
ప్రధానాంశాలు
భారత్‌ను ఇంకా ‘అనుకరణ దేశం’ అనే అంటున్నారు
ఆవిష్కరణలకు ప్రభుత్వాల మద్దతు పెరగాలి
బయో ఆసియా-2021 సదస్సులో మంత్రి కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: పరిశోధనలు- ఆవిష్కరణలకు మన దేశం పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రభుత్వాలు అండదండలు అందించాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. బయో ఆసియా సదస్సులో మంగళవారం ఆయన ఆన్లైన్ పద్ధతిలో జరిగిన ‘సీఈఓ కాంక్లేవ్’లో పాల్గొన్నారు. ‘ప్రపంచ జనరిక్ ఔషధాల విపణిలో 20 శాతం, టీకాల్లో 62 శాతం వాటా ఉన్నప్పటికీ ‘పరిశోధనల దేశం’ అనే పేరు మనకు రాలేదు. ఇంకా అనుకరణ దేశం (కాపీక్యాట్ డెస్టినేషన్) అనే అంటున్నారు’ అని కేటీఆర్ వివరించారు. పరిశోధనలను ప్రోత్సహించడానికి సరైన విధానాలు అనుసరించడం లేదంటూ, పరిశోధన- అభివృద్ధి (ఆర్ అండ్ డీ) వ్యయాలపై మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) గతంలో 200 శాతం ఉండగా, దాన్ని కేంద్రం 150 శాతానికి, ఆ తర్వాత 50 శాతానికి తగ్గించిందన్నారు. ఇటువంటి చర్యలు ఎంతో నష్టం చేస్తాయని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో స్వావలంబన సాధించాలని ప్రధాన మంత్రి అంటుండగా.. నిర్ణయాలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. జీవశాస్త్రాలు, ఔషధ రంగాల్లో పరిశోధనలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశోధనా ప్రాజెక్టులకు ప్రభుత్వ, ప్రైవేటు నిధులు ఎలా అందించాలో చూడాలన్నారు. పరిశోధనా కార్యకలాపాలకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేయాలని, డిమాండ్ సృష్టించే చర్యలకు నడుం కట్టాలని వివరించారు. జీవశాస్త్రాల విభాగంలో హైదరాబాద్ అత్యంత క్రియాశీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు. ఐటీతో పాటు ఫార్మా, బయోటెక్ కార్యకలాపాలు పెద్దఎత్తున విస్తరిస్తున్న నగరం హైదరాబాద్ మాత్రమేనని, దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వివరించారు.
దుర్వినియోగం వల్లే..
నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ స్పందిస్తూ.. మన దేశంలో పరిశోధనలు- ఆవిష్కరణలు పెద్దఎత్తున సాగేందుకు ప్రైవేటు రంగం ఇంకా క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. ఆర్ అండ్ డీ వ్యయాలపై టీడీఎస్ సదుపాయం దుర్వినియోగమైందని, అందువల్ల ప్రభుత్వం తగ్గించిందన్నారు. నియంత్రణ వ్యవస్థల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి సారించి, చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పరిశ్రమ- విద్యాసంస్థల మధ్య సహకారం బాగుంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు.
నిబంధనల్లో స్థిరత్వం కావాలి
ప్రభుత్వ నిబంధనల్లో స్థిరత్వం, నియంత్రణ వ్యవస్థ విధివిధానాలు సానుకూలంగా ఉంటే దేశీయ ఔషధ పరిశ్రమ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని లుపిన్ లిమిటెడ్ ఎండీ నీలేష్ గుప్తా అభిప్రాయపడ్డారు. బయోలాజిక్స్లో చైనా, కేన్సర్ విభాగంలో అమెరికా ఎన్నో విజయాలు సాధిస్తున్నాయని, పెద్దఎత్తున పరిశోధనలు చేసి కొత్త మాలిక్యూల్స్‌ను ఆవిష్కరిస్తున్నాయని, ఈ విషయంలో మనదేశం వెనుకబడిందని వివరించారు.
ఎగుమతి ప్రోత్సాహకాలు, రాయితీలపై అనిశ్చితి
పిరమాల్ గ్రూపు వైస్-ఛైర్పర్సన్ డాక్టర్ స్వాతి పిరమాల్ మాట్లాడుతూ దేశంలో 21 కంపెనీలు కొవిడ్-19 టీకాపై పనిచేస్తున్నాయని, అవన్నీ ప్రైవేటు నిధులతో చేపట్టిన పరిశోధనా ప్రాజెక్టులేనన్నారు. ఎగుమతి ప్రోత్సాహకాలు, ఇతర రాయితీల విషయంలో అనిశ్చితి ఉన్నట్లు వివరించారు. ఇన్ఫ్లమేషన్, క్రిటికల్ కేర్ విభాగాల్లో కొత్త ఔషధాలు, చికిత్సలకు దోహదపడాలనేది తమ సంస్థ ఆలోచనగా స్వాతి పిరమాల్ వివరించారు.
అతిపెద్ద ఇన్సులిన్ కేంద్రంగా బయోకాన్!
మన దేశం ఎక్కువ మందులు సరఫరా చేయడం కాకుండా అధిక విలువైన మందులు అందించేదిగా ఎదగాలని బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా ఆకాంక్షించారు. పరిశోధనా కార్యకలాపాలకు మన కంపెనీలు వార్షికాదాయాల్లో 6% మాత్రమే వెచ్చిస్తున్నాయని, ఇది 16% అయినా కావాల్సి ఉందన్నారు. పరిశోధనలు- ఆవిష్కరణలకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు నామమాత్రంగా ఉన్నాయని, ప్రైవేటు రంగమే పరిశోధనలపై కాస్తోకూస్తో అధికంగా ఖర్చు చేస్తోందని వివరించారు. బయోకాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సులిన్ తయారీ- విక్రయ సంస్థగా ఎదగాలనుకుంటోందని ఆమె స్పష్టం చేశారు.
కేటీఆర్ సందేహం.. సత్య నాదెళ్ల సమాధానం
‘‘మా అబ్బాయి కొన్న కొత్త బూట్లకు ట్రాకింగ్ సాంకేతికత ఉంది. ఇందులో నమోదయ్యే వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్లకుండా ఉంటుందా? గోప్యత సాధ్యమేనా?’’... అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అడిగిన ప్రశ్నకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల బదులిచ్చారు. సమాచార గోప్యతపై ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన ప్రమాణాలు ఉండాలని ఆయన సూచించారు. బయో ఆసియా సదస్సులో భాగంగా మంగళవారం వీరిద్దరూ ఆన్లైన్లో సంభాషించుకున్నారు.
మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి!
ప్రధానాంశాలు
దేవతార్చన

- ఏంటీ ఇవన్నీ రీమేక్‌లా..!
- నాపై నాకే చిరాకేసింది: బెన్‌స్టోక్స్
- పెళ్లి కుదిరాక నిరాకరించాడని!
- అర్ధరాత్రి ఆకలేస్తోందా...
- నెలకు రూ.8వేలు రావాలంటే...
- ప్రభాస్‌తో ఫరియా.. పాయల్ తెలుగు.. శ్రీముఖి సెల్ఫీ
- మనసుకు నచ్చినవాడిని మనువాడి...
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
- క్యాస్టింగ్ కౌచ్‌ని ఎదిరించి.. సినిమాల్లో రాణించి..!
- రివ్యూ: ఏ1 ఎక్స్‌ప్రెస్