close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పన్ను మాయం

కోట్లు కొల్లగొడుతున్న నకిలీ దందా
భారీగా జీఎస్టీ ఎగవేస్తున్న వ్యాపారులు
గుజరాత్‌, దిల్లీ, మహారాష్ట్ర తర్వాత తెలంగాణలో ఎక్కువ
ఈనాడు - హైదరాబాద్‌

సాంకేతికతను అడ్డుపెట్టుకుని... నూతన విధానాలను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు జీఎస్టీ ఎగవేతకు, పలు అక్రమాలకు తెర తీస్తున్నారు. బోగస్‌ కంపెనీలు, నకిలీ ఇన్‌వాయిస్‌లతో కోట్లాది రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడటమే కాకుండా భారీగా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) తీసుకుంటున్నారు. ఎలాంటి సంస్థలు లేకుండానే కాగితాలపైనే కంపెనీలను సృష్టిస్తున్నారు. బోగస్‌ కంపెనీల ద్వారానే నకిలీ ఇన్‌వాయిస్‌లను అందచేస్తున్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ పరిధిలో 40కి పైగా నకిలీ  బాగోతాలు  వెలుగు  చూడగా రూ.600  కోట్లకు పైగా అక్రమాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారాల్లో 50 మందికి పైగా అరెస్టయ్యారు. ఈ ఘటనల్లో దేశంలో గుజరాత్‌, దిల్లీ, మహారాష్ట్ర తర్వాత తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయని జీఎస్టీ అధికారులు పేర్కొన్నారు. కొందరు ఇతర రాష్ట్రాల్లో బోగస్‌ కంపెనీలను ఏర్పాటు చేసి తెలంగాణ కంపెనీలకు నకిలీ ఇన్‌వాయిస్‌లను ఇస్తున్నారు. మరికొందరు హైదరాబాద్‌ కేంద్రంగా వ్యాపార సంస్థలకు నకిలీ ఇన్‌వాయిస్‌లను ఇస్తున్నారు. 11 డొల్ల కంపెనీలను సృష్టించి సరకులు రవాణా చేయకుండానే నకిలీ ఇన్‌వాయిస్‌లను 200కి పైగా సంస్థలకు అందజేసిన వైనం ఇటీవల వెలుగులోకి వచ్చింది. తద్వారా రూ.67.76 కోట్ల జీఎస్టీ ఎగవేతకు పాల్పడిన ఘటన ఇటీవల మేడ్చల్‌ జీఎస్టీ కమిషనరేట్‌ పరిధిలో అధికారులు గుర్తించారు. సదరు వ్యాపారులు లెక్కల నిర్వహణ, ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలుతో పాటు జీఎస్టీ రిటర్న్‌లు పక్కాగా దాఖలు చేశారు. సరకు రవాణా అయినట్లు బ్యాంకు ఖాతాలకు మొత్తాన్ని జమ చేసేవారు. ఈసొమ్మును విత్‌డ్రా చేసి సుమారు 10 శాతం కమీషన్‌ తీసుకుని మిగిలిన సొమ్ము జమ చేసిన వారికి తిరిగి ఇచ్చేసిన వ్యవహారం వెలుగు చూసింది.  

పలు ఘటనలు వెలుగులోకి...
ఇటీవల రంగారెడ్డి, మేడ్చల్‌ జీఎస్టీ కమిషనరేట్‌ల పరిధిలో రెండు భారీ ఎగవేతలు వెలుగులోకి వచ్చాయి. రూ.139.93 కోట్ల విలువైన సరకులు రవాణా చేసినట్లు చూపి రూ.19.7 కోట్ల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ తీసుకున్న ఘటన వెలుగు చూసింది.
సుమారు రూ.2.8 కోట్ల పన్నును స్వాహా చేసిన ఘటనలో రంగారెడ్డి జీఎస్టీ కమిషనరేట్‌ అధికారులు గ్లాస్‌ కంపెనీపై కేసు నమోదు చేసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ను అరెస్టు చేయగా అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.
రంగారెడ్డి జీఎస్టీ కమిషనరేట్‌ పరిధిలో రూ.32.5 కోట్ల నకిలీ ఇన్‌వాయిస్‌ల వ్యవహారంలో బోగస్‌ కంపెనీలను ఏర్పాటు చేసి బోగస్‌ ఇన్‌వాయిస్‌లతో రూ.19 కోట్ల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ తీసుకున్న ఘటనతో పాటు.. తుక్కు పేరుతో సరకు రవాణా చేయకుండానే భారీగా ఐటీసీ పొందిన ఘటన వెలుగులోకి వచ్చింది.

అక్రమాలను గుర్తించేందుకు ప్రత్యేక విభాగం
అక్రమ లావాదేవీలను గుర్తించేందుకు వివిధ విధానాలను అనుసరిస్తున్నట్లు కేంద్ర జీఎస్టీ అధికారి ఒకరు తెలిపారు. కేంద్ర జీఎస్టీలోని ప్రత్యేక విభాగం డీజీజీఐ అప్‌లోడ్‌ చేసిన లావాదేవీలను విశ్లేషించి అక్రమాల గుట్టు వెలుగులోకి తెస్తోందన్నారు. అక్రమార్కులను గుర్తించేందుకు కేంద్ర జీఎస్టీకి చెందిన పలు విభాగాలు సాంకేతికత ఆధారంగా వివిధ మార్గాలు అనుసరిస్తున్నట్లు వివరించారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు