తరలించినట్లు జెనెస్ట్రింగ్స్‌ డయగ్నోస్టిక్‌ కేంద్రం వ్యవస్థాపకురాలు గౌరీ అగర్వాల్‌ బుధవారం దిల్లీలో వెల్లడించారు. దిల్లీ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించే బాధ్యతలను ఆ సంస్థ పర్యవేక్షిస్తోంది. ప్రతి ఒక్కరినీ నిశితంగా పరీక్షించిన తర్వాతే విమానాశ్రయం వెలుపలకు అనుమతిస్తున్నారు. దీంతో ప్రయాణికులు గంటల కొద్దీ అక్కడే నిరీక్షించాల్సి వచ్చింది. రాష్ట్రాల్లోనూ యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాల సేకరణ ప్రారంభమయ్యింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరోనా పాజిటివ్‌తో రాష్ట్రాలకు చేరుకున్న విదేశీ ప్రయాణికుల పరిస్థితి గురించి ఆరా తీశారు. గత 15 రోజుల్లో 33 మంది బ్రిటన్‌ నుంచి ఇండోర్‌కు వచ్చినట్లు గుర్తించిన మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం వారందరూ ఏకాంతంలో ఉండాలని ఆదేశించింది. మహారాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే కర్ణాటక ప్రభుత్వం కూడా పట్టణ ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో కర్ఫ్యూ విధించింది.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని