వ్యాధి నిర్ధారణ ఉచితం 

ప్రధానాంశాలు

వ్యాధి నిర్ధారణ ఉచితం 

19 జిల్లాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌
నెల రోజుల్లో ప్రారంభానికి ప్రభుత్వం సన్నాహాలు
57 రకాల ప్రధాన రక్త, మూత్ర పరీక్షలు
ఈసీజీ, అల్ట్రాసౌండ్‌, ఎక్స్‌రేలు సైతం

ఈనాడు, హైదరాబాద్‌: వైద్యం అత్యంత ఖరీదైపోయింది. ముఖ్యంగా రోగ నిర్ధారణ పరీక్షల వ్యయం తలకు మించిన భారమైంది. రక్త పరీక్షలు చేయించుకుంటే.. కనీసం రూ.వెయ్యి వదిలించుకోవాల్సిందే. ఛాతీ ఎక్స్‌రేనో.. అల్ట్రాసౌండో.. సీటీ, ఎంఆర్‌ఐ వంటి స్కానింగో చేయించుకోవాలంటే.. రూ.వేలకు వేలు జేబుకు చిల్లు పడటం ఖాయమే. సామాన్యులకు ఈ భారాన్ని తగ్గించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. 57 రకాల సాధారణ రక్త, మల, మూత్ర సమగ్ర పరీక్షలను, ఆధునిక పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తెస్తోంది. మూడేళ్ల కిందట జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రారంభించిన ‘తెలంగాణ నిర్ధారణ పరీక్షల పథకం (టి-డయాగ్నోస్టిక్స్‌) పల్లెలకూ విస్తరించాలని నిర్ణయించింది. సిద్దిపేటలో ఇటీవలే ప్రారంభించగా.. నెల రోజుల్లో మరో 19 జిల్లాల్లో ప్రారంభించేందుకు వైద్యఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. నాణ్యతా, ప్రమాణాల విషయంలోనూ రాజీ పడకుండా.. సీఎంసీ వెల్లూర్‌ (తమిళనాడు), ఎయిమ్స్‌ దిల్లీ ఆసుపత్రులతో ఆరోగ్యశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు ఆసుపత్రుల నిపుణులు ఎప్పటికప్పుడు ఇక్కడి ప్రయోగశాలల్లో నిర్ధారణ పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించి, అవసరమైన సలహాలు, సూచనలు అందజేస్తుంటారు.


ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రారంభం..

2018 జనవరిలో తొలిసారిగా నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ (ఐపీఎం)లో ‘తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌’ పేరిట నూతన పథకాన్ని అమల్లోకి తెచ్చారు. దీని పరిధిలోకి 2 జిల్లా ఆసుపత్రులు, 5 ప్రాంతీయ ఆసుపత్రులు, 9 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 104 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 200 బస్తీ దవాఖానాలను అనుసంధానం చేశారు. ఇప్పటి వరకూ ఈ ప్రయోగశాల ద్వారా సుమారు 8 లక్షలమందికి పైగా రోగులకు 25 లక్షలకు పైగా పరీక్షలను నిర్వహించారు. సగటున రోజుకు 6 వేలకు పైగా నమూనాలను పరీక్షిస్తున్నారు. దీనికి కొనసాగింపుగానే జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్‌ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి కోసం 8 ప్రత్యేక కేంద్రాలను నెలకొల్పారు. 150 ఆసుపత్రులను అనుసంధానించారు. కేవలం నెల రోజుల్లోనే వీటి ద్వారా 616 ఎక్స్‌రేలను, 894 అల్ట్రాసౌండ్‌ స్కాన్‌లను, 453 ఈసీజీలను నిర్వహించారు. త్వరలోనే జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 8 రేడియాలజీ వైద్యసేవలందించే కేంద్రాలను నెలకొల్పడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు ఈ సేవలను ‘టి-డయాగ్నొస్టిక్స్‌’ అనే బ్రాండ్‌ పేరిట రాష్ట్రమంతటా విస్తరించాలని, ఈసీజీ, ఎక్స్‌రే, ఇతర ఫలితాలను టెలీ రేడియాలజీ విధానానికి అనుసంధానం చేయాలని నిర్ణయించింది.


అమలు తీరు ఇలా..
* అన్ని జిల్లాల్లోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులు ఈ ప్రయోగశాలలకు అనుసంధానమవుతాయి.
* నిత్యం వీటిలో సేకరించిన నమూనాలను జిల్లా కేంద్రంలోని ప్రయోగశాలకు చేర్చుతారు.
* నమూనాలు సేకరించేటప్పుడే ఆన్‌లైన్‌లో పొందుపరచిన సమాచారం ప్రయోగశాలకు చేరుతుంది.
* పరీక్షల నమూనాలను పరికరాల్లో పొందుపరచినప్పుడే.. రోగి సమాచారం కూడా పరికరానికి చేరిపోతుంది.
* దీంతో పరికరమే ఆన్‌లైన్‌లో నేరుగా రోగి ఫోన్‌ నంబరుకు ఫలితాల సమాచారాన్ని పంపిస్తుంది.
* అదే సమాచారం సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, ఇతర ఆసుపత్రులకు పంపిస్తుంది.
* అవసరమైతే రోగులు ఆ కేంద్రానికి వెళ్లి కూడా సమాచారం పొందవచ్చు.


అన్నీ అత్యాధునిక ప్రయోగశాలలే
జిల్లాల్లో నెలకొల్పనున్న ప్రయోగశాలలన్నీ అత్యాధునికమైనవే. పూర్తిస్థాయిలో వాటంతటవే పరీక్షలు నిర్వహించి, ఫలితాలను వెల్లడించే 3 పరికరాలు (ఫుల్లీ ఆటోమెటేడ్‌ మిషన్స్‌) నెలకొల్పారు. ఒకటి సమగ్ర రక్తపరీక్షల్లో (కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌) గంటకు 100 నమూనాల చొప్పున ఫలితాలనందిస్తుంది. రెండోదాంట్లో బయోకెమిస్ట్రీకి సంబంధించిన పరీక్షలను గంటకు 800 నమూనాల నమూనాలను వెల్లడించే సామర్థ్యం ఉంటుంది. మూడోది పూర్తిగా హార్మోన్లకు సంబంధించినది. ఇది గంటకు 80 నమూనాల ఫలితాలు వెల్లడిస్తుంది. ప్రతి ప్రయోగశాలలోనూ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ వైద్యనిపుణులను నియమిస్తారు.


ఎలాంటి పరీక్షలు?
* 57 రకాల సాధారణ రక్త, మల, మూత్ర సమగ్ర పరీక్షలు
* వీటికి అనుబంధంగా ఉండే సుమారు 150 రకాల పరీక్షలు
* టైఫాయిడ్‌, డెంగీ, మలేరియా జ్వరాల నిర్ధారణ
* కాలేయం, మూత్రపిండాలు, థైరాయిడ్‌ పనితీరు పరీక్షలు
* రక్తంలో కొలెస్ట్రాల్‌, మూణ్నెళ్ల సగటు చక్కెరస్థాయి, కీళ్లవాతం తదితర పరీక్షలు


ఈ ఆసుపత్రుల్లో త్వరలో...

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, జనగామ, జగిత్యాల, కరీంనగర్‌, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, నల్గొండ, నాగర్‌కర్నూల్‌, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, సంగారెడ్డి, వికారాబాద్‌ ఆసుపత్రుల్లో వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. కరీంనగర్‌, ఖమ్మం, జోగులాంబ గద్వాల, ములుగు జిల్లాల్లో ఇప్పటికే నెల రోజులుగా ప్రయోగాత్మక సేవలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి మిగిలిన జిల్లాల్లోనూ వీటిని నెలకొల్పుతామని వైద్యవర్గాలు తెలిపాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని