ఒకే ఊరిలో 33 మందికి కరోనా

ప్రధానాంశాలు

ఒకే ఊరిలో 33 మందికి కరోనా

ఈనాడు, హైదరాబాద్‌, కరీంనగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: కరోనా తగ్గిపోయిందని భావిస్తున్న వారికి ఇదో హెచ్చరిక. కరీంనగర్‌ జిల్లాలోని చేగుర్తి గ్రామంలో రెండురోజుల్లో 33 కరోనా కేసులు నిర్ధారణ కావటం కలకలం రేపుతోంది. గ్రామంలో రెండు రోజులు శిబిరం ఏర్పాటు చేసి గ్రామస్థులకు పరీక్షలు చేయగా మొదటిరోజు 16 కేసులు రాగా, రెండోరోజైన శుక్రవారం 17 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఈ గ్రామానికి చెందిన దుర్గం కనకయ్య (60) పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న బంధువులు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు. తర్వాత వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో, గురువారం వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్‌ అని తేలింది. శుక్రవారం మరో 87 మందికి పరీక్షలు నిర్వహించగా 17 మందికి కొవిడ్‌ సోకినట్లు వెల్లడైంది. గ్రామంలో మొత్తం 33 మందికి పాజిటివ్‌ వచ్చిందని హెల్త్‌ సూపర్‌వైజర్‌ బాలయ్య తెలిపారు. వారందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి అవసరమైన మందులు అందిస్తున్నారు. గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు కరోనా రోగులకు నిత్యావసర సరకులను సమకూర్చుతున్నారు. కేవలం అంత్యక్రియలకు హాజరైన వ్యక్తులకే వైరస్‌ సోకిందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.

రాష్ట్రంలో 165 కేసులు.. ఒకరి మృతి
రాష్ట్రవ్యాప్తంగా గురువారం 23,761 నమూనాలను పరీక్షించగా, కొత్తగా 165 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 440 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,97,278కి పెరిగింది. మహమ్మారితో మరొకరు మృతి చెందారు. ఇప్పటి వరకు 1,623 మంది కరోనాతో కన్నుమూశారు.
తాజాగా 149 మంది కొవిడ్‌కు చికిత్స పొంది కోలుకోగా, మొత్తం 2,93,940 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈనెల 18న (గురువారం) రాత్రి 8 గంటల వరకు నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు శుక్రవారం విడుదల చేశారు. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 35, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 19 కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని