close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మన కొలతలు.. మన చెప్పుచేతల్లో!

త్వరలో దేశీయంగా పాదరక్షల ప్రమాణాలు
సిద్ధం చేయనున్న సీఎల్‌ఆర్‌ఐ

పాదరక్షల కొలతల విషయంలో భారత్‌ స్వావలంబన సాధించనుంది. ఇదేమిటీ ఇప్పటివరకు దేశంలో చెప్పులు, బూట్లు తయారవుతున్నాయిగా.. మరి స్వావలంబన ఏమిటీ? అని ఆశ్చర్యపోకండి! అంతా సవ్యంగా సాగితే వచ్చే ఏడాది భారత్‌ సొంత ‘పాదరక్షల కొలత’లను రూపొందించుకుంటుంది. అప్పుడు నిర్ధారించిన కొలతల ఆధారంగానే భవిష్యత్తులో దేశంలో చెప్పులు, బూట్లు తయారవుతాయి.

మరి ఇప్పుడున్నవి?: ప్రస్తుతం దేశంలో వినియోగంలో ఉన్న పాదరక్షల కొలతలు మనవి కావు. భారత్‌కు ఇప్పటివరకు తనదైన పాదరక్షల కొలతల వ్యవస్థ లేదు. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్‌వారు ప్రతిపాదించిన కొలతలనే ఇప్పటికీ మనం వాడుతున్నాం. చెప్పులు, బూట్లు తయారు చేసేవారు ఇప్పటికీ బ్రిటిష్‌ కొలతల వ్యవస్థ ఆధారంగా (వాటికి సమానమైన ఐరోపా, అమెరికా కొలతల్లో) పాదరక్షలు తయారు చేస్తున్నారు. బ్రిటన్‌ పాదరక్షల కొలతల వ్యవస్థ ప్రకారం భారతీయ మహిళ పాదరక్షల సగటు సైజ్‌ 4 నుంచి 6. పురుషులదైతే 5 నుంచి 11.
ఇప్పుడు ఏం చేస్తారు?: చెన్నైలోని కేంద్ర తోలు పరిశోధన సంస్థ (సెంట్రల్‌ లెదర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌్-సీఎల్‌ఆర్‌ఐ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మనవారి పాదాలను స్కానింగ్‌ చేసే సర్వే ప్రారంభం కానుంది. ఆ సర్వే తర్వాత భారత పాదరక్షల కొలతలకు సంబంధించి కొత్త వ్యవస్థను నిర్ధారిస్తారు.

ఎందుకోసం?: పాదరక్షల ఆకృతిని సిద్ధం చేయడం అంత సులభమైన వ్యవహారం కాదు. చాలా శాస్త్రీయమైన, ఇంజినీరింగ్‌ నైపుణ్యం అవసరం. సౌకర్యం, పాదాల ఆరోగ్యం బాగుండాలంటే సరైన కొలత తప్పనిసరి! అమెరికా, ఐరోపా పౌరులతో పోలిస్తే భారతీయుల పాదరక్షల అవసరాలు భిన్నంగా ఉంటాయని, అందుకే ఇతర దేశాల నుంచి అరువు తెచ్చుకున్న కొలతల వ్యవస్థ మనకు అన్నివేళలా సరిపోదనే ఉద్దేశంతో కొత్త సర్వేకు శ్రీకారం చుడుతున్నారు. 1969లో ఈ దిశగా ప్రయత్నాలు మొదలైనా పూర్తిస్థాయిలో జరగలేదు.

2022కల్లా అందుబాటులోకి: కేంద్ర వాణిజ్యశాఖ సహకారంతో సీఎల్‌ఆర్‌ఐ ఆధ్వర్యంలో దాదాపు ఏడాదికిపైగా జరిగే సర్వేలో వివిధ ప్రాంతాల్లోని ప్రజల పాదాలను త్రీడీ స్కానింగ్‌ ద్వారా కొలుస్తారు. పాఠశాలలు, గృహాలు, కార్యాలయాలు ఇలా చాలా ప్రాంతాల్లో సర్వే బృందం తిరుగుతుంది. సుమారు రూ.11 కోట్లతో 100 జిల్లాలో సర్వే చేస్తారు. ఇందుకోసం త్రీడీ పాదస్కానర్లను కొనుగోలు చేశారు. ఈ సర్వేలో సేకరించిన సమాచారం ఆధారంగా భారతీయుల అవసరాలు, వయసుల వారీగా కొలతలు, ప్రత్యేక అవసరాలు తదితరాలను నిర్ధారిస్తారు. 2022కల్లా ఈ కొత్త కొలతల వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. అప్పుడు పాదరక్షల తయారీదారులు వాటి ఆధారంగా ఆకృతులను సిద్ధం చేసుకుని, ఉత్పత్తి ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. కొత్తగా రూపొందించే భారతీయ కొలతలకు సమానమైన బ్రిటన్‌, అమెరికా కొలతలను సైతం నిర్ధారిస్తారు.
* ప్రస్తుతం ప్రపంచంలో పాదరక్షల ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానం (ఏటా 225.7 కోట్లు) భారత్‌ది. వీటిలో 202.1 కోట్ల జతల్ని దేశీయంగానే విక్రయిస్తున్నారు. ఇందులో అత్యధికంగా పురుషుల జతలు 58%, మహిళలవి 30%, పిల్లలవి 9% అమ్ముడవుతున్నాయి.

- ఈనాడు ప్రత్యేక విభాగం

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు