రిపబ్లిక్‌డే రోజునే ర్యాలీ

ప్రధానాంశాలు

రిపబ్లిక్‌డే రోజునే ర్యాలీ

26న దిల్లీ శివారులోనే ట్రాక్టర్లతో నిర్వహించి తీరుతాం
రైతు నాయకుల ప్రకటన
నేడు సుప్రీంకోర్టులో విచారణ

దిల్లీ: వ్యవసాయ చట్టాలపై చిక్కుముడి వీడడం లేదు. తమకు హాని కలిగించే వీటిని ఉపసంహరించాలని రైతులు డిమాండు చేస్తుండగా, ఆ మాటే లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. వీటి రద్దు కోసం 26న గణతంత్ర వేడుక రోజున ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి తీరుతామని రైతు నాయకులు ప్రకటించారు. ఇలా చేస్తే గణతంత్ర ఉత్సవాలకు ఆటంకం కలుగుతుందని, నిలుపుదల చేయించాలని దిల్లీ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆందోళన జరుగుతున్న సింఘు సరిహద్దులో రైతు సంఘం నాయకుడు యోగేంద్ర యాదవ్‌ విలేకరులతో మాట్లాడుతూ ‘‘గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీ అవుటర్‌ రింగ్‌ రోడ్డులో ట్రాక్టర్ల ర్యాలీ జరుపుతాం. ఈ ప్రదర్శన చాలా శాంతియుతంగా ఉంటుంది. రైతులు తమ ట్రాక్టర్లపై జాతీయ జెండాను ఉంచుతారు. గణతంత్ర దినోత్సవ కవాతుకు దీనివల్ల ఎలాంటి ఆటంకమూ ఉండబోదు’’ అని తెలిపారు. పంజాబ్‌లోని లుధియాను నుంచి ఇప్పటికే ట్రాక్టర్లలో రైతులు బయలుదేరారు.

రైతులు ట్రాక్టర్ల ర్యాలీ జరపకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం తరఫున దిల్లీ పోలీసులు దాఖలుచేసిన వ్యాజ్యం సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. రిపబ్లిక్‌ దినోత్సవం నాడు కవాతుతో పాటు, మూడు రోజుల ముందు నుంచి రిహార్సలు కూడా జరుగుతాయని, రైతుల ప్రదర్శన వల్ల వీటికి ఆటంకం కలుగుతుందని తెలిపింది. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. దీంతో పాటుగా వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన దావా కూడా విచారణకు రానుంది. రైతుల ఆందోళనను పరిష్కరించడానికి సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ నుంచి రైతు నాయకుడు భూపీందర్‌ సింగ్‌ మాన్‌ తప్పుకోవడంపైనా విచారణ ఉంటుంది.

రేపు క్లాజులవారీగా చర్చిద్దాం: తోమర్‌
చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించినందున వాటిని రద్దు చేయాలన్న డిమాండును విడనాడాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ రైతులను కోరారు. మంగళవారం జరిగే పదో విడత చర్చల్లో చట్టాల్లోని క్లాజుల వారీగా సంప్రదింపులు జరుపుదామని సూచించారు. ప్రభుత్వం కొన్ని సవరణలు సూచించినా, రైతులు పట్టువిడుపులు చూపడం లేదని అన్నారు. వారు చెప్పే ప్రత్యామ్నాయాలను స్వీకరిస్తామని చెప్పారు.

నిపుణుల కమిటీ సమావేశం కూడా రేపే
రైతుల ఆందోళన వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మంగళవారం భేటీ కానుంది. పూసాలోని వ్యవసాయ పరిశోధన కేంద్రం క్యాంపస్‌లో ఇది జరగనుంది. ఈ కమిటీ నుంచి భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు భూపీందర్‌ సింగ్‌ మాన్‌ రాజీనామా చేసినప్పటికీ మిగిలిన ముగ్గురూ సమావేశం కానున్నారు. ప్రస్తుతం ఈ కమిటీలో షేత్కార్‌ సంఘటన అధ్యక్షుడు అనిల్‌ ఘనవత్‌, వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త అశోక్‌ గులాటీ, అంతర్జాతీయ ఆహార పరిశోధన సంస్థ దక్షిణాసియా డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ జోషి సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుత సమస్యపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై తొలుత వీరు చర్చలు జరపనున్నారు.

మే 2024 వరకు కొనసాగిస్తాం: తికాయత్‌
రైతుల పోరాటం ‘భావజాల ఉద్యమం’ అని దీన్ని మరో మూడేళ్లు కొనసాగిస్తామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్‌ తికాయత్‌ చెప్పారు. నాగ్‌పుర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కనీస మద్దతు ధర అంశాన్ని చట్టంలోనే పెట్టాలని డిమాండు చేశారు. ఈ కోర్కెల సాధనకు వచ్చే లోక్‌సభ ఎన్నికలు జరిగే 2024 ఏప్రిల్‌- మే వరకు ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉద్యమంలో పాల్గొంటున్నవారిపైనా, మద్దతిస్తున్నవారిపైనా ప్రభుత్వం కేసులు పెట్టడాన్ని ఖండించారు. సింఘులో మరో రైతు నాయకుడు దర్శన్‌ పాల్‌ సింగ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థచే కేసులు పెట్టిస్తోందని విమర్శించారు.


రైతుల ధర్నాకు పలు సంఘాల సంఘీభావం

ఈనాడు, దిల్లీ: కార్పొరేట్‌ కంపెనీల లాభాల కోసం రైతుల ప్రయోజనాలను దెబ్బతీయొద్దని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. దేశ ప్రజల మనోభావాలు గుర్తించి వ్యవసాయ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. దిల్లీ సమీప సింఘు సరిహద్దు వద్ద ఆందోళన చేస్తున్న అన్నదాతలకు తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, టీఎస్‌ యూటీఎఫ్‌, సీఐటీయూ, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన పలు యువజన, విద్యార్థి సంఘాల నాయకులు ఆదివారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రైతులకు మద్దతుగా దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలోకి వస్తున్నారని తెలిపారు. రైతుల ఉద్యమానికి దిల్లీ, కేరళ ప్రభుత్వాల తరహాలో తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని కోరారు. టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావా రవి, మాట్లాడుతూ ఈ పోరాటం స్ఫూర్తిగా విద్యారంగంలో కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు పోరాడాలని కోరారు. రైతు ఉద్యమానికి సంఘీభావంగా టీఎస్‌ యూటీఎఫ్‌ తరఫున రూ.3 లక్షలు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని