గానగంధర్వుడికి పద్మవిభూషణ్‌

ప్రధానాంశాలు

గానగంధర్వుడికి పద్మవిభూషణ్‌

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబెతో పాటు మరో ఆరుగురికి కూడా
పాస్వాన్‌, కేశూభాయ్‌, సుమిత్రా మహాజన్‌, గాయని చిత్రలకు పద్మభూషణ్‌
తెలంగాణ నుంచి గుస్సాడీ కనకరాజుకు, ఏపీ నుంచి ముగ్గురికి పద్మశ్రీ


 

ఈనాడు, దిల్లీ: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి.. మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. జపాన్‌ మాజీ ప్రధానమంత్రి షింజో అబేతో కలిపి మొత్తం ఏడుగురికి రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటిస్తూ కేంద్ర హోం శాఖ సోమవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మొత్తం 119 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. ఏడుగురిని పద్మవిభూషణ్‌కు, 10 మందిని పద్మభూషణ్‌కు, 102 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. బాలుకు తమిళనాడు నుంచి పద్మవిభూషణ్‌ దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ నుంచి ముగ్గురిని, తెలంగాణ నుంచి ఒకరిని పద్మశ్రీ వరించింది. దివంగత అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగొయ్‌, గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్‌ పటేల్‌, కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్‌ పాస్వాన్‌లకు మరణానంతరం పద్మభూషణ్‌లు ప్రకటించారు. లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, ప్రధాని ముఖ్య కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన నృపేంద్ర మిశ్ర, కర్ణాటక సాహితీ ప్రముఖుడు చంద్రశేఖర్‌ కంబారా, ప్రముఖ గాయని చిత్రలకు పద్మభూషణ్‌ దక్కింది. గోవా మాజీ గవర్నర్‌ దివంగత మృదులా సిన్హాకు పద్మశ్రీ ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాలు, దక్షిణాది నుంచి..
ఆంధ్రప్రదేశ్‌ నుంచి పద్మశ్రీకి ఎంపికైన వారిలో విజయవాడకు చెందిన వయోలిన్‌ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, అనంతపురం జిల్లాకు చెందిన సాహితీవేత్త ఆశావాది ప్రకాశ్‌రావు, దేశంలో తొలి మృదంగ కళాకారిణి నిడుమోలు సుమతి ఉన్నారు. తెలంగాణ నుంచి కళాకారుడు కనకరాజు ఎంపికయ్యారు. దక్షిణాదిలో తమిళనాడు నుంచి 11 మంది, కేరళ నుంచి ఆరుగురు, కర్ణాటక నుంచి ఐదుగురు, పుదుచ్చేరి నుంచి ఒకరు పద్మ పురస్కారాలు పొందారు. అవార్డులకు ఎంపికయిన వారిలో 29 మంది మహిళలు, 10 మంది విదేశీయులు, ఒక ట్రాన్స్‌జెండర్‌ ఉన్నారు. మొత్తం 16 మందికి మరణానంతరం ఈ పురస్కారాలు దక్కాయి.

పద్మవిభూషణ్‌
1. షింజో అబే, ప్రజా జీవితం, జపాన్‌
2. ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం (మరణానంతరం), కళలు, తమిళనాడు
3. డాక్టర్‌ బెల్లె మోనప్ప హెగ్డే, వైద్యం, కర్ణాటక
4. నరిందర్‌సింగ్‌ కపని (మరణానంతరం) సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, యూఎస్‌ఏ
5. మౌలానా వహీదుద్దీన్‌ ఖాన్‌, ఆధ్యాత్మికం, దిల్లీ
6. బీబీ లాల్‌, ఆర్కియాలజీ, దిల్లీ
7. సుదర్శన్‌ సాహు, కళలు, ఒడిశా

పద్మభూషణ్‌
1. కృష్ణన్‌ నాయర్‌ శాంతకుమారి చిత్ర, కళలు, కేరళ
2. తరుణ్‌గొగొయ్‌ (మరణానంతరం), ప్రజా జీవితం, అసోం
3. చంద్రశేఖర్‌ కంబార, సాహిత్యం-విద్య, కర్ణాటక
4. సుమిత్రా మహాజన్‌, ప్రజా జీవితం, మధ్యప్రదేశ్‌
5. నృపేంద్రమిశ్ర, సివిల్‌ సర్వీస్‌, ఉత్తర్‌ప్రదేశ్‌
6. రామ్‌విలాస్‌ పాస్వాన్‌ (మరణానంతరం), ప్రజా జీవితం, బిహార్‌
7. కేశూభాయ్‌ పటేల్‌ (మరణానంతరం), ప్రజా జీవితం, గుజరాత్‌
8. కల్బే సాధిఖ్‌ (మరణానంతరం), ఆధ్యాత్మికం, ఉత్తర్‌ప్రదేశ్‌
9. రజినికాంత్‌ దేవిదాస్‌ ష్రాఫ్‌, వాణిజ్యం-పరిశ్రమ, మహారాష్ట్ర
10. తర్లోచన్‌ సింగ్‌, ప్రజా జీవితం, హరియాణా

అభినందించిన ఉపరాష్ట్రపతి, ప్రధాని
పద్మ పురస్కార గ్రహీతలకు ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. వివిధ రంగాలకు చెందిన వీరంతా అద్భుతమైన వ్యక్తులని, ఇతరుల జీవితాల్లో గుణాత్మక మార్పుల్ని తీసుకువచ్చారని ప్రధాని ట్వీట్‌ చేశారు. మానవాళికి, దేశానికి వీరు అందించిన సేవలు నిరుపమానమని పేర్కొన్నారు.

అవధానంలో దిట్ట.. ఆశావాది
ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, పెనుకొండ: అనంతపురం జిల్లాకు చెందిన అవధాని డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు 1944 ఆగస్టు 2న కుళ్లాయమ్మ, పక్కీరప్ప దంపతులకు జన్మించారు. ఈయన స్వగ్రామం శింగనమల మండలం పెరవలి. ఎస్‌ఎస్‌ఎల్‌సీ నుంచి ఎంఏ (తెలుగు) వరకు అనంతపురంలోనే చదువుకున్నారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తెలుగు పండితులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన పెనుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ చేశారు. వివిధ రాష్ట్రాల్లో 170కి పైగా అవధానాలు చేశారు. 57 రచనలు చేశారు. అవధాన రంగంలో ఆయన కృషికి గాను పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్డరేట్‌తో సన్మానించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కవికోకిల జాషువా పురస్కారాన్ని ప్రదానం చేసింది.

పల్లవించిన సంగీతం
విజయవాడకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు అన్నవరపు రామస్వామి. ఆయన తండ్రి పెంటయ్య నాదస్వర విద్వాంసులు. రామస్వామి ప్రస్తుతం సూర్యారావుపేట వేమూరివారివీధిలో నివసిస్తున్నారు. గత 8 దశాబ్దాలుగా అనేక దేశాల్లో కచేరీలు చేశారు. ఆయన వందన, శ్రీదుర్గా అనే కొత్త రాగాలను, త్రినేత్రాది, వేదాది అనే తాళాలను కనుగొన్నారు. అనేక పురస్కారాలు, బిరుదులు పొందారు.

చిత్ర భూషణం
మెలోడీ క్వీన్‌.. నైటింగేల్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియాగా సంగీత ప్రియుల హృదయాల్లో స్థానం సంపాదించిన గాయని కె.ఎస్‌.చిత్ర. 1963 జులై 27న కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన ఆమె.. చిన్నతనంలోనే కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. పలు భాషల్లో గీతాలు ఆలపించి సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించారు. దాదాపు నాలుగు దశాబ్దాలకి పైగా సాగుతున్న ఆమె సినీ ప్రయాణంలో అన్ని భాషల్లో కలిపి 24 వేలకిపైగా గీతాలు ఆలపించారు.  

జనం మెచ్చిన వైద్యుడు.. హెగ్డే

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన డాక్టర్‌ బి.ఎం.హెగ్డేకు పద్మవిభూషణ్‌ పురస్కారం దక్కింది. కర్ణాటకకు చెందిన ఆయన వృత్తి పరంగా హృద్రోగ నిపుణుడు. వైద్య విజ్ఞానిగా, విద్యావేత్తగా, రచయితగా చిరపరిచితులు. కర్ణాటకలోని ఉడుపి జిల్లా పంగాలో జన్మించిన హెగ్డే.. విఖ్యాత మణిపాల్‌ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేసి పదవీవిరమణ పొందారు. ప్రస్తుతం చెన్నైకి చెందిన టీఏజీ-వీహెచ్‌ఎస్‌ డయాబెటిస్‌ పరిశోధన సంస్థకు కో చైర్మన్‌గా, భారతీయ విద్యాభవన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  

బాలు పాటకు పురస్కారం

మృత గళంతో ఆబాలగోపాలాన్ని కట్టిపడేసిన సమ్మోహన శక్తి... ఎస్పీ బాలు. ఆయన  లేకపోయినా... ఆయన పాట తరాలుగా బతికే ఉంటుంది. యాభయ్యేళ్లకి పైగా అలుపెరగకుండా ప్రయాణం చేసిన ఈ ‘పాట’సారి కీర్తికిరీటంలో మరో కలికితురాయి పద్మ విభూషణ్‌ రూపంలో చేరింది. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్‌ పురస్కారాలు ఆయన అందుకున్నారు. ఇప్పుడు పద్మవిభూషణుడు అయ్యారు. గాయకుడిగా, డబ్బింగ్‌ కళాకారుడిగా పలు భాషల్లో లెక్కలేనన్ని పురస్కారాల్ని ఆయన సొంతం చేసుకున్నారు. గతేడాది సెప్టెంబరు 25న కరోనాతో చికిత్స పొందుతూ చెన్నైలో కన్నుమూశారు.

మృదంగంతో మార్మోగిన పేరు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మృదంగ వాద్యాన్ని వృత్తిగా స్వీకరించిన తొలి కళాకారిణి, విజయవాడకు చెందిన నిడుమోలు సుమతి. విజయవాడలో నివాసముంటున్న ఆమె సంగీత కళాకారిణిగా సుప్రసిద్ధురాలు. మృదంగ విద్వాంసులైన తండ్రి నిడుమోలు రాఘవయ్య వద్దే ఆమె శిష్యరికం చేసి చిన్నప్పుడే పట్టు సాధించారు. పదో ఏటనే తొలి కచేరి ఇచ్చారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి అనేక మంది ప్రముఖులకు ఆమె వాద్య సహకారం అందించారు. తొలి గురువు దండమూడి రామమోహనరావును ఆమె వివాహం చేసుకున్నారు. భర్తతో కలిసి అనేక కచేరీలు చేశారు.

గుస్సాడీ కనకం.. ‘పద్మశ్రీ’ కిరీటం

జైనూరు, ఇంద్రవెల్లి, న్యూస్‌టుడే: గుస్సాడీ రాజుగా ఆదివాసీల మదిలో నిలిచిన కనకరాజుకు కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి కళారంగంలో పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. తెలంగాణ నుంచి ఈయన ఒక్కరికే ఈ గౌరవం లభించటం విశేషం. కుమురం భీం జిల్లా వాసి అయిన కనకరాజు ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించే గుస్సాడీ నృత్యాన్ని దిల్లీ వేదికగా చాటారు. జైనూరు మండలం మార్లవాయి గ్రామానికి చెందిన ఈయన జిల్లాలో విద్యాభివృద్ధికి తోడ్పాడ్డారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు అవిరళ కృషి సలిపారు. 80 ఏళ్ల వయసులోనూ ఆ కళలో యువకులకు శిక్షణనిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
1982లో ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో అప్పటి రాష్ట్రపతి సమక్షంలో దిల్లీ ఎర్రకోటలో నిర్వహించిన గణతంత్ర వేడుకలో కనకరాజు తన బృందంతో గుస్సాడీ ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు.
ఆదివాసీలకు ఆరాధ్యుడు, వారి సంక్షేమానికి అవిరళ కృషి చేసిన బ్రిటిష్‌ అధికారి హైమన్‌ డాô్్ఫకు కనకరాజు అత్యంత సన్నిహితంగా మెలిగారు. అప్పట్లో ఆయన సాయంతో 30 ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారు.  
డార్ఫ్‌ హయాంలో ఆదివాసీలకు 47వేల ఎకరాల పోడు భూమిని పంపిణీ చేయగా.. ఆ యజ్ఞంలో భాగమయ్యారు కనకరాజు. 1956లో గిరిజన సహకార సంస్థ ప్రారంభించడానికి వెన్నుదన్నుగా నిలిచారు. కనకరాజుకు కేంద్ర ప్రభుత్వం పురస్కారం ప్రకటించడం ఆదివాసీ సమాజానికి గర్వించదగ్గ విషయమని మార్లవాయి సర్పంచి కనక ప్రతిభా వెంకటేశ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను సోమవారం రాత్రి గ్రామస్థులు సన్మానించారు.
తాను గుస్సాడీకి చేసిన కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి అవార్డు ప్రకటించడం పట్ల కనకరాజు ఆనందం ప్రకటించారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని