close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొవిడ్‌ టీకా అలజడి 

టీకా వేయించుకున్న అంబులెన్సు డ్రైవర్‌ 15 గంటల తర్వాత గుండెపోటుతో మృతి
 మృతుడు నిర్మల్‌ జిల్లావాసి
టీకా కారణం కాదన్న ఆరోగ్యశాఖ
కారణాల అన్వేషణకు విచారణ

ఈనాడు- హైదరాబాద్‌, నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: కొవిడ్‌ టీకా తీసుకున్న ఓ అంబులెన్సు డ్రైవర్‌ గుండెపోటుతో మరణించడం కలకలం రేకెత్తించింది. నిర్మల్‌ జిల్లా కుంటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఉదయం 11.30 గంటలకు ‘కొవిషీల్డ్‌’ టీకా వేయించుకున్న విఠల్‌రావు (42) ఆరోజు అర్థరాత్రి దాటాక గుండెపోటుతో చనిపోయాడు. అతడి మరణానికి టీకాయే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. అది కారణం కాదని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు అన్నారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు. కొవిడ్‌ టీకాలు పొందిన తర్వాత ఇప్పటి వరకూ దేశంలో ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందగా.. ఇది మూడోది. అయితే ఈ మూడు మరణాలూ టీకాల వల్ల కాకుండా ఇతరత్రా కారణాల వల్లే సంభవించాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ ఘటనపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆరాతీసింది. సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశించింది.
ఏం జరిగింది?
నిర్మల్‌ జిల్లా ఓల గ్రామానికి చెందిన విఠల్‌రావు కుంటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 108 అంబులెన్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 19న అదే ఆరోగ్య కేంద్రంలో ఉదయం 11.30 గంటలకు టీకా తీసుకున్నాడు. దాదాపు 2 గంటలు అధికారుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఇక్కడ విఠల్‌రావు సహా 79 మందికి టీకాలిచ్చారు. సాయంత్రం 5 గంటల వరకూ పీహెచ్‌సీలో డ్యూటీ చేసిన విఠల్‌రావు ఇంటికి వెళ్లాక అర్థరాత్రి 2.30 గంటలకు ఛాతీలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పాడు. తనే అంబులెన్సుకు ఫోన్‌ చేసి రమ్మన్నాడు. సిబ్బంది నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తన బావకు ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని, టీకా తీసుకున్న తర్వాతే అనారోగ్యానికి గురయ్యాడని విఠల్‌రావు బావమరిది సదాశివ్‌ ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. విఠల్‌రావుకు రూ. 10 లక్షల వరకూ బీమా సొమ్ము వచ్చే అవకాశం ఉందని, అతడి భార్యకు విద్యార్హతలను బట్టి సంస్థలో ఉద్యోగాన్ని ఇస్తామని 108 అంబులెన్సుల నిర్వాహణ సంస్థ ఈఎంఆర్‌ఐ చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి పి.బ్రహ్మనందరావు వెల్లడించారు.
తీవ్ర దుష్ప్రభావమైతే వెంటనే కనిపిస్తుంది: ఆరోగ్యశాఖ
విఠల్‌రావు మరణం టీకా దుష్ఫలితాల వల్ల జరిగి ఉండదని వైద్యఆరోగ్యశాఖ తేల్చిచెప్పింది. నివేదికలు వచ్చాక పూర్తి వివరాలు వెల్లడవుతాయని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. ‘ఒక వాయిల్‌లో 10 మందికి టీకా ఇస్తారు. ఒకవేళ దుష్ప్రభావం కలిగితే అందరికీ రావాలి. ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 79 మందికి టీకాలిచ్చారు. సాధారణంగా టీకా వల్ల దుష్ఫలితాలు ఎదురైతే వెంటనే కనిపిస్తాయి. కానీ విఠల్‌రావు టీకా తీసుకున్నాక సాయంత్రం వరకూ డ్యూటీలోనే ఉన్నాడు. టీకా వల్ల మరణించాడని భావించడానికి అవకాశాలు లేవు’ అని తెలిపారు.
నేడు మళ్లీ ప్రారంభం
కొవిడ్‌ టీకా వేసుకున్నాక ఒక వ్యక్తి మృతిచెంది అలజడి రేగడంతో గురువారం వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా కొనసాగించడంపై ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. అన్ని జిల్లాల వైద్యాధికారులతో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ బుధవారం దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. వైద్యసిబ్బందిలో ధైర్యాన్ని నింపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మరణం టీకా వల్ల జరిగింది కాదనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ఆరోగ్యశాఖ ఆదేశించింది.
సమగ్ర విచారణకు ఆదేశం
కొవిడ్‌ టీకా తీసుకున్న 24 గంటల్లోపే వ్యక్తి మృతి చెందడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ‘దుష్ఫలితాల పర్యవేక్షక కమిటీ’కి చెందిన 15 మంది జిల్లా సభ్యులు సమగ్ర విచారణ చేపట్టారు. నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. టీకా ఇచ్చిన దగ్గర చర్మం, కండరాన్ని సేకరించారు. గుండె, ఊపిరితిత్తులు, జీర్ణకోశం తదితర అవయవాల నమూనాలు, రక్తనమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. పాథాలజీ పరీక్షల్లో టీకా రియాక్షన్‌ వల్ల జరిగిన మరణమా? గుండెపోటు వల్ల మరణమా? అనేది స్పష్టమవుతుందని నిపుణులు తెలిపారు. టీకా వాయల్స్‌ నమూనాలను కూడా సేకరించి పరీక్షలకు పంపించారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు