
ప్రధానాంశాలు
బైడెన్ ప్రమాణ స్వీకారం రోజున దాడులకు దిగే ప్రమాదం
అప్రమత్తమైన అమెరికా యంత్రాంగం
భారీగా దళాల మోహరింపుతో సైనిక స్థావరంలా మారిన రాజధాని
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకార సందర్భంగా రాజధాని వాషింగ్టన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. భద్రతలో పాల్గొనే సిబ్బందే దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న హెచ్చరికలు రావడంతో రక్షణ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అంతర్గత దాడులు జరుగుతాయన్న అంచనాలు ఉన్నా, విధుల్లో పాల్గొనే భద్రత సిబ్బందే తిరుగుబాటు చేసి దాడులకు పాల్పడవచ్చన్న విషయం ఆందోళనకు గురిచేస్తోంది. ట్రంప్ అనుచరులు కూడా సాయుధ హింసకు దిగుతారన్న సమాచారం మేరకు కనీవిని రీతిలో భద్రత బలగాలను మోహరించి నగరాన్ని మిలటరీ కంటోన్మెంట్‌గా మార్చేశారు. క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదార్లు జరిపిన దాడిలో కొందరు పోలీసులు కూడా పాల్గొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొనే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
భద్రత నిమిత్తం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25వేల మంది నేషనల్ గార్డులను నగరంలో మోహరించారు. వేల సంఖ్యలో స్థానిక పోలీసులు ఉన్నారు. విపరీత భావజాలంతో వీరిలో ఎవరైనా దాడికి దిగవచ్చన్న సమాచారం అందడంతో మొత్తం సిబ్బంది అందర్నీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కమాండర్లందర్నీ రక్షణ శాఖ కార్యదర్శి రేయన్ మెక్‌కార్తీ ఆదేశించారు. ఎవరిపైనా అయినా ఏమాత్రం అనుమానం వచ్చినా రెండుమూడు సార్లు తనిఖీ చేయాలని సూచించారు. తీవ్రవాద భావజాలం ఉన్నవారి గురించి సైనికాధికారులు తరచూ తనిఖీలు చేస్తునే ఉంటారు. దానికి తోడుగా నిఘా సంస్థ అయిన ఎఫ్‌బీఐ కూడా ఆ పనిచేస్తోంది. గతంలోనూ అంతర్గత తీవ్రవాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే వాటిని ఇస్లామిక్ ఉగ్రవాదుల సానుభూతిపరులు చేసేవారు. కానీ ప్రస్తుతం ట్రంప్ అభిమానులు, శ్వేతజాతి అహంకార వాదులు, అతివాదులు కూడా దాడులు చేసే ప్రమాదం ఉండడంతో భద్రతా దళాలు కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నాయి. ఒక్క వాషింగ్టన్లోనే కాకుండా మొత్తం 50 రాష్ట్రాల రాజధానుల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
జవాన్లతో స్వయంగా మాట్లాడుతున్న అధిపతి
నేషనల్ గార్డులు వాషింగ్టన్ వచ్చిన వెంటనే వారితో ఆ సంస్థ అధిపతి జనరల్ డేనియల్ ఆర్ హోకన్సన్ స్వయంగా మాట్లాడుతున్నారు. ‘‘మన జవాన్లుగానీ, వాయుసేన ఉద్యోగులుగానీ తీవ్రవాద భావజాలంతో మాట్లాడుతున్నట్టు సమాచారం అందితే వారిని వెంటనే పోలీసులకు అప్పగిస్తాం. లేదంటే కమాండ్‌లోనే తగిన చర్యలు తీసుకుంటాం’’ అని స్పష్టం చేస్తున్నారు. ఏర్పాట్లపై వాషింగ్టన్ మేయర్ మురియల్ బౌజర్ మాట్లాడుతూ ‘‘దేశభక్తులమని చెప్పుకొనే వారు తమ సొంత ప్రభుత్వాన్ని కూలదోస్తారని, పోలీసు అధికారులను చంపేస్తారని ఎన్నడూ అనుకోలేదు. కానీ జరిగింది. అందుకే ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా పోలీసులు, ఫెడరల్ పోలీసులతో సమన్వయంతో వ్యవహరిస్తున్నారు’’ అని చెప్పారు. ఆన్లైన్లో ఎక్కువ సేపు మాట్లాడుతున్న వారి సమాచారం కూడా సేకరిస్తున్నట్టు ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టొఫర్ వేరీ తెలిపారు. చిన్న చిన్న గుంపులుగా వచ్చి ఆయుధాలు, పేలుడు పదార్థాలతో దాడి చేసే అవకాశం ఉండడంతో వాటిని ఎదుర్కోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ట్రంప్ మద్దతుదార్లు పలు రాష్ట్రాల్లోని చట్టసభల భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూ ఆందోళనలు చేస్తున్నారు.
వీడ్కోలు లేఖ సంప్రదాయానికి ట్రంప్ స్వస్తి?
శ్వేత సౌధాన్ని విడిచిపెట్టే ముందు ప్రస్తుత అధ్యక్షుడు కొత్త అధ్యక్షునికి శుభాకాంక్షలు చెబుతూ వీడ్కోలు లేఖ రాయడం సంప్రదాయంగా వస్తోంది. 1989లో రొనాల్డ్ రీగన్ దీనికి శ్రీకారం చుట్టారు. బైడెన్ ఎన్నికనే గుర్తించని ట్రంప్ దీన్ని పాటిస్తారన్న సూచనలు కనిపించడం లేదు. 2017లో పదవి నుంచి దిగిపోయే ముందు ఒబామా కూడా ట్రంప్‌నకు లేఖ రాశారు. ‘‘ఇది చాలా విశిష్ఠమైన కార్యాలయం. విజయానికి కచ్చితమైన నమూనా అంటూ ఉండదు. ఈ విషయంలో నేనేమీ సలహా ఇవ్వలేను. అయితే మనం ఇందులో తాత్కాలికంగా ఉండేవారమే. ప్రజాస్వామ్య సంస్థలు, సంప్రదాయాలకు మనం రక్షకులుగా ఉండాలి. అవి మనకు ఏ స్థాయిలో అందాయో కనీసం అదే విధంగా విడచిపెట్టి వెళ్లాలి’’ అని పేర్కొన్నారు. ఒబామా ఏ ఉద్దేశంతో రాశారోగానీ ట్రంప్ మాత్రం ప్రజాస్వామ్య విలువలను ధ్వంసం చేశారన్న విమర్శలు వస్తున్నాయి.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ఏంటీ ఇవన్నీ రీమేక్‌లా..!
- నాపై నాకే చిరాకేసింది: బెన్‌స్టోక్స్
- పెళ్లి కుదిరాక నిరాకరించాడని!
- అర్ధరాత్రి ఆకలేస్తోందా...
- నెలకు రూ.8వేలు రావాలంటే...
- రివ్యూ: ఏ1 ఎక్స్‌ప్రెస్
- క్యాస్టింగ్ కౌచ్‌ని ఎదిరించి.. సినిమాల్లో రాణించి..!
- ప్రభాస్‌తో ఫరియా.. పాయల్ తెలుగు.. శ్రీముఖి సెల్ఫీ
- మనసుకు నచ్చినవాడిని మనువాడి...
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్