
ప్రధానాంశాలు
ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మారిన లక్ష మందికి పైగా విద్యార్థులు
ఫీజు బకాయిల పేరుతో పలుచోట్ల టీసీలు ఇవ్వని యాజమాన్యాలు
పాఠశాలలు తెరిచాక ఈ సమస్యలు పెరిగే అవకాశం!
ఈనాడు, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలికను.. ఆమె తండ్రి ఉట్నూరులోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. నెలలు గడుస్తున్నా ప్రైవేట్ పాఠశాల టీసీ ఇవ్వడం లేదని తండ్రి వాపోతున్నారు. ఆ పాఠశాలలో పేరు తొలగిస్తేనే ప్రభుత్వ బడిలో పేరు నమోదు చేయడానికి వీలవుతుంది. తన కుమార్తె ఆన్లైన్లో పాఠాలు వినకున్నా ఫీజు చెల్లించాలని యాజమాన్యం అడుగుతోందని వీఆర్ఓగా పనిచేస్తున్న ఆ తండ్రి ఆరోపిస్తుండగా.. గత ఏడాది ఫీజు బకాయి కూడా చెల్లించలేదని యాజమాన్యం చెబుతోంది.
* కరీంనగర్ జిల్లాలో నలుగురు విద్యార్థులు ఓ ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరారు. ఆ నలుగురు విద్యార్థుల పేర్లను తమకు తెలియకుండా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆన్లైన్(చైల్డ్ ఇన్ఫో) నుంచి తొలగించారని ప్రైవేటు పాఠశాల యాజమాన్యం విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే పిల్లల తల్లిదండ్రులు లేఖలు రాసి ఇచ్చారని, వాటిని ఎంఈఓకు పంపి... ఆయన ఆమోదంతో చైల్డ్ ఇన్ఫో నుంచి తొలగించామని ప్రధానోపాధ్యాయుడు ఆధారాలు సమర్పించారు.
కరోనా పరిస్థితుల్లో ఆదాయాలు తగ్గడంతో వేలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల నుంచి సర్కారు బడుల్లో చేర్పించారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం ఇలా మారిన వారి సంఖ్య లక్ష దాటింది.
ఈ క్రమంలో బదిలీ ధ్రువపత్రం(టీసీ) కోసం తల్లిదండ్రులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు మధ్య పలుచోట్ల వివాదాలు తలెత్తుతున్నాయి. ఫీజు బకాయిలు ఉన్నాయని ప్రైవేటు యాజమాన్యాలు చెబుతుండగా.. ఆన్లైన్లో పాఠాలు వినకున్నా ఫీజులు అడుగుతున్నారని తల్లిదండ్రులు అంటున్నారు.
టీసీ ఎందుకంటే?
విద్యార్థుల పూర్తి వివరాలను ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసి.. పాఠశాల విద్యాశాఖలోని సమగ్ర శిక్షా అభియాన్ విభాగం చైల్డ్ ఇన్ఫో పేరిట ఆన్లైన్లో నమోదు చేస్తోంది. దీంతో ఒక విద్యార్థి పేరు ఒక పాఠశాలలో మాత్రమే నమోదవుతుంది. బడి మారినప్పుడు పాత పాఠశాలలో పేరు తొలగించకుంటే కొత్త బడిలో నమోదు కాదు. ఇక్కడే సమస్య వస్తోంది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రుల మధ్య వివాదాలకు దారితీస్తోంది.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే...
విద్యా హక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకు టీసీలు లేకున్నా పాఠశాలలు విద్యార్థులను చేర్చుకోవాల్సిందే. తిరస్కరించడానికి వీల్లేదు. చేర్చుకున్న అనంతరం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాత బడి ప్రధానోపాధ్యాయుడికి లేఖ రాసి టీసీ తెప్పించుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లేఖ తీసుకొని ఎంఈఓకు సమాచారం ఇచ్చి పాత బడిలో పేరు తొలగించవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి బడులు తెరిస్తే ఇంకా వందలాది చోట్ల టీసీల సమస్యలు తలెత్తనున్నాయని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో పాత పాఠశాలలో ఫీజు బకాయిలు ఉంటే ఏం చేయాలనే అంశంపై విద్యాశాఖ అధికారులు తాజాగా మార్గదర్శకాలు ఇస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
* ఫీజులు చెల్లించకుండా విద్యార్థులు వెళ్లిపోతున్నందున ఆయా పాఠశాలల నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం(ఎన్ఓసీ) ఉంటేనే వారిని వేరే పాఠశాలలు చేర్చుకోవాలని ట్రస్మా ప్రతినిధులు ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ఆ యాడ్లోని చిన్నారి కృతిశెట్టినే..!
- బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
- సమ్మర్ మూడ్లో కీర్తి.. బికినీలో బిపాస..
- రేపటి సిరులు
- రాళ్లు రువ్వి.. వెంబడించి
- తల్లికాబోతున్న హీరోయిన్ రిచా
- వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
- తెలంగాణలో ఏ ఆసుపత్రుల్లో టీకా వేస్తున్నారంటే..
- కొండంత లక్ష్యం పిండి చేసి..
- మోదీ గర్వించదగిన వ్యక్తి: గులాం నబీ ఆజాద్