close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బీటెక్‌లో మరో 10,000 సీట్లు!

డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో 60,000
ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు చేస్తే పెరగనున్న సీట్లు 70,000
వచ్చే విద్యా సంవత్సరానికే వర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: ఉన్నత విద్యలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) 10 శాతం కోటా అమలు చేస్తే రాష్ట్రంలో అన్ని కోర్సుల్లో కలిపి కనీసం 70,000 సీట్లు పెరగనున్నాయి. ఒక్క బీటెక్‌లోనే ప్రస్తుతం లక్ష సీట్లు ఉండడంతో మరో 10,000 వరకు పెరుగుతాయి. డిగ్రీలో కనీసం 40,000 సీట్లు అధికమవుతాయి. ఇక బీఫార్మసీ, ఎంబీఏ, బీఈడీ, లా, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ తదితర ఉన్నత విద్యలో అన్ని కోర్సుల్లో 10 శాతం అదనంగా సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ సీట్లకు కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షలలోపు ఉన్న జనరల్‌ కేటగిరీ విద్యార్థులు పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది. ఒకరకంగా సూపర్‌ న్యూమరరీ సీట్లుగా చెప్పుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ కళాశాలల్లోనూ..
రాష్ట్రంలోని ఉన్నత విద్యనందించే అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనూ సీట్లు 10 శాతం పెంచాల్సి ఉంటుంది. 14 ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 3,200 వరకు బీటెక్‌ సీట్లు ఉండగా 10 శాతం కోటా ప్రకారం 320 సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయి. సర్కారు కళాశాలల్లో ఫీజు ఏడాదికి రూ.18,000 మాత్రమే కావడంతో పేద విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఇప్పటివరకు బీటెక్‌లో సెక్షన్‌కు 60 సీట్లు ఉండేవి. ఈ కోటా అమలు చేస్తే ఒక్కో సెక్షన్‌కు 6 సీట్లు చొప్పున అదనంగా వస్తాయి. ఫలితంగా సెక్షన్‌కు 66 సీట్లవుతాయి. ఇతర కోర్సుల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది.

వచ్చే ఏడాది నుంచే!
ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేయాలన్నది స్పష్టం చేయలేదు. వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పినా ఈ విద్యా సంవత్సరం దాదాపు అన్ని ప్రధాన కోర్సుల్లో ప్రవేశాలు ముగిశాయి. ఎంసెట్‌ ఎప్పుడో పూర్తయింది. ఐసెట్‌ రెండు విడతలు, స్పాట్‌ ప్రవేశాలు పూర్తయ్యాయి. పీజీఈసెట్‌, ఎడ్‌సెట్‌ కూడా అదే పరిస్థితి. ఇక ప్రవేశాలు మొదలుకానిది సీపీగెట్‌, వ్యాయామ విద్య మాత్రమే. వీటికి ఆయా శాఖలు జీఓలు ఇవ్వాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల నుంచి ఉన్నత విద్యలో సీట్ల భర్తీతోపాటు ఉద్యోగాల్లోనూ ఈ కోటాను అమలు చేస్తోంది. రాష్ట్రాలకు మాత్రం రెండేళ్ల గడువు ఇచ్చింది. ఆ ప్రకారం 2020-21 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రం ఈ కోటాను అమలు చేయాలి. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ కోర్సుల్లో మాత్రం 15 శాతం జాతీయ కోటా ఉన్నందున 2018-19 విద్యా సంవత్సరం నుంచే రిజర్వేషన్‌ అమలవుతోంది.


ఎంసెట్‌లోనే 20 వేల మందికి అర్హత

కోటా అమలైతే ఏటా ఒక్క ఎంసెట్‌లోనే  20 వేలమంది ఈడబ్ల్యూఎస్‌ కోటాకు పోటీపడే అవకాశం ఉంది. ఉదాహరణకు ఎంసెట్‌-2020లో 28,101 మంది ఓసీలు ర్యాంకులు పొందారు. వారిలో 20 వేలమంది వరకు ఈడబ్ల్యూఎస్‌ కోటాకు అర్హులు ఉంటారని అధికారవర్గాల అంచనా. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఎంతోమంది విద్యార్థులకు ఊరట ఇస్తుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య తుమ్మల పాపిరెడ్డి అన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు