close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొనగానే నేరుగా తినకండి

కూరగాయలు, పండ్లను ఉప్పు లేదా బేకింగ్‌ సోడా నీటిలో కడిగాకే వండాలి
వాటిపై రసాయన అవశేషాలు ఉంటున్నాయి
‘ఈనాడు’ ఇంటర్వ్యూలో జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ జయలక్ష్మి

‘‘పంటలను తెగుళ్ల నుంచి కాపాడుకునేందుకు రైతులు విషపూరిత రసాయనాలను విస్తృతంగా చల్లుతున్నారు. పండ్లు, కూరగాయలపై రసాయన అవశేషాలుంటున్నట్లు శాస్త్రీయంగా నిర్వహించే పరీక్షల్లో గుర్తించాం. ప్రజలు వాటిని కొన్నప్పుడు నేరుగా కోసుకుని తినొద్దు’’ అని జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌- ఎన్‌ఐపీహెచ్‌ఎం) డైరెక్టర్‌ జనరల్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జయలక్ష్మి చెప్పారు. ఈ సంస్థ అధిపతిగా మూడేళ్లుగా పనిచేస్తున్న ఆమె దేశవ్యాప్తంగా పంటలపై తెగుళ్ల నియంత్రణకు అనేక కార్యక్రమాలను నిర్వహించారు. దేశమంతా పైర్లపై రసాయనాల వినియోగం నియంత్రించి పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ సంస్థ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ కేంద్రంగా పనిచేస్తోంది. సంస్థ కార్యకలాపాలపై ‘ఈనాడు’కు ఆమె ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు.

తెలుగు రాష్ట్రాల రైతులకు ఈ సంస్థ తరఫున ప్రత్యేకంగా ఏమైనా చేస్తున్నారా?
చాలా చేస్తున్నాం. ఉదాహరణకు పంటలను తినేస్తున్న ఎలుకలు, పండు ఈగ, పశువుల్లో నులిపురుగు వంటి వాటి నియంత్రణపై రైతులకు, పలు అంశాల్లో రెండు రాష్ట్రాల వ్యవసాయ, ఉద్యాన అధికారులకు శిక్షణ ఇస్తున్నాం. సూర్యాపేట, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాల్లో మొక్కల ఆరోగ్య క్లినిక్‌లు స్థాపించాం. రైతుల సమస్యల పరిష్కారానికి ఫోన్‌ ఇన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నిరంతరం పొలాలను సందర్శించి రైతులకు సూచనలిస్తున్నాం. వరంగల్‌ గ్రామీణ, నగర జిల్లాల్లో పురుగుమందుల నిర్వహణ ప్రాజెక్టు అమలుచేశాం. రసాయనాలకు బదులు జీవ పురుగుమందులు, జీవ ఎరువులు వాడటం వల్ల సాగువ్యయం తగ్గినట్లు తేలింది. రైతులకు వీటిపై శిక్షణ ఇస్తున్నాం.
మార్కెట్‌లో అమ్ముతున్న పండ్లు, కూరగాయలపై రసాయన అవశేషాలుంటే ప్రజలెలా గుర్తించాలి?
వాటిపై తక్కువ స్థాయిలో అవశేషాలుంటున్నట్లు మా ప్రయోగశాల పరీక్షల్లో గుర్తించాం. ఈ అవశేషాలను గుర్తించడానికి ఆధునాతన పరికరాలతో ప్రయోగశాలలో పరీక్షలు అవసరం. సులభంగా గుర్తించే పద్ధతులింకా అందుబాటులోకి రాలేదు.
మరి వాటి నుంచి జనం తమ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి?
కూరగాయలు కొని నేరుగా వాటిని కోసి ఎట్టి పరిస్థితుల్లో వండుకోవద్దు. తప్పనిసరిగా నల్లా నుంచి ధారగా వచ్చే నీటిలో శుభ్రంగా కడగాలి. తర్వాత గోరువెచ్చని నీటిలో బేకింగ్‌ సోడా లేదా ఉప్పు వేసి అందులో కూరగాయలు కొద్దిసేపు ఉంచి మళ్లీ కడగాలి. దీనివల్ల రసాయన అవశేషాలుంటే చాలా వరకూ తొలగిపోతాయి.
రసాయనాలను చల్లే సమయంలో రైతులేం జాగ్రత్తలు తీసుకోవాలి?
కరోనా నియంత్రణకు ఆస్పత్రుల్లో వైద్యులు పీపీఈ కిట్లు ఎలా ధరిస్తున్నారో అచ్చం అలాగే రైతులు కూడా తప్పకుండా అవే కిట్లు ధరించాలి. చేతులకు రబ్బరు తొడుగులు వేసుకుని మాత్రమే మందులు చల్లాలి.
కూరగాయలు, పండ్లపై రసాయనాల గుర్తింపు ఫలితాలను నెలవారీగా ప్రజలకు ఎందుకు  వెల్లడించడం లేదు?
నెలవారీగా వాటిని కేంద్ర వ్యవసాయశాఖకు పంపుతున్నాం. అక్కడి నుంచే విడుదల చేయాలనే నిబంధనలున్నాయి.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే ఏం చేయాలి?
ఇందుకోసం కేంద్రం ఏడు పద్ధతులను సూచించింది. పంట ఉత్పాదకతను పెంచడం, పశువుల ఉత్పాదకతను అధికం చేయడం, వనరుల వినియోగం, సాగువ్యయం తగ్గింపు, అధిక విలువ ఉన్న పంటల సాగు, వాటికి ఎక్కువ ధరలు వచ్చేలా చూడటం, వ్యవసాయంతో పాటు రైతులు ఇతర పనులను చేయడంతో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యవసాయాభివృద్ధి పథకాలను కర్షకులు సక్రమంగా వినియోగించుకుంటే మేలు. రైతులు జీవ పురుగుమందుల వాడకానికి మొగ్గుచూపుతున్నారు. వాటిని రైతులే సొంతంగా తయారుచేసుకుని, వినియోగించుకునేలా జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ శాస్త్రీయంగా శిక్షణ ఇస్తోంది.
నిరక్షరాస్యులైన రైతులకు శాస్త్రీయ అవగాహన ఎలా కల్పిస్తున్నారు?
‘రైతుల క్షేత్ర పాఠశాల’ అనే కార్యక్రమం ద్వారా ప్రయత్నం చేస్తున్నాం. రైతులు నేరుగా పొలాలను పరిశీలించి అక్కడ జరుగుతున్న ప్రయోగాలను ప్రత్యక్షంగా చూసి నేర్చుకుంటారు. ఈ సంస్థలోనే రైతు సలహా కేంద్రం కూడా ఏర్పాటుచేశాం. వారికి ఏ సందేహాలున్నా ఈ కేంద్రం ద్వారా సమాధానాలిస్తాం.
రసాయన పురుగుమందుల మోతాదును తగ్గించడమెలా?
మందులను పిచికారీ చేయడానికి ఆధునాతన యంత్రాలను వాడితే సరైన మోతాదులో తక్కువ మందులతోనే తెగుళ్లను తగ్గించవచ్చని పరిశోధనల్లో గుర్తించాం. నాణ్యమైన పురుగుమందుల ఎంపిక, పిచికారీ విషయంలో ఈ సంస్థ అవగాహన కల్పిస్తుంది. దీనివల్ల సాధారణ పద్ధతిలో వాడేదానికన్నా చాలా ఆదా అవుతుంది. గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనే కార్యక్రమం ద్వారా రసాయన మందుల వాడకం తగ్గించి పంటలను కాపాడుకునే విధానాలపై మా సంస్థ అవగాహన కల్పిస్తోంది. జీవ పురుగుమందులు, ఎరువులు, వానపాముల ఎరువు వంటివాటితో పాటు వాటి వాడకానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్తున్నాం. 
ఇందుకోసం తెలంగాణ, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో మూడేళ్లపాటు అధ్యయనం చేశాం. విచక్షణారహితంగా రసాయనాల  వాడకంతో కలిగే నష్టాలపైనా అవగాహన  కల్పిస్తున్నాం.

- ఈనాడు, హైదరాబాద్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు