close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మన మార్కెట్లు మరింత బలోపేతం

కొత్త చట్టాల వల్ల వాటికి ఆదాయం రాకున్నా బేఫికర్‌
నిధులిచ్చి ఆదుకుంటాం.. ఇకపైనా కొనసాగిస్తాం
రాష్ట్ర వ్యవసాయ శాఖ పనితీరు మారాల్సిందే
జిల్లా అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం
ఈనాడు - హైదరాబాద్‌

‘‘వ్యవసాయ శాఖ అంటే కాగితం, కలంతో పనిచేయడమని కాకుండా పొలం, హలం శాఖగా మారాలి. వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల పనితీరులో గుణాత్మక, గణనీయ మార్పు రావాలి. తెలంగాణలో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ శాఖల ప్రాధాన్యం, బాధ్యత ఎంతగానో పెరిగాయి. వ్యవసాయంలో పంటల మార్పిడి, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు పెంచేందుకు వ్యవసాయ శాఖ తీవ్రంగా కృషిచేయాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టీకరించారు.  ప్రగతిభవన్‌లో ఆదివారం జిల్లా స్థాయి వ్యవసాయ, మార్కెటింగ్‌ అధికారులతో ఆయన సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వ్యవసాయాభివృద్ధి-రైతు సంక్షేమం విషయంలో ఈ రెండు శాఖల బాధ్యతలను ఆయన విడమరచి చెప్పారు. దాదాపు 8 గంటల సుదీర్ఘ సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
‘‘రైతులు పంటలను మార్కెట్‌లో అమ్ముకునేందుకు సరైన పద్ధతులు అవలంబించేలా చూడాల్సిన బాధ్యత మార్కెటింగ్‌ శాఖపై ఉంది. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల ఫలితంగా దేశవ్యాప్తంగా మార్కెటింగ్‌ వ్యవస్థ ఎలా మారినా, తెలంగాణలో మాత్రం మరింత బలోపేతం చేస్తాం. రైతులు పంటను అమ్ముకోవడానికి వ్యవసాయ మార్కెట్లే వేదిక. రాష్ట్రంలో వాటిని కొనసాగిస్తాం. రైతులు ఓ పద్ధతి ప్రకారం వచ్చి మార్కెట్లో పంటలు అమ్ముకునే విధానం తీసుకురావాలి. ఏ గ్రామానికి చెందిన రైతులు ఏ రోజు మార్కెట్‌కు రావాలో నిర్ణయించి టోకెన్లు జారీచేయాలి. ఏ పంటకు ఎక్కడ మంచి ధర ఉందనే విషయంలో రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు చేయాలి. ఇందుకోసం మార్కెటింగ్‌ శాఖలో పరిశోధనా, విశ్లేషణా విభాగం ఏర్పాటుచేయాలి. కొత్త చట్టాల అమలు వల్ల మార్కెట్‌ రుసుం పేరుతో ఆదాయం రాకున్నా ప్రభుత్వమే నిధులను సమకూర్చి మార్కెటింగ్‌ శాఖను బలోపేతం చేస్తుంది. మార్కెట్లవారీగా ఎంత ధాన్యం వస్తోంది, అక్కడి వ్యాపారులకు ఎంత కొనుగోలు శక్తి ఉన్నదనే వివరాలు సేకరించాలి.

ఒకే పంట వద్దు

రైతు ఎప్పుడూ ఒకే పంట వేసే విధానం పోవాలి. పంట మార్పిడి వల్ల ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయి. గ్రామాల్లో కూలీల కొరత ఉంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాలి. పంటల సాగు విధానంలో ఆధునిక పద్ధతులు రావాలి. ఈ అంశాలపై రైతులకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి.

నేడు రాష్ట్రంలో కోటీ పదిలక్షల టన్నుల ధాన్యం పండిస్తున్నాం. భారీ ప్రాజెక్టుల నుంచి కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించుకోగలుగుతాం. బోర్ల ద్వారా మరో 40లక్షల ఎకరాలకు పైగా నీరు అందుతుంది. ఏడాదికి 4 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తిచేసే గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందుతోంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయశాఖ ఎంతో బలోపేతం కావాలి. అధికారులు అడుగడుగునా రైతులకు అండగా నిలవాలి.

పది రోజుల్లో లెక్కలివ్వాలి..
పది రోజుల్లోగా రాష్ట్రంలోని ఏ గుంటలో ఏ పంట వేశారనే విషయంలో సరైన లెక్కలివ్వాలి. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన రైతువేదికలను వెనువెంటనే వినియోగంలోకి తేవాలి. రైతులతో అక్కడ సమావేశాలు ఏర్పాటుచేయాలి. వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ), రైతుబంధు సమితి కార్యాలయాలూ రైతువేదికలోనే భాగం కావాలి. అవసరమైన ఫర్నిచర్‌ ఇతర వసతులూ కల్పించాలి.

దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌
అమెరికా, చైనా, రష్యా, జపాన్‌, ఇజ్రాయిల్‌ లాంటి దేశాల్లో జరిగిన విజయ గాథలను ఇంతవరకు విన్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌గా నిలిచింది. రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి వంద శాతం నల్లాల ద్వారా నీరందించి నంబర్‌ వన్‌గా నిలవడం ‘మిషన్‌ భగీరథ’ వల్ల సాధ్యమైంది. దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న కరెంటు సమస్యను పరిష్కరించుకున్నాం. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులకు 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసుకోగలుగుతున్నాం. రెవెన్యూలో జటిల సమస్యలను పరిష్కరించుకున్నాం. ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూములు రికార్డుల నిర్వహణను, రిజిస్ట్రేషన్లను, మ్యుటేషన్లను సులభతరం చేసుకున్నాం. పల్లె ప్రగతి ద్వారా గ్రామసీమల రూపురేఖలే మారిపోయాయి. అన్ని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటయ్యాయి. డంప్‌ యార్డులు, శ్మశానవాటికలు, రైతు వేదికలు, కల్లాలు అందుబాటులోకి వచ్చాయి. ఇలా ప్రతీ రంగంలోనూ ఎన్నో అద్భుత విజయాలు తెలంగాణ సాధించింది. వ్యవసాయరంగంలోనూ విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

పంట మార్పిడితో ఎంతో మేలు
రాష్ట్రంలో పంట మార్పిడి వల్ల ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయి. రైతు వేదికలకు మిషన్‌ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేయాలి. ఏ క్లస్టర్‌లో అయినా ఏ కారణం చేతనైనా ఏఈఓ పోస్టు ఖాళీ అయితే తక్షణం తాత్కాలిక పద్ధతిలో మరొకరిని నియమించాలి’’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.

సీఎం కీలక నిర్ణయాలు..

* వరిసాగులో ఆధునిక పద్ధతులు వచ్చాయి. వెదజల్లే పద్ధతి ద్వారా ఎకరానికి రూ.10వేల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.
* పత్తిలో ఒకేసారి దూది తీసేసి పంటను ముగించే పద్ధతి వచ్చింది. ఇంకా అనేక పంటల్లో కొత్త వంగడాలు, కొత్త పద్ధతులు వచ్చాయి. వాటిపై రైతులకు అవగాహన కల్పించాలి.
* యాంత్రీకరణ పెంచడానికి ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది.
* మండల వ్యవసాయాధికారులను ఆగ్రానమిస్టులుగా మార్చడానికి నిరంతరం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి.
* ఆధునిక సాగు పద్ధతులను అధ్యయనానికి వ్యవసాయాధికారులు ఇజ్రాయిల్‌లో పర్యటించాలి.
* పప్పుదినుసులు, నూనెగింజల సాగును ప్రోత్సహించి ఇవి పండించే ప్రాంతాల్లో దాల్‌ మిల్లులు, ఆయిల్‌ మిల్లుల ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపుతుంది.
* ఆయిల్‌పామ్‌ మిల్లులు ఏర్పాటుచేయాలి. ఇందుకోసం వ్యూహాత్మక కేంద్రాలను గుర్తించాలి.
* వ్యవసాయ పనిముట్లు రైతులకు కిరాయికి ఇచ్చేలా గ్రామీణ ప్రాంతాల్లో యంత్రాల సేవా కేంద్రాలు  ఏర్పాటుచేయాలి.
* మార్కెట్లలో వ్యాపారులకు లైసెన్స్‌ ఇచ్చే విషయంలో సులభతరమైన విధానాలను తీసుకురావాలి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు