
ప్రధానాంశాలు
పంచాయతీ ఎన్నికలపై 37 పేజీల తీర్పు ఇచ్చిన హైకోర్టు
షెడ్యూలును నిలుపుదల చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల రద్దు
ఎన్నికల షెడ్యూలు విడుదల చేయడం ద్వారా రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతను నెరవేర్చడంతో పాటు, రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ తన అధికారాన్ని వినియోగించారు. ఈ క్రమంలో ఆయన దురుద్దేశంతో వ్యవహరిస్తే.. ఆ విషయాన్ని తగిన సాక్ష్యాలతో కోర్టుకు వివరించాలి. కానీ ప్రభుత్వం అలా చెప్పలేకపోయింది.
- హైకోర్టు ధర్మాసనం
ఈనాడు, అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమం చేస్తూ హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఇచ్చిన షెడ్యూలును సస్పెండ్ చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దుచేసింది. ఎన్నికలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ఎన్నికలు, కరోనా టీకా ప్రక్రియ రెండూ ప్రజలకు ప్రాధాన్యం ఉన్న కార్యక్రమాలని.. ఈ రెండింటినీ సజావుగా నిర్వహించి విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల షెడ్యూలును నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు.. ఎన్నికల సంఘానికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులపై ప్రభావం చూపుతున్నాయని తేల్చిచెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం 37 పేజీల తీర్పు వెల్లడించింది.
అప్పీలుకు విచారణార్హత ఉంది
ఎస్ఈసీ దాఖలు చేసిన అప్పీలుకు విచారణార్హత లేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) శ్రీరామ్ చేసిన వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులు కూడా తీర్పేనని, అప్పీలుకు విచారణ అర్హత ఉందని స్పష్టం చేసింది. లోతైన విచారణ జరపకుండా, ఇరుపక్షాల హక్కులు, బాధ్యతల్ని పరిగణనలోకి తీసుకోకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు తుది ఆదేశాల్లా ఉన్నాయని ఎస్ఈసీ తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. పంచాయతీ ఎన్నికల కాలపరిమితి ముగియడంతో కమిషనర్ తన చట్టబద్ధమైన అధికారాన్ని వినియోగించారని తేల్చి చెప్పింది. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించారని గుర్తుచేసింది. ఎన్నికల నిర్వహణను వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు సమర్థించాయని తెలిపింది. టీకా కార్యక్రమం గురించి కమిషనర్ స్పష్టంగా చర్చించారని.. టీకా కార్యక్రమం విజయవంతం కావడంలో దిగువస్థాయి నాయకత్వం కీలకపాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారని గుర్తుచేసింది.
ఎన్నికలు నిలిచిపోకుండా న్యాయస్థానం రక్షణగా ఉండాలి
‘సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలిస్తే.. ఎన్నికల ప్రక్రియ నిలిచిపోకుండా, జాప్యం జరగకుండా, అడ్డంకులు కలగకుండా న్యాయస్థానం రక్షణగా నిలవాలి. భారత ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలే.. రాష్ట్ర ఎన్నికల సంఘాలకూ ఉంటాయని ‘కిషన్‌సింగ్ తోమర్’ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఈసీ స్వతంత్రంగా విధులు నిర్వర్తించొచ్చని పేర్కొంది. ఎన్నికల నిర్వహణ అధికారం పూర్తిగా ఎన్నికల సంఘానికి ఉంటుందని విస్పష్టంగా తెలిపింది. అంతేకాక అధికరణ 243(కె)(3) ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్వతంత్ర హోదా ఉంటుంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని.. ఎన్నికల షెడ్యూలు విషయంలో ఎస్ఈసీ ఈనెల 8న ఇచ్చిన ఉత్తర్వులను సింగిల్ జడ్జి సస్పెండ్ చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నాం. ఆ ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం. ఎన్నికలు, టీకా కార్యక్రమాల్ని సజావుగా విజయవంతం చేయాలని ఆదేశిస్తున్నాం’ అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది.
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు: ఎస్ఈసీ
ఏపీలో పంచాయతీ ఎన్నికలు గతంలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే 4 దశల్లో జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనరు (ఎస్ఈసీ) రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని ఆయన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఉన్న అవరోధాల్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు డివిజన్ బెంచ్ తొలగించింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తామని, ఎన్నికల తేదీలను మార్చాలని కోరబోమని రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే ధర్మాసనానికి తెలియజేసింది. ఇదివరకు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది’ అని ఎస్ఈసీ వెల్లడించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని చెప్పారు. ఈ విషయాన్ని కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇప్పటికే సూచించానని తెలిపారు. మరోవైపు రమేశ్‌కుమార్ శుక్రవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నట్లు తెలిసింది.
ప్రధానాంశాలు
దేవతార్చన

- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- థ్యాంక్స్ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
- టీమ్ఇండియా ఇలా చేయదు కదా..!
- మొతేరా పిచ్: కోహ్లీతో విభేదించిన కుక్
- భారత్ విజయంపై బ్రిటిష్ మీడియా అక్కసు
- రివ్యూ: చెక్
- ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది!
- గ్లామర్ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు
- మీ అసలు స్వభావాన్ని గుర్తుచేసుకోండి!
- ‘మొతేరా’ విజయ రహస్యం చెప్పిన అజ్జూభాయ్!