టీకాపై రాజకీయాలను పట్టించుకోలేదు

ప్రధానాంశాలు

టీకాపై రాజకీయాలను పట్టించుకోలేదు

శాస్త్రవేత్తల మాటకే విలువిచ్చాం
వ్యాక్సిన్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని, భయాలను తొలగించాలి
అందరిపై ఈ బాధ్యత ఉంది
ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ

లఖ్‌నవూ: టీకా అనుమతులు విషయంలో రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని, శాస్త్రవేత్తల మాటకే విలువిచ్చామని.. వారి సలహాలనే పాటించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శుక్రవారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలోని వైద్యులు, వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని సంభాషించారు. టీకా కార్యక్రమానికి సంబంధించి వారి అనుభవాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘మొదట్లో నాపై విపరీతమైన ఒత్తిడి ఉండేది. టీకా ఎందుకు ఇంకా రాలేదు. ఎందుకింత ఆలస్యం జరుగుతోంది అంటూ ప్రశ్నలపై ప్రశ్నలు. రాజకీయాల్లో ఇక్కడొక మాట అంటారు. అక్కడొక మాట అంటారు. వారందరికీ ఒకటే చెప్పాను. టీకా విషయంలో శాస్త్రవేత్తలే నిర్ణయం తీసుకోవాలని, అది రాజకీయనాయకుల పని కాదని. ఎప్పుడైతే శాస్త్రవేత్తలు టీకా సిద్ధమని ప్రకటించారో తొలి దశలో కరోనా యోధులకు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నా’’ అని చెప్పారు. కరోనా టీకాపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని, భయాలను తొలగించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందాన్నరు. ముఖ్యంగా వైద్యులు, వైద్యసిబ్బంది టీకాకు క్లీన్‌చిట్‌ ఇస్తే ప్రజల్లో టీకా సామర్థ్యంపై నమ్మకం పెరుగుతుందని చెప్పారు.

ఆస్ట్రేలియాపై విజయం.. ఆత్మనిర్భర్‌ భారత్‌కు సంకేతం

తేజ్‌పుర్‌(అసోం): కరోనాపై పోరాటం నుంచి క్రికెట్‌ మైదానం వరకు.. అన్ని రంగాల్లో ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ కనబడుతోందని, ఇందుకు తాజా ఉదాహరణ ఆస్ట్రేలియాలో మన క్రికెట్‌ జట్టు విజయమేనని మోదీ పేర్కొన్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌  ద్వారా అసోంలోని తేజ్‌పుర్‌ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో విద్యార్థులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయోగాలకు భయపడొద్దని, విజయం కోసం పోరాడాలని విద్యార్థులకు సందేశమిచ్చారు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య విజయం సాధించిందని, ఓటమి ఎదురైనా, గాయాల పాలైనా, నిరాశ చెందలేదని.. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుందని ప్రధాని చెప్పారు. అనుభవం లేని ఆటగాళ్లు ఉన్నా.. వారిలో సంకల్ప బలం పుష్కలంగా ఉందని, అందుకే ఎంతో అనుభవమున్న ఆస్ట్రేలియా జట్టును ఓడించి చరిత్ర సృష్టించారని చెప్పారు. ఈ విజయం నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఉన్నాయని వివరించారు. సామర్థ్యంపై నమ్మకం ఉంచి.. సానుకూలంగా ఆలోచిస్తే విజయాలు అసాధ్యం కాదన్న విషయాన్ని ఇది నిరూపించిందని చెప్పుకొచ్చారు. కరోనాపై పోరాటంలోనూ భారత్‌ అదే సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లిందని అన్నారు. వనరులు అంతగా లేని భారత్‌ ఈ పోరాటంలో ఓడిపోతుందని చాలా మంది భావించారని, కానీ మనం విజయవంతంగా ఆ సవాల్‌ను అధిగమించామన్నారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని