నాలుగు కేటగిరీలుగా ఓబీసీలు!

ప్రధానాంశాలు

నాలుగు కేటగిరీలుగా ఓబీసీలు!

2:6:9:10 నిష్పత్తిలో 27% రిజర్వేషన్ల పంపిణీ
జస్టిస్‌ రోహిణి కమిషన్‌ ప్రతిపాదన!

ఈనాడు, దిల్లీ: కేంద్ర జాబితాలోని ఓబీసీలకు చెందిన 2,633 కులాలను 4 కేటగిరీలుగా వర్గీకరించాలని జస్టిస్‌ రోహిణి కమిషన్‌ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓబీసీలకు అమలవుతున్న 27% రిజర్వేషన్లను ఈ నాలుగు కేటగిరీలకు 2:6:9:10 నిష్పత్తిలో పంచాలని కమిషన్‌ తన నివేదికలో సిఫార్సు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర జాబితాలోని ఓబీసీ రిజర్వేషన్లు ఎలాంటి వర్గీకరణ లేకుండా గంపగుత్తగా అమలవుతున్నాయి. దీనివల్ల ఓబీసీల్లోని కొన్ని బలమైన వర్గాలు మాత్రమే వాటి ప్రయోజనాలను పొందుతున్నాయన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వీటి వర్గీకరణకు 2017 అక్టోబరు 2న జస్టిస్‌ రోహిణి నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 2018 మార్చి 27కల్లా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం తొలుత నిర్దేశించింది. అయితే తర్వాత సార్వత్రిక ఎన్నికలతోపాటు, వివిధ రాజకీయ అంశాల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆ కమిషన్‌ గడువును పొడిగించుకుంటూ 2021 జులై 31లోపు నివేదిక సమర్పించడానికి గడువును నిర్దేశించింది. కమిషన్‌లో న్యూదిల్లీ సెంటర్‌ ఫర్‌ పాలసీ స్టడీస్‌ సభ్యుడు జేకే బజాజ్‌తో పాటు కోల్‌కతాలోని ఆంత్రోపాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌, భారత రిజిస్ట్రార్‌ జనరల్‌, సెన్సస్‌ కమిషనర్‌లను ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నియమించారు.  కమిషన్‌ నివేదిక సమర్పించాల్సిన గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో రిజర్వేషన్ల వర్గీకరణపై ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఇంతవరకు రిజర్వేషన్‌ ఫలాలను పెద్దగా పొందని 1,674 కులాలను ఒక కేటగిరీలో చేర్చాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మిగిలిన 3 కేటగిరీల్లో 97, 328, 534 కులాలను విడివిడిగా చేర్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలపై కమిషన్‌ వచ్చే నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపనున్నట్లు సమాచారం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని