close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇక ప్రైవేటు వైద్య సిబ్బంది వంతు

నేటి నుంచి 1.90 లక్షల మందికి టీకా
50 మంది దాటితే వ్యాక్సిన్‌ కేంద్రం
ప్రభుత్వ, ప్రైవేటులో 400 కేంద్రాలు అందుబాటులోకి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవలందిస్తోన్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్యసిబ్బందికి కొవిడ్‌ టీకాలు వేసేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి రాష్ట్రంలోని 1.90 లక్షల మంది ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకాలు ఇవ్వడానికి వైద్యఆరోగ్యశాఖ సన్నాహాలు చేసింది. ఇంతకుముందు ఇచ్చిన మార్గదర్శకాల్లో 100 మందికిపైగా సిబ్బంది ఉన్న ఆసుపత్రుల్లో టీకాల వేసే కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించారు. ఆ నిబంధనలను సడలించిన వైద్యఆరోగ్యశాఖ తాజాగా నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. 50 మందికిపైగా సిబ్బంది ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఒక ఆసుపత్రిలో 500-1000 మంది వరకూ వైద్యసిబ్బంది ఉంటే.. అలాంటి చోట్ల కేంద్రాల సంఖ్యనూ పెంచనున్నారు.

ఈ నెల 16న రాష్ట్రంలో కొవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగా తొలివారంలో ప్రభుత్వ వైద్యసిబ్బందికే టీకాలను వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైద్యసిబ్బంది కలిపి 1.60 లక్షల మంది అర్హులైన లబ్ధిదారుల జాబితాను కొవిన్‌ యాప్‌లో పొందుపర్చారు. వీరిలో ఈ నెల 22 నాటికి 1.10 లక్షల(64 శాతం) మంది మాత్రమే టీకాలను పొందారు. వేర్వేరు కారణాల వల్ల కొందరు టీకాలు వేసుకోవడాన్ని వాయిదా వేసుకోగా కొందరు మాత్రం టీకాలు అవసరం లేదని తిరస్కరించారు. టీకాలు పొందడం స్వచ్ఛందం కావడంతో తిరస్కరించిన సిబ్బందిని పక్కనబెట్టి ఇతరత్రా కారణాల వల్ల టీకాలు వేయించుకోని లబ్ధిదారులకు మరోసారి అవకాశం కల్పించనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. దాదాపు 400 కేంద్రాల్లో టీకాలు వేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేసి ఉండడంతో.. వీటిలో ప్రైవేటు వైద్యసిబ్బందితో పాటు ఇప్పటి వరకూ టీకాలు పొందని ప్రభుత్వ వైద్యసిబ్బందికీ వేయనున్నట్లు పేర్కొన్నాయి. ప్రైవేటులో టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను స్వీకరించాలని ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలను ఆరోగ్యశాఖ కోరింది.

వైద్యఆరోగ్యశాఖ తాజాగా జారీచేసిన మార్గదర్శకాలు
* ప్రైవేటు వైద్యసిబ్బందికి టీకాల కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ప్రతి ఆసుపత్రికి ఒక నోడల్‌ అధికారి ఉండాలి. వీరు కచ్చితమైన సమాచారాన్ని పొందుపర్చడం, మౌలిక వసతులు కల్పించడం, సజావుగా పంపిణీ కొనసాగించేలా చర్యలు తీసుకోవడంపై దృష్టిపెట్టాలి.
* టీకా కేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని నియమించుకోవడంలో ఆయా జిల్లా వైద్యాధికారులు చర్యలు చేపట్టాలి.
* 50 మంది కంటే తక్కువ సిబ్బంది ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బందికి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రులతోపాటు టీకాల కేంద్రాలకు అనుమతి పొందిన ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వేస్తారు. ఇందుకనుగుణంగా వారికి సమీపంలోని ఏ ఆసుపత్రికి వెళ్లాలనే సమాచారాన్ని ముందే తెలియజేస్తారు.
* ఒక్కో టీకా కేంద్రంలో రోజుకు వందమంది కంటే ఎక్కువ మందికి టీకాలను వేయకూడదు.
* సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని టీకాలు వేసే కార్యక్రమాన్ని ఉదయం 9 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 3 గంటలకల్లా ముగించాలి.
* ఆది, బుధ, శని వారాలు మినహా సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించాలి.
* అన్ని టీకా కేంద్రాల్లోనూ దుష్ఫలితాలను ఎదుర్కోవడానికి ప్రత్యేక చికిత్స కిట్లను అందుబాటులో ఉంచాలి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు