
ప్రధానాంశాలు
వీరిలో 8 మంది మహిళలే
కంటెయినర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు
వరి నాట్లు వేసి ఆటోలో ఇంటికి వెళుతుండగా ప్రమాదం
మరో 8 మందికి తీవ్రగాయాలు
ఈనాడు, నల్గొండ - న్యూస్టుడే, దేవరకొండ: వారంతా రెక్కాడితేగాని డొక్కాడని వ్యవసాయ కూలీలు. రోజంతా వరి నాట్లు వేసి అలసిన శరీరాలతో సాయంత్రం ఆటోలో ఇళ్లకు బయలుదేరారు. వీరు రోడ్డెక్కిన పది నిమిషాల్లోనే కంటెయినర్ రూపంలో మృత్యుశకటం ఎదురుగా దూసుకొచ్చి ఆటో డ్రైవర్ సహా 9 మందిని బలిగొంది. హైదరాబాద్-సాగర్ రహదారిపై నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి (పీఏపల్లి) మండలం అంగడిపేట స్టేజీ వద్ద గురువారం సాయంత్రం 6.20 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆటోలో డ్రైవర్ మినహా మిగిలిన 19 మంది మహిళా కూలీలే. ఈ ఘటనలో మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, బాధితులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం..
దేవరకొండ మండలం చింతబాయి గ్రామానికి చెందిన 20 మంది వ్యవసాయ కూలీలు 40 కిమీ దూరంలోని పీఏపల్లి మండలం రంగారెడ్డిగూడెంలో వరి నాట్లు వేయడానికి ఉదయం ఆటోలో వెళ్లారు. పని ముగించుకొని సాయంత్రం తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో అంగడిపేట స్టేజ్ వద్ద సాగర్ వైపు వెళ్తున్న కంటెయినర్ ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆటోని ఢీకొట్టి కొద్దిదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు దేవరకొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరు హైదరాబాద్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తీవ్రంగా గాయపడిన 8 మందిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. స్వల్పంగా గాయపడిన మరో ముగ్గురికి దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కంటెయినర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం, అతివేగంతో ఢీకొట్టడం, ఆటోలో పరిమితికి మించి కూలీలు ఉండటంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని ఎస్పీ రంగనాథ్ ‘ఈనాడు’కు వెల్లడించారు. మృతులను దేవరకొండ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించడంతో ఆసుపత్రి ప్రాంగణమంతా వారి బంధువుల రోదనలతో నిండిపోయింది.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు..
ప్రమాదంలో ఆటో డ్రైవర్, కూలీ కొట్టం మల్లేశ్(36)తో పాటు అతడి భార్య చంద్రకళ(30), తల్లి పెద్దమ్మ (56) మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మల్లేశ్, చంద్రకళ దంపతులకు 10, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులున్నారు. తల్లిదండ్రులు, నాయనమ్మ మృతితో ఆ చిన్నారులు దిక్కులేనివారయ్యారు.
రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయాలతో ఆసుపత్రిలో చేరిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
కూలి ఎక్కువని పోయాం
మా దగ్గర రోజు కూలి రూ.250 ఇస్తున్నారు. రంగారెడ్డిగూడెంలో రూ.400 కూలి ఇస్తుండటంతో 20 మందిమి ఆటోలో వెళ్లాం. రోజంతా పనిచేసి తిరిగి వస్తుండగా బయల్దేరిన పది నిమిషాల్లోనే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. నేను ఆటో వెనకాల కూర్చోవడంతో లారీ తగలగానే రోడ్డు మీద పడిపోయిన. నా కళ్ల ముందే మావోళ్లంతా చనిపోయారు.
- నోముల యాదమ్మ, ఆటోలో ప్రయాణిస్తున్న కూలీ
మృతుల వివరాలు
1. కొట్టం మల్లేశ్ (36) (ఆటో డ్రైవర్, కూలీ)
2. కొట్టం చంద్రకళ (30) (మల్లేశ్ భార్య)
3. కొట్టం పెద్దమ్మ (56) (మల్లేశ్ తల్లి)
4. నోముల సైదమ్మ (38)
5. నోముల అంజమ్మ (50)
6. నోముల పెద్దమ్మ (42)
7. గొడుగు ఇద్దమ్మ (55)
8. గొడుగు లింగమ్మ (45)
9. గొడుగు అలివేలు (50)
ప్రధానాంశాలు
దేవతార్చన

- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- థ్యాంక్స్ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
- మొతేరా పిచ్: కోహ్లీతో విభేదించిన కుక్
- టీమ్ఇండియా ఇలా చేయదు కదా..!
- భారత్ విజయంపై బ్రిటిష్ మీడియా అక్కసు
- రివ్యూ: చెక్
- ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది!
- మీ అసలు స్వభావాన్ని గుర్తుచేసుకోండి!
- గ్లామర్ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు
- ‘మొతేరా’ విజయ రహస్యం చెప్పిన అజ్జూభాయ్!