రైతు ఉద్యమకారులపై ఉచ్చు
close

ప్రధానాంశాలు

రైతు ఉద్యమకారులపై ఉచ్చు

దిల్లీ సరిహద్దుల్లో మళ్లీ ఉత్కంఠ
దీక్షా శిబిరాలు ఖాళీ చేయించే ప్రయత్నం
ఎర్రకోట ఘటనలపై దేశద్రోహం కేసు.. దర్యాప్తు ముమ్మరం
44 మంది రైతు నేతలపై లుక్‌ఔట్‌ నోటీసులు
ఆత్మహత్యకైనా సిద్ధమని ప్రకటించిన టికాయిత్‌

దిల్లీ: రైతు ఉద్యమకారులపై కేంద్రం అన్నివైపుల నుంచి ఉచ్చు బిగుస్తోంది. వారిపై రకరకాల కేసులు పెట్టడంతోపాటు ఎక్కడికక్కడ దీక్షా శిబిరాలను భగ్నం చేయడానికి చర్యలు చేపట్టింది. శిబిరాల్లో ఉన్న వారికి కనీస సౌకర్యాలు అందకుండా చేస్తోంది. ఈ పరిణామాలతో దిల్లీ సరిహద్దుల్లో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్లమెంటు సమావేశాలు శుక్రవారం నుంచి జరగబోతున్న నేపథ్యంలో కేంద్రం ఒక్కసారిగా కొరడా ఝళిపించింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం రాత్రి పొద్దుపోయేవరకు వివిధ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రైతు నేతలు మాత్రం దీక్షలు సడలించేది లేదని తెగేసి చెబుతున్నారు. నోటీసులు, కేసులు, ఇతర నిర్బంధ చర్యలకు తాము ఎంతమాత్రం భయపడేది లేదని ప్రకటించారు. చట్టాల రద్దు వరకు విశ్రమించబోమని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది.

కేసుల జోరు
ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న ఘటనలపై పోలీసులు.. దేశద్రోహం కేసు నమోదు చేశారు. పోలీసుల నుంచి తూటాలు, రక్షణ కవచాలు లాక్కొని వెళ్లిపోయారని కొందరు రైతులపై కేసు పెట్టారు. ట్రాక్టర్ల ర్యాలీని చేపట్టిన రైతులు ఈ నెల 26న ఎర్రకోటలో ప్రవేశించి, సిక్కుల మత జెండాను, తమ సంఘాల జెండాలను కూడా జాతీయ పతాకంతో కలిపి ఎగరేసిన విషయం తెలిసిందే. దీనిని తీవ్రంగా పరిగణించిన దిల్లీ పోలీసులు భారత శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 124-ఏ కింద దేశద్రోహం కేసు పెట్టి, దర్యాప్తు చేస్తున్నారు.  మరికొందరిపై ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ (యూఏపీఏ) కింద కేసు పెట్టారు. దర్యాప్తు వేగవంతం చేశారు. వివిధ ఎఫ్‌ఐఆర్‌లలో పేర్లున్న 44 మంది రైతు నేతలకు లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. ర్యాలీ షరతుల్ని ఉల్లంఘించినందుకు చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోరాదో మూడు రోజుల్లో వివరించాలని నోటీసులలో పేర్కొన్నారు. ఈ నేతలంతా పాస్‌పోర్టులను తమకు స్వాధీనపరచాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. గురువారం మరో 15 మందిని వారు నిర్బంధంలో తీసుకున్నారు.

కుట్ర కోణంపై దర్యాప్తునకు ప్రత్యేక విభాగం
శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామన్న ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి అత్యంత సమన్వయంతో ముందస్తు ప్రణాళికతో నేతలు వ్యవహరించారని పోలీసులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ప్రభుత్వానికి అపఖ్యాతి తెచ్చేందుకే ఇలా చేశారని, కుట్ర ఉందన్న కోణంలో దీనిపై ప్రత్యేక విభాగం దర్యాప్తు చేస్తుందని దిల్లీ పోలీసులు వెల్లడించారు. నిందితుల్ని గుర్తించి పట్టుకునేందుకు తొమ్మిది బృందాలను నియమించారు. ఒక్కో బృందానికి ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. దిల్లీ పోలీసు కమిషనర్‌ ఎస్‌.ఎన్‌. శ్రీవాస్తవ.. గురువారం నిఘా విభాగ ప్రత్యేక కమిషనర్‌ సహా పలువురు అధికారులతో సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని, మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి రాతపూర్వక సందేశంలో తెలిపారు.

భయపెడితే బెదిరిపోం: టికాయిత్‌
తాజా పరిస్థితులపై భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) ప్రతినిధి రాకేశ్‌ టికాయిత్‌ స్పందిస్తూ ఆందోళనను ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించేది లేదని, ఆత్మహత్యకైనా సిద్ధమేనని ప్రకటించారు. చట్టాలు రద్దయ్యేవరకు వెనక్కి తగ్గేది లేదన్నారు. గురువారం రాత్రి పొద్దపోయాక ఆయన నిరాహార దీక్షకు దిగారు. ఆయుధాలతో గూండాలను తమ వద్దకు పంపిస్తున్నారని ఆరోపించారు. తాము నిరసనలు తెలుపుతున్న దిల్లీ సరిహద్దు ప్రాంతం ఘాజిపుర్‌లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తే.. తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని, దానికి బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పారు. రైతు సంఘాల మధ్య చిచ్చు పెట్టి, దేశం నుంచి పంజాబ్‌ను విడదీసేందుకు కొందరు కుట్ర పన్నినట్టు ఆరోపించారు. ఎర్రకోట ఘటనపై న్యాయవిచారణకు డిమాండ్‌ చేశారు. దీప్‌సిద్ధూను తమ సంఘం సామాజికంగా బహిష్కరించిందని చెప్పారు. నోటీసులకు బెదిరిపోయేది లేదని సంయుక్త కిసాన్‌ మోర్చా ఒక ప్రకటనలో తెలిపింది.

పోలీసులకు అమిత్‌షా, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పరామర్శ
ఈ నెల 26న జరిగిన ఘటనల్లో గాయపడ్డ పోలీసుల ఆరోగ్యం ఎలా ఉందో వాకబు చేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గురువారం వారి వద్దకు వెళ్లారు. వారితో, వైద్యులతో మాట్లాడి, చికిత్స గురించి తెలుసుకున్నారు. పోలీసుల ధైర్య సాహసాలు, వారు చూపిన సంయమనం తమకెంతో గర్వకారణమని ట్వీట్‌ చేశారు. దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ బైజాల్‌ కూడా పోలీసుల్ని పరామర్శించారు. వారందరికీ ఉత్తమ వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచించినట్లు ట్విటర్లో తెలిపారు.

యూపీ గేట్‌ను వదిలి వెళ్లాలంటూ అల్టిమేటం
గురువారం అర్ధరాత్రిలోగా దిల్లీ సరిహద్దులోని యూపీ గేట్‌ను ఖాళీ చేయాలంటూ గాజియాబాద్‌ పరిపాలన యంత్రాంగం రైతులకు అల్టిమేటం జారీ చేసింది. అక్కడి నుంచి వెళ్లిపోని పక్షంలో తామే తొలగిస్తామని జిల్లా మేజిస్ట్రేట్‌ మౌఖికంగా తెలిపారు. అక్కడ పలుమార్లు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. సింఘు సరిహద్దు వద్ద రైతులు సద్భావన ర్యాలీ నిర్వహించారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని డిమాండ్‌ చేస్తూ కొంతమంది స్థానికులు నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. అక్కడ నుంచి ఒక్క రోజులో రైతులు వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ చేశారు. బురారీలోని డీడీఏ మైదానంలో బైఠాయించిన 30 మంది రైతుల్ని పోలీసులు ఖాళీ చేయించారు. వారిని సింఘు సరిహద్దుకు పంపించారు. సింఘు, టిక్రి సరిహద్దుల్లో సందడి కొంత తగ్గింది. కొన్ని భోజనశాలలు, ఇతర సేవల్ని తాత్కాలికంగా నిలిపేశారు. తమ పోరాట స్ఫూర్తి ఏమాత్రం తగ్గలేదని, ట్రాక్టర్ల ర్యాలీ ముగియడంతో కొందరు రైతులు తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారని నేతలు చెబుతున్నారు.

సింఘు సరిహద్దు వద్ద మరోసారి ఉద్రిక్తత
రైతులు ఆందోళనలు చేస్తోన్న సింఘు సరిహద్దు వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులను రోడ్డుకు ఒకవైపే పరిమితం చేసేలా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీనిని రైతులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా అక్కడి పరిస్థితి వేడెక్కింది.
* నిరసనలు విరమిస్తున్నట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ (లోక్‌శక్తి) అధినేత షియోరాజ్‌సింగ్‌ ప్రకటించారు. ఇప్పటికే రెండు సంఘాలు ఇలాంటి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
* ఎర్రకోట వద్ద భద్రత బలగాలను నియమించడంతో పాటు సరిహద్దు కేంద్రాలన్నింటి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కోటలోకి ఈ నెల 31 వరకు సందర్శకుల ప్రవేశాలను నిషేధించారు.
* హరియాణాలోని సోనిపట్‌, ఝజ్జర్‌, పల్వాల్‌ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం వరకు మొబైల్‌ ఇంటర్నెట్‌పై నిషేధం కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని