close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇన్వెస్టర్లూ పారాహుషార్‌

స్వల్పకాలంలో భారీ లాభాలు అత్యాశే
దూకుడుగా వెళ్తే నష్టపోయే అవకాశం
నాణ్యమైన కంపెనీలను ఎంచుకోవడం మేలు
కంపెనీల ఎంపికలో జాగ్రత్త అవసరం

జి.సుబ్బారావు
ఈనాడు - హైదరాబాద్‌

ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను స్టాక్‌మార్కెట్లు ప్రతిఫలిస్తాయి. పతనం, వృద్ధి ఏదైనా.. మార్కెట్లు ముందే స్పందిస్తాయి. ఆర్థికాభివృద్ధి వచ్చే ఏడాది నుంచి బాగుంటుందంటే, ఇప్పటి నుంచే పెరుగుతాయి. ఇప్పుడు జరుగుతోంది అదే.

దేశ ఆర్థిక వ్యవస్థ కొవిడ్‌-19 ప్రభావం నుంచి ఇంకా కోలుకోలేదు. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో సాధించిన 4.18 శాతం వృద్ధి రేటే తక్కువనుకుంటే, కరోనా మహమ్మారి వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో జీడీపీ వృద్ధి లేకపోగా, క్షీణతను నమోదు చేయనుంది. ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. కానీ స్టాక్‌మార్కెట్‌ సూచీలేమో అనూహ్యంగా గరిష్ఠ స్థాయుల్లో దూసుకుపోతున్నాయి. 2020 మార్చిలో కొవిడ్‌ లాక్‌డౌన్‌ ప్రారంభంలో ఒక్కసారిగా పతనమైన స్టాక్‌మార్కెట్లు ఆపై నెమ్మదిగా కోలుకున్నాయి. నవంబరు నుంచి పట్టపగ్గాల్లేకుండా సూచీలు లాభపడుతూ వచ్చాయి. గురువారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 50,000 పాయింట్ల చరిత్రాత్మక స్థాయిని సైతం అందుకుంది. తదుపరి లాభాల స్వీకరణతో, శుక్రవారం సాయంత్రానికి సెన్సెక్స్‌ 49,000 పాయింట్ల దిగువకు వచ్చింది. ఇటీవల సూచీల దూకుడుతో ఎంతో మంది కొత్త మదుపరులు స్టాక్‌మార్కెట్లో అడుగుపెట్టారు. లాభాలు అధికంగా వస్తాయనే ఆశతో పెద్దఎత్తున షేర్లపై పెట్టుబడులు పెడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకోని నేపథ్యంలో, మదుపరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...

తదితర అంశాలపై...
‘లాక్‌డౌన్‌’ ఆంక్షలు తొలగిపోవడం, కొవిడ్‌ ముప్పు కొంత తగ్గడం, టీకా ఆవిష్కరణ వల్ల ఆర్థిక కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. విద్యుత్తు వినియోగంతో పాటు వాహన అమ్మకాలు పెరుగుతున్నాయి. రుణాల్లో వృద్ధి కనిపిస్తోంది. మళ్లీ ప్రైవేటు పెట్టుబడులు మొదలయ్యే సంకేతాలున్నాయి.
స్థిరీకరణ, రుణాల రికవరీపై దృష్టి సారించడం వల్ల బ్యాంకులు బలోపేతమై, వ్యాపార సంస్థల విస్తరణ అవసరాలకు అనుగుణంగా రుణాలిచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. కార్పొరేట్ రంగాన్ని చూస్తే.. ఎన్నో సంస్థలు అప్పులు తగ్గించుకున్నాయి. గత కొన్నేళ్లలో జీఎస్‌టీ- ఐబీసీ(దివాలా స్మృతి) అమలుకు తోడు కొవిడ్‌ పరిణామాల వల్ల బలహీన కార్పొరేట్ సంస్థలు మూతపడగా, తట్టుకున్నవి బలోపేతమయ్యాయి. ఇలా నిలిచిన సంస్థల మార్కెట్ వాటా, ఆదాయాలు పెరుగుతున్నాయి. అందువల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం, ఆపై ఏడాది భారత్‌ అధిక వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అదే స్టాక్‌మార్కెట్‌కు ఇంధనం.

స్టాక్‌మార్కెట్‌ జోరు
ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను స్టాక్‌మార్కెట్లు ప్రతిఫలిస్తాయి. పతనం, వృద్ధి ఏదైనా.. మార్కెట్లు ముందే స్పందిస్తాయి. ఆర్థికాభివృద్ధి వచ్చే ఏడాది నుంచి బాగుంటుందంటే, ఇప్పటి నుంచే పెరుగుతాయి. ఇప్పుడు జరుగుతోంది అదే. ఆర్థిక వ్యవస్థ బాగా లేకపోయినా, సమీప భవిష్యత్తులో కోలుకుంటుందని, కంపెనీలు అధిక ఆదాయాలు నమోదు చేస్తాయనే అంచనాలతో షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ముందుకొస్తున్నారు. కొత్త ఇన్వెస్టర్లకు అనుగుణంగా డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య వేగంగా పెరుగుతోంది.

అప్రమత్తత అవసరం
షేర్ల ధరలు, స్టాక్‌మార్కెట్‌ సూచీల్లో హెచ్చుతగ్గులు సహజం. సూచీలు బాగా పెరిగినందున ‘దిద్దుబాటు’కు అస్కారం ఉందని, అది ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేమని స్టాక్‌మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. దీనికి తోడు కేంద్ర బడ్జెట్‌..అనేది పెద్ద సందర్భం. అమెరికాలో కొత్త అధ్యక్షుడి నిర్ణయాలు ఎలా ఉంటాయి, దాని ప్రభావం అమెరికా/ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మీద ఎలా ఉంటుందనేదీ కీలకమే. దూకుడుగా స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న యువ ఇన్వెస్టర్లకు ‘మార్కెట్‌ రిస్క్‌’పై అవగాహన ఉండకపోవచ్చు. కాస్త అటూఇటూ అయినా భారీనష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుందనేది వారు గుర్తించాలి. అప్రమత్తత పాటించటం, లాభాల్లో ఉంటే కొంతైనా వెనక్కి తీసుకోవడం, స్థిరంగా ఆదాయాలు ఆర్జించే కంపెనీల మీద పెట్టుబడులు కొనసాగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

* 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో -23.9%, రెండో త్రైమాసికంలో -7.5% వృద్ధి నమోదయ్యాయి. మూడు, నాలుగో త్రైమాసికాల్లో సానుకూల వృద్ధి నమోదవుతుందనే అంచనాలున్నాయి.

పరుగుకు కారణాలు పరిశీలిస్తే..

* వడ్డీరేట్లు బాగా తక్కువగా ఉన్నాయి. ఏడాది కాలానికి బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేటు 5- 5.5% ఉంది. దీనికంటే ఎక్కువ ప్రతిఫలం వస్తుందనే ఆశతో షేర్లలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు.
* ప్రపంచ వ్యాప్తంగానూ ఇదే పరిస్థితి. ఎన్నో దేశాల్లో సున్నా వడ్డీకి రుణాలు లభిస్తున్నాయి. దీంతో పలు విదేశీ సంస్థలు అధిక లాభాల కోసం మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఇందులో ఎక్కువ సొమ్ము స్టాక్‌మార్కెట్లోకి ప్రవహిస్తోంది. గత త్రైమాసికంలో విదేశీ సంస్థలు రూ.లక్షన్నర కోట్లకు పైగా ఈక్విటీలో పెట్టుబడులు పెట్టడం గమనార్హం.
* కేంద్ర ప్రభుత్వం ఇటీవల కార్మిక, వ్యవసాయ మార్కెటింగ్‌ సంస్కరణలు చేపట్టింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ)ను ప్రకటించి, ఎలక్ట్రానిక్స్‌, జౌళి, ఆహార తయారీ, విద్యుత్తు వాహనాలు, టెలికం విడిభాగాల రంగాల్లోకి పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. దీన్ని సానుకూల సంకేతంగా స్టాక్‌మార్కెట్ మదుపరులు భావిస్తున్నారు.
* కొవిడ్‌-19 తర్వాత విదేశీ సంస్థలు ‘చైనా ప్లస్‌ వన్‌’ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇది మనదేశానికి కలిసివస్తోంది.
* దేశీయంగా ద్రవ్యోల్బణం-వడ్డీరేట్లు పెరగనంత వరకు స్టాక్‌మార్కెట్లోకి నిధులు ప్రవాహం కొనసాగుతుందని నిపుణుల అంచనా.

సరి‘దిద్దు’కోడానికి సదవకాశం

* కేంద్ర బడ్జెట్, ఆపై రుతుపవనాల తీరుతెన్నులు, కంపెనీల ఆదాయ అంచనాలు సమీప భవిష్యత్తులో స్టాక్‌మార్కెట్ల గమనాన్ని నిర్దేశిస్తాయి. సూచీలు గరిష్ఠ స్థాయిలో ఉన్నందున మదుపరులు కొంత మేరకు లాభాలు స్వీకరించడం మేలు.
* తమ షేర్ల(పోర్ట్‌ఫోలియో) జాబితాను సరిదిద్దుకోడానికి మదుపరులకు ఇది సరైన సమయం. అంచనాలకు అనుగుణంగా లేని షేర్లను విక్రయించి, ఆ సొమ్మును వృద్ధి బాటలో ఉన్న కంపెనీలకు మళ్లించవచ్చు. తద్వారా ‘పోర్ట్‌ఫోలియో’ను దృఢంగా మార్చుకోవచ్చు.
* ఇతర ఇన్వెస్టర్లతో పోల్చితే మనం వెనుకబడిపోతున్నామనే ఆలోచన స్టాక్‌ మార్కెట్‌ మదుపర్లను వెంటాడుతూ ఉంటుంది. ఫలానా వారు చెప్పారని, ఒక పెద్ద ఇన్వెస్టర్‌ కొంటున్నాడని, మంచి ‘టిప్‌’ అనుకుని ఏవేవో కంపెనీల షేర్లను అధిక ధరల్లో కొని, ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. కొత్త ఇన్వెస్టర్లకు ఈ ముప్పు అధికం. ఇటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా అప్రమత్తంగా మెలగాలి.
* అమెరికా స్టాక్‌మార్కెట్లో ‘దిద్దుబాటు’ మొదలైతే, ఆ ప్రభావం మనదేశంలోనూ స్టాక్‌మార్కెట్లపై కనిపిస్తుంది. అటువంటి పరిస్థితులు కనిపిస్తుంటే ఇన్వెస్టర్లు జాగ్రత్తపడాలి.

- సతీష్‌ కంతేటి సంయుక్త ఎండీ, జెన్‌ సెక్యూరిటీస్‌

ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది

కొవిడ్‌ పరిణామాల ఫలితంగా మనదేశ వృద్ధి రేటు బాగా క్షీణించి, మళ్లీ నెమ్మదిగా కోలుకుంటోంది. ఉద్దీపన పథకాలు, నగదు లభ్యత పెంచే చర్యలు, లాక్‌డౌన్‌ ఆంక్షలు తగ్గిపోవడం దీనికి కారణాలు. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ‘సానుకూల వృద్ధి’ నమోదుకు అవకాశాలున్నాయి. వృద్ధి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నందున విదేశీ సంస్థలు మనదేశంలో అధికంగా పెట్టుబడులు పెడుతున్నాయి. కానీ వీటిల్లో అధిక భాగం స్టాక్‌ మార్కెటలలోకి వస్తున్నాయి. స్థిరాస్తి, మౌలిక సదుపాయాలు, ఇంజినీరింగ్‌- టెక్నాలజీ రంగాల్లోకి పెద్దగా రావటం లేదు. దేశీయంగా ప్రైవేటు రంగ పెట్టుబడులు పరిమితంగానే కనిపిస్తున్నాయి.  ఉపాధి కల్పన, విద్య, వ్యవసాయ రంగాలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తే వచ్చే రెండు, మూడేళ్లలో ఆర్థిక వ్యవస్థ బాగా కోలుకుని, అభివృద్ధిలో దూసుకుపోవచ్చు.

- డాక్టర్‌ చిట్టేడి కృష్ణారెడ్డి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ

యువ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి

స్టాక్‌మార్కెట్లోకి ఇటీవల యువ ఇన్వెస్టర్లు పెద్దసంఖ్యలో అడుగుపెట్టారు. మార్కెట్‌ బాగా క్షీణించిన స్థాయి నుంచి వేగంగా కోలుకున్నందున వారికి లాభాలు మెండుగా కనిపిస్తున్నాయి. కొన్ని సమయాల్లో తీవ్రమైన నష్టాలు తప్పవు. అందువల్ల యువ మదుపరులు కొంత జాగ్రత్త వహించడం మేలు.
* త్వరగా, సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో, స్టాక్‌మార్కెట్లో రిస్కు అధికంగా ఉండే పద్ధతులను ఎంచుకుంటున్నారు. ఇది అత్యాశే అవుతుంది. నాణ్యమైన షేర్లు ఎంచుకుని, దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెడితే మంచి లాభాలు రావచ్చు.
* పెట్టుబడులను మదుపరులు ఒకేచోట కాకుండా భిన్నమైన పెట్టుబడి సాధనాల్లో పెట్టాలి. ఏకమొత్తంలో ఒకేసారి కాకుండా క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టటం శ్రేయస్కరం.
* పెట్టుబడుల వ్యూహాలు అర్థం చేసుకోడానికి, కంపెనీల ఆర్థిక స్థితిగతులను పరిశీలించడానికి మదుపరులు బాగా చదివి విశ్లేషించడం నేర్చుకోవాలి. తద్వారా స్టాక్‌మార్కెట్లో మనగలుగుతారు.

- సాయికృష్ణ పత్రి, వ్యక్తిగత ఆర్థిక సలహాదారుడు, హైదరాబాద్‌


పెరుగుతున్న డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య

స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టటానికి డీమ్యాట్‌ ఖాతా తప్పనిసరి. డీమ్యాట్‌ ఖాతాలు పెరుగుతున్నాయంటే, స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య అధికమవుతున్నట్లే.

 

* 2018-19తో పోల్చితే 2019-20లో 49 లక్షల నూతన డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభమయ్యాయి.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21)లో కొత్త ఖాతాలు మరింత పెరిగినట్లు సమాచారం.

ఈనాడు హైదరాబాద్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు