close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
డబ్బు కొట్టు.. జీఆర్‌ఈ పట్టు!

 ఆన్‌లైన్‌ పరీక్షలో అక్రమాల దందా
 కంప్యూటర్‌ స్క్రీన్‌ షాట్లతో.. జవాబులు
 రూ.లక్షపైన చెల్లిస్తే 325 మార్కులు
 తెలుగు రాష్ట్రాల్లో రూ.కోట్లలో అక్రమ వ్యాపారం
మాసిని శ్రీనివాసరావు
ఈనాడు, అమరావతి

అమెరికా వెళ్లాలి.. డాలర్లు సంపాదించాలి.. ఆస్తులు కూడగట్టుకోవాలి.. వీటన్నింటికీ తొలిమెట్టు జీఆర్‌ఈ. అక్కడ ఉన్నత విద్య చదవాలంటే ముందుగా గ్రాడ్యుయేట్‌ రికార్డు ఎగ్జామినేషన్‌ (జీఆర్‌ఈ)లో మంచి స్కోరు సాధించాలి. దానికి కనీసం రెండు మూడు నెలలు సిద్ధం కావాలి. కానీ.. అసలేమీ చదవకుండానే 300 మార్కులు తెప్పిస్తామని, అందుకు ఓ 40వేలు చెల్లిస్తే చాలని చెప్పే సంస్థలు పుట్టుకొచ్చాయి. అదే 330 మార్కులు కావాలంటే లక్షా పాతికవేలు కట్టాలి! తెలుగు రాష్ట్రాలకు చెందిన వందలమంది ఇలా అక్రమమార్గంలో జీఆర్‌ఈ స్కోరు సాధించారు. గుంటూరు కేంద్రంగా విదేశాలకు విద్యార్థులను పంపే కొన్ని ఏజెన్సీలు ఈ దందా సాగిస్తుండగా.. ఇటీవలే విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌ నగరాల్లోనూ ఇలాంటివి పుట్టుకొచ్చాయి. అయితే.. ఇలా అక్రమమార్గంలో అమెరికా వచ్చినా రోజూ భయపడుతూనే బతకాల్సి వస్తుందని, ఏ క్షణంలోనైనా దొరికిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అక్రమ దందాపై కొన్ని రోజులుగా నిఘా పెట్టిన ‘ఈనాడు’.. దీనిపై పూర్తి వివరాలు సేకరించి అందిస్తున్న ప్రత్యేక కథనం...
 పరీక్ష ఎలా?
అమెరికాలోని ప్రధాన విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు అకడమిక్‌ స్కోరుతో పాటు జీఆర్‌ఈ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. జీఆర్‌ఈ స్కోర్‌ అధికంగా ఉంటే సీటుతోపాటు ఉపకారవేతనాలూ లభించేందుకు అవకాశం ఉంటుంది. ఈ స్కోరు ఐదేళ్ల వరకు చెల్లుబాటవుతుంది. బాగా చురుకైన విద్యార్థులకే 300-320 మార్కులు సాధించడం కష్టం. అందుకే అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు ఈ పరీక్ష కోసం రాత్రింబవళ్లు కష్టపడతారు. ఇందులో క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌, వెర్బల్‌ రీజనింగ్‌, ఎనలిటికల్‌ రైటింగ్‌ ఉంటాయి. వీటిలో మొదటి రెండింటికీ కలిపి గరిష్ఠంగా 340 మార్కులు, ఎనలిటికల్‌ రైటింగ్‌కు 6 పాయింట్లు ఉంటాయి. అందువల్ల రీజనింగ్‌ పరీక్షలే కీలకం. పరీక్ష సమయం 3.45 గంటలు. కరోనా కారణంగా ఈసారి జీఆర్‌ఈ పరీక్షను ఇంటినుంచే రాసుకునే వెసులుబాటు కల్పించారు. గత సెప్టెంబరు నుంచి పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నా.. ఎక్కువమంది ఆన్‌లైన్‌ పరీక్షే రాస్తున్నారు. ఇదే అక్రమార్కులకు వరమైంది.
 అక్రమాలు ఇలా..
* జీఆర్‌ఈ రాయాలనుకునే విద్యార్థి ముందుగా ఏజెన్సీని సంప్రదించాలి. వాళ్లే పరీక్ష రాసేందుకు రిజిస్టర్‌ చేసుకునే సమయం చెబుతారు. దీనికి విద్యార్థే 213 డాలర్ల పరీక్ష రుసుము చెల్లించి నమోదు చేసుకోవాలి. అప్పుడే పరీక్ష తేదీలను కేటాయిస్తారు. వాటిని ఏజెన్సీకి అందించాలి. విద్యార్థి కోరుకున్న మార్కులను బట్టి డబ్బులు ముందే చెల్లించాలి.
* పరీక్షకు ముందు కంప్యూటర్‌ కెమెరాతో పరీక్ష రాసే గది మొత్తాన్ని 360 డిగ్రీల కోణంలో చూపించాలి. గదిలో ఎవ్వరూ ఉండకూడదు. గది మొత్తం పరిశీలన పూర్తయిన తర్వాత పరీక్ష రాసే టేబుల్‌పై కంప్యూటర్‌ను పెడతారు. దీనికి అమర్చిన కెమెరా 90 డిగ్రీల కోణంలో ఉంటుంది. విద్యార్థి పక్కకు తిరిగినా.. తల తిప్పినా ఆన్‌లైన్‌ కెమెరా పసిగట్టేసి పరీక్షను అక్కడే ఆపేస్తుంది.
* పరీక్ష రాయించేచోట ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. పరీక్ష ప్రారంభమైన తర్వాత రహస్యంగా గదిలోకి ప్రవేశిస్తున్నారు. కెమెరా 90డిగ్రీల కోణంలో ఉండటంతో కంప్యూటర్‌ పక్కనుంచి ప్రశ్నపత్రాన్ని ఫొటోలు తీస్తున్నారు. అనంతరం జవాబు చిట్టీలను కీబోర్డు సమీపంలో ఉంచుతున్నారు. అభ్యర్థి తల తిప్పకుండానే పరీక్ష రాసేలా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.
* ఎనలిటికల్‌ విభాగానికి గంట సమయం ఉంటుంది. అది రాసేలోపు క్వాంటిటేటివ్‌, వెర్బల్‌ రీజనింగ్‌ జవాబులను నిపుణులతో సిద్ధం చేసి అందిస్తున్నారు. ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించే సంస్థకు అనుమానం రాకుండా ఇదంతా సాగిపోతోంది. డిగ్రీలో మంచి మార్కులు రానివారూ జీఆర్‌ఈలో 320కి పైగా మార్కులు సాధిస్తున్నారు. ఈ ఏజెన్సీ నుంచి పరీక్ష రాసిన వారిలో చాలామందికి 310-325 మధ్య వచ్చాయి.
 ఒక్కో సబ్జెక్టుకు ఐదుగురు నిపుణులు
పరీక్ష సమయంలో జవాబులు రాసి ఇచ్చేందుకు ఒక్కో సబ్జెక్టుకు ఐదుగురు అధ్యాపకులను సంస్థ ఏర్పాటు చేసుకుంటోంది. క్వాంటిటేటివ్‌, వెర్బల్‌ రీజనింగ్‌లకు విడివిడిగా సమాధానాలు రాసి ఇస్తారు. ఈ నిపుణులకు ఖాళీ ఉన్నప్పుడే అభ్యర్థులు పరీక్షకు నమోదు చేసుకోవాలి. ఎవరైనా ఏజెన్సీని సంప్రదిస్తే అధ్యాపకుల సమయాన్ని చూసి, పరీక్షకు నమోదు చేసుకునే తేదీని ఇస్తున్నారు.
పరీక్ష కేంద్రాల్లోనే రాస్తే మంచిది: నిపుణులు
జీఆర్‌ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో కాకుండా పరీక్ష కేంద్రాల్లో రాస్తే వచ్చే స్కోరుకు ప్రాధాన్యం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రవేశాల సమయంలో బీటెక్‌ మార్కులనూ చూస్తారని.. దీంతో అక్రమాలకు పాల్పడితే తెలిసిపోతుందని వెల్లడిస్తున్నారు. ఇప్పటికే కొన్ని వర్సిటీలు ఇంటినుంచి రాసే జీఆర్‌ఈ స్కోరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని విజయవాడలోని ఓ ఏజెన్సీ ప్రతినిధి సుమబిందు వెల్లడించారు.


అమెరికా వచ్చినా భయపడుతూ ఉండాల్సిందే

‘‘గతంలో చైనాలో కొందరు జీఆర్‌ఈ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డారు. ఈ విషయం బయటపడి వారందరి ప్రవేశాలను అమెరికా విశ్వవిద్యాలయాలు రద్దుచేసి, కేసులు నమోదు చేశాయి. వారు జీవితంలో అమెరికా వచ్చే అవకాశాన్ని కోల్పోయారు. అక్రమాలు ఎప్పుడైనా బయటపడొచ్చు. అక్రమంగా వస్తే రోజూ భయపడుతూనే ఉండాలి. ఇంటినుంచి రాసే పరీక్షలను బాగా పరిశీలిస్తున్నారు. ఎప్పుడైనా అనుమానం వస్తే పరీక్ష నిర్వహణ సంస్థ పరిశీలిస్తుంది. 320 మార్కులు దాటాయంటే ఉత్తమ విద్యార్థి కింద లెక్క. జీఆర్‌ఈతోపాటు టోఫెల్‌ అవసరమవుతుంది. టోఫెల్‌లో తక్కువ స్కోరు వస్తే జీఆర్‌ఈ స్కోరు విషయం తెలిసిపోతుంది.’’

డాక్టర్‌ రఘు కొర్రపాటి, ప్రొఫెసర్‌, అటార్నీ, దక్షిణ కరోలినా, అమెరికా

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు