జీవశాస్త్ర పరిశోధనలపై మేధోమథనం 

ప్రధానాంశాలు

జీవశాస్త్ర పరిశోధనలపై మేధోమథనం 

భాగ్యనగరి వేదికగా రేపటి నుంచి బయో ఆసియా సదస్సు
భారత్‌ బయోటెక్‌ సీఎండీ, జేఎండీలకు ప్రతిభా పురస్కార ప్రదానం
30 వేల మందికి పైగా శాస్త్రవేత్తలు పాల్గొనే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు-2021కు భాగ్యనగరం వేదిక కానుంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ నెల 22, 23 తేదీల్లో సదస్సు నిర్వహించనున్నారు. గత 17 సంవత్సరాలుగా సదస్సుకు హైదరాబాద్‌ నగరమే వేదికగా ఉంటోంది. ఈ సంవత్సరం దృశ్యమాధ్యమంలో నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ సదస్సు కీలకంగా మారుతుందని.. ప్రపంచంలోని 30 వేల మందికి పైగా జీవశాస్త్రాల నిపుణులు తమ ఆవిష్కరణలు, పరిశోధనలతో పాల్గొనడం ద్వారా ప్రయోజనాలు చేకూరుతాయని ప్రభుత్వం భావిస్తోంది. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో పాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి బలరామ్‌ భార్గవ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌, నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌, సీఈపీఐ (కోయలిషన్‌ ఫర్‌ ఎపిడెమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌) సీఈవో రిచర్డ్‌ హాచెట్‌, గ్లోబల్‌ హెల్త్‌, గేట్స్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు ట్రెవర్‌ ముండేల్‌తో పాటు 50కి పైగా దేశాలకు చెందిన ఔషధ, బయోటెక్‌ సంస్థల అధిపతులు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు పాల్గొననున్నారు. భారత్‌ బయోటెక్‌, సాయి లైఫ్‌సైన్సెస్‌, జీవీకే బయోసైన్సెస్‌, సైటివా, ఫెర్రింగ్‌ ఫార్మాస్యూటికల్స్‌, విర్‌చౌ బయోటెక్‌, యూఎస్‌ ఫార్మాకోపీయా, ఎమ్‌ఎన్‌ పార్క్‌, భారత్‌ సీరమ్స్‌ అండ్‌ వ్యాక్సిన్స్‌, కె.రహేజా, బయోలాజికల్‌-ఇ వంటి సంస్థలు దీని నిర్వహణలో పాలు పంచుకుంటున్నాయి.  ఈ నెల 22న ఉదయం 11 గంటలకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు సదస్సును ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు జినోమ్‌ వ్యాలీ ప్రతిభా పురస్కారం (ఎక్స్‌లెన్స్‌ అవార్డు) ప్రదానం చేస్తారు. సదస్సు సందర్భంగా ఏటా జీవశాస్త్రాల రంగంలో అత్యుత్తమ సేవలందించేవారికి ఈ పురస్కారాలను అందజేస్తున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ‘ఆరోగ్య పరిరక్షణ సేవలకు దృశ్యమాధ్యమ అనుసంధానం’ అంశంపై చర్చలో జీవ అధ్యయన, పరిశోధన సంస్థ (సీబీఈఆర్‌) సంచాలకుడు పీటర్‌ మార్క్స్‌ కీలకోపన్యాసం చేస్తారు. సాయంత్రం 4 గంటలకు ఆరోగ్య పరిరక్షణ-వాస్తవ పరిస్థితులు, 5 గంటలకు టీకాల ప్రపంచం, 6 గంటలకు కరోనా గోప్యత అంశంపై చర్చాగోష్ఠులు జరుగుతాయి.
సత్య నాదెళ్లతో కేటీఆర్‌ ముఖాముఖి చర్చ
23న మధ్యాహ్నం 2.45 నుంచి 3 గంటల వరకు చర్చ-2021 పేరిట ఆరోగ్య పరిరక్షణలో నూతనత్వం అంశంపై జరిగే ముఖాముఖి చర్చలో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో మంత్రి కేటీఆర్‌ పాల్గొంటారు. ఈ సందర్భంగా జీవశాస్త్రాలు, ఆరోగ్య పరిరక్షణ రంగంలో సాంకేతికత, డిజిటల్‌ సేవలు, అంకురాల పాత్ర వంటి అంశాలపై ప్రశ్నోత్తరాలకు సమాధానాలు ఇస్తారు. అంతకుముందు ఉదయం 10.45కి మెర్క్‌ మాన్యుఫ్యాక్చరింగు డివిజన్‌ అధ్యక్షుడు సనత్‌ చటోపాధ్యాయ్‌ కీలకోపన్యాసం చేస్తారు. 11 గంటలకు ‘పంపిణీ భాగస్వామ్యాలు’ అంశంపై, మధ్యాహ్నం 12 గంటలకు యూఎస్‌ ఫార్మాకోపియా సీఈవో రోనాల్డ్‌ పీర్విన్సెంజి కీలకోపన్యాసం, 12.10 గంటలకు ‘వైద్య సాంకేతికతలు- భారత్‌కు భారీ అవకాశాలు’ అంశంపె,ౖ 3 గంటలకు ప్రపంచ ఔషధ రంగం, జీవశాస్త్రాల ఆవిష్కరణలు, సాయంత్రం 4 గంటలకు కరోనా అనంతర పరిస్థితుల్లో పరిశోధన, అభివృద్ధి సంస్థల పాత్ర అంశంపై చర్చాగోష్ఠులు జరుగుతాయి. సాయంత్రం 4.45 నుంచి 5 గంటల వరకు ముగింపు సమావేశం నిర్వహిస్తారు.
రాష్ట్రానికి ప్రయోజనకారి
-జయేశ్‌ రంజన్‌, తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి
తెలంగాణ, భారత్‌లలో జీవశాస్త్రాల, ఔషధ రంగాల పురోగతిలో బయో ఆసియా సదస్సు అమూల్యమైన పాత్ర పోషించింది. బయో ఆసియాకు హైదరాబాద్‌ శాశ్వత వేదికగా ఉండడం రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకారిగా ఉంది. ఈ సదస్సు ద్వారా తెలంగాణలో ప్రభుత్వం, పరిశ్రమల మధ్య భాగస్వామ్యం పెరిగింది. ప్రపంచాన్ని కరోనా అల్లకల్లోలం చేసిన నేపథ్యంలో జరుగుతున్న ఈ సదస్సు కొత్త పరిష్కారాలను చూపుతుంది. ఆవిష్కరణలు, ప్రయోగాలకు నాంది అవుతుందిTags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని