close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అజాగ్రత్తే కొంప ముంచుతోంది!

కొత్త స్ట్రెయిన్ల ప్రభావం స్వల్పమే
స్వీయ నియంత్రణే రక్ష
‘ఈనాడు’తో భారతీయ ప్రజారోగ్య సంస్థ సంచాలకులు డాక్టర్‌ జీవీఎస్‌ మూర్తి

ఈనాడు, హైదరాబాద్‌: తగ్గినట్లే తగ్గిన కొవిడ్‌ మళ్లీ విజృంభిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో కొవిడ్‌ ప్రస్తుతం అదుపులోనే ఉన్నా.. గత కొద్దిరోజులుగా కరీంనగర్‌, జగిత్యాల, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ తదితర కొన్ని జిల్లాల్లో కేసుల్లో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అన్ని వ్యాపార, వాణిజ్య, వినోద కార్యకలాపాలు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయి. తాజాగా 6వ తరగతి నుంచి పాఠశాలల నిర్వహణకు అనుమతించారు. అసలు కొవిడ్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదనే ఆలోచనే లేకుండా అత్యధికులు జీవనం సాగిస్తున్నారు. ఈ అజాగ్రత్త ఇలాగే కొనసాగితే.. రాష్ట్రంలోనూ తిరిగి కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరగడానికి కూడా కొత్త స్ట్రెయిన్‌ల ప్రభావం స్వల్పమేననీ, మాస్కులు ధరించకపోవడం పెనుముప్పుగా పరిణమిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖానికి అచ్ఛాదన లేకుండా గుంపుల్లో తిరగడం వల్ల.. అందులో ఒకరిలో కొవిడ్‌ ఉన్నా వారి ద్వారా అక్కడున్న అందరికీ వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదముందని చెబుతున్నారు ‘భారతీయ ప్రజారోగ్య సంస్థ’ సంచాలకులు డాక్టర్‌ జీవీఎస్‌ మూర్తి. దేశంలో కొవిడ్‌ మళ్లీ విజృంభిస్తోన్న నేపథ్యంలో.. రాష్ట్రంలో కరోనా వైరస్‌ అదుపులోనే కొనసాగాలంటే ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాల్సిందేనని ‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖిలో సూచించారు. ముఖ్యాంశాలు...

ఉన్నత వర్గాలకు ఎక్కువగా..
గత నెల నుంచి నెమ్మదిగా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకలలో కేసులు పెరుగుతున్నా.. స్పష్టమైన కారణాలను ఇప్పటివరకు గుర్తించలేదు. కానీ ప్రజారోగ్య నిపుణుల అంచనా మేరకు..ఆర్థికంగా ఉన్నత వర్గాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అందుకు కారణాలను విశ్లేషిస్తే.. ఆర్థికంగా ఉన్నత వర్గాల వారు మాస్కులు ధరించడం, గుంపుల్లోకి వెళ్లకపోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలను గత 10 నెలల నుంచి తీసుకుంటూ వచ్చారు. కానీ  కొవిడ్‌ ముప్పు ఇక లేదనే భావనతో గత కొద్దికాలం నుంచి వీరు ఈ నిబంధనలను వదిలేశారు. శుభకార్యాలను ఘనంగా చేసుకుంటున్నారు. పెద్దసంఖ్యలో గుంపులుగా చేరుతున్నారు. మెట్రో రైళ్లలోనూ ఎక్కువమంది గుంపులుగా వెళ్తున్నారు. ముఖ్యంగా జనవరి నుంచి ఈ ధోరణి పెరుగుతోంది. దీనివల్ల కూడా కేసుల సంఖ్య పెరిగి ఉండొచ్చు. మహారాష్ట్రలో ధారవి వంటి మురికివాడల్లో కేసులు ఎక్కువగా నమోదు కావడం లేదు. చుట్టుపక్కల ఉన్న ఉన్నత వర్గాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఒక్కటే విషయం గుర్తుంచుకోవాలి.. ఎక్కువ మంది గుమిగూడితే వారిలో ఒక్కరిలో వైరస్‌ ఉన్నా దగ్గు, తుమ్ముల ద్వారా అందరికీ వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంది.

తెలియకుండానే యాంటీబాడీల వృద్ధి
తెలంగాణలో ఆగస్టు చివరి నాటికే కేసులు గరిష్ఠ సంఖ్యలో నమోదయ్యాయి. ఎక్కువమందిలో జలుబు, దగ్గు వచ్చినా సాధారణమే అనుకొని వదిలేశారు కూడా. అయితే అది కొవిడ్‌ కూడా అయి ఉండొచ్చు. అటువంటి వారిలో కొవిడ్‌ ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు) వృద్ధి చెంది ఉంటాయి. ఇప్పటివరకున్న అంచనాల మేరకు ఈ యాంటీబాడీలు ఆరేడు నెలల వరకూ ప్రభావవంతంగా ఉంటాయి. ఆ తర్వాత క్రమేణా ప్రభావాన్ని కోల్పోతాయి. అప్పుడు మళ్లీ ఇన్‌ఫెక్షన్‌ రావడానికి అవకాశాలున్నాయి. కాబట్టి కొవిడ్‌ నిబంధనలను మాత్రం పాటించాలి.

కొత్త స్ట్రెయిన్లతో ఆందోళన అక్కర్లేదు

ఏరకంగా మార్పు చేసుకుంటే.. మనిషిలోకి వెళ్లగలననే ధోరణితో వైరస్‌ తనలో మార్పులు చేసుకుంటుంది. ప్రతి వైరస్‌కు ఇటువంటి ఉత్పరివర్తనాలు వస్తుంటాయి. కొత్త వైరస్‌ స్ట్రెయిన్ల వల్ల వైరస్‌ వ్యాప్తి పెరుగుతుందేమోనన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమైనా.. ఇప్పటివరకు200కి పైగా స్ట్రెయిన్లను ఒక్క మహారాష్ట్రలోనే కనుగొన్నారు. కానీ వీటిల్లో ప్రమాదకరమైన ఉత్పరివర్తనాలను ఇప్పటివరకు గుర్తించలేదు. అందువల్ల కేసుల సంఖ్య పెరగడానికి కొత్త స్ట్రెయిన్లు కారణం కాదనేది నిపుణుల విశ్లేషణ. యూకే, దక్షిణాఫ్రికా స్ట్రెయిన్లపైనా ఇంగ్లండ్‌లో అధ్యయనాలు జరిగాయి. ఈ కొత్త స్ట్రెయిన్లతో ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి అధికమవుతుందని గుర్తించారు. అంతేతప్ప గత వైరస్‌ కంటే ప్రమాదకరమైనదేమీ కాదని తేల్చారు. కాబట్టి కొత్త స్ట్రెయిన్ల గురించి భయపడక్కర్లేదు. వచ్చే మూడేళ్లలో ఈ స్ట్రెయిన్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. కొత్త స్ట్రెయిన్లను ఎదుర్కొనే సామర్థ్యం కూడా ఇప్పుడు మన దేశంలో ఉన్న టీకాలకు ఉంది. టీకా తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది.
అన్నింటికంటే ముఖ్యం మాస్కులు వాడడం. వాహనంపై వెళ్తుంటే హెల్మెట్‌ ధరించడం లాంటిది టీకా. అయితే వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవడం వంటిది మాస్కు. కాబట్టి ఎంత హెల్మెట్‌ పెట్టుకున్నా.. వేగాన్ని అదుపులో పెట్టుకోకపోతే ప్రమాదం తప్పదనేది గుర్తుంచుకోవాలి. కొవిడ్‌ను నియంత్రించగలిగే శక్తి మన చేతుల్లోనే ఉంది. నిర్లక్ష్యంగా వదిలేస్తే మాత్రం తిరిగి విజృంభించే అవకాశముంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు