తొలి దశలో 3 కోట్ల మందికి ఉచిత టీకా

ప్రధానాంశాలు

తొలి దశలో 3 కోట్ల మందికి ఉచిత టీకా

50 ఏళ్లు పైబడిన వారికి ఎలా ఇవ్వాలన్న దానిపై కసరత్తు
కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా తొలిదశలో మూడు కోట్ల మంది కరోనా యోధులకు టీకా ఉచితంగా అందిస్తామని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. 50 ఏళ్లకు పైబడిన 27 కోట్ల మంది ప్రాధాన్య లబ్ధిదారులకు ఏ విధంగా అందించాలన్న దానిపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని ఆయన శనివారం ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘‘కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ తొలిదశలో దేశవ్యాప్తంగా ఉన్న కోటిమంది వైద్య సిబ్బంది, 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కి మాత్రమే ఉచితంగా అందిస్తాం. మిగిలిన 27 కోట్ల మంది ప్రాధాన్య లబ్ధిదారులకు జులైలోపు టీకా ఎలా అందించాలన్న దానిపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది’’ అని తెలిపారు. టీకా విషయంలో వచ్చే వదంతులను ఎవ్వరూ నమ్మొద్దన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. టీకా ప్రయోగాల సమయంలో భద్రత, సామర్థ్యం, రోగనిరోధకశక్తి పెంపొందించే విషయాల్లో ఎలాంటి రాజీ పడటంలేదన్నారు. వ్యాక్సిన్లు ప్రారంభించినప్పుడు వదంతులు సృష్టించడం గతంలోనూ జరిగిందని, పల్స్‌ పోలియో సమయంలో ఇలాంటివి చూశామన్నారు. కానీ నిదానంగా ప్రజలు వాటిని విస్మరించి పిల్లలకు పల్స్‌పోలియో వేయించడంవల్ల భారత్‌ పోలియో నుంచి విముక్తి పొందగలిగిందన్నారు. టీకా విషయంలో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి తాము 2 వేల మంది మాస్టర్‌ ట్రైనర్స్‌ను తయారుచేసినట్లు చెప్పారు. వీరి ద్వారా అన్ని రాష్ట్రాల్లో జిల్లా స్థాయుల్లో శిక్షణ పూర్తయిందని పేర్కొన్నారు.

డ్రైరన్‌ విజయవంతం
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శనివారం జరిగిన డ్రై రన్‌ విజయవంతమైందని హర్షవర్ధన్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎక్కడా ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదని తెలిపారు.  లబ్ధిదారుల డేటాను నవీకరించడం, టీకా కేటాయింపు, టీకా సమాచారాన్ని లబ్ధిదారులకు, వ్యాక్సిన్‌ వేసే వారికి మొబైల్‌ ద్వారా పంపించడం లాంటి రకరకాల కార్యక్రమాలను ఈ డ్రై రన్‌లో భాగంగా నిర్వహించారు.

రాజధానిలో ఉచితమే: దిల్లీ ఆరోగ్యమంత్రి
దేశ రాజధానిలోని ప్రజలందరికీ ఉచితంగా టీకా అందించనున్నట్లు దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్‌ శనివారం ప్రకటించారు. దరియాగంజ్‌లో వ్యాక్సిన్‌ డ్రైరన్‌ను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా టీకాను ఉచితంగా ప్రజలకు అందిస్తారా.. అన్న ప్రశ్నకు ‘అవును’ అని సమాధానమిచ్చారు. ఒక్కరోజులో లక్షమందికి టీకా వేసేందుకు అవసరమైన ఏర్పాట్లను దిల్లీ ప్రభుత్వం చేసిందని తెలిపారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని