close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ రహస్యమేంటో చెప్పండి

  30 రోజుల్లో కేసుల పరిష్కారమెలానో తెలుసుకోవాలని ఉంది
  ప్రత్యేక ట్రైబ్యునళ్ల ఏర్పాటుపై హైకోర్టు వ్యాఖ్యలు

ఈనాడు, హైదరాబాద్‌: జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని ప్రత్యేక ట్రైబ్యునళ్లలో 30 రోజుల్లో భూవివాదాల పరిష్కారం అంటే ఆశ్చర్యంగా ఉందని, అది ఎలాగో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉందని గురువారం హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ రహస్యమెంటో న్యాయవ్యవస్థకు కూడా చెప్పండి.. అనుసరిస్తామని పేర్కొంది. చట్టప్రకారం జరగాల్సిన ప్రక్రియను ఎలా కుదిస్తారని ప్రశ్నించింది. తెలంగాణ భూములు, పట్టా పాస్‌పుస్తకాల చట్టం కింద ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈ ట్రైబ్యునళ్ల ద్వారా భూవివాదాల పరిష్కారంలో న్యాయవాదులకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా కేసులను పరిష్కరించడాన్ని సవాలు చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఎన్‌.శ్రీనివాసరావు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కౌటూరు పవన్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ కేసుల్లో పాత ఆర్వోఆర్‌ చట్టంలో రెవెన్యూ కోర్టులుండేవని, అవి న్యాయవ్యవస్థలోని కోర్టుల మాదిరిగా పనిచేసేవన్నారు.
ఇరుపక్షాల వాదనలకు అవకాశం ఇచ్చేవన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రత్యేక ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేసిందన్నారు. వీటి నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలతో జీవో 4 జారీ అయిందన్నారు. పాత రెవెన్యూ కోర్టుల్లోని కేసులన్నీ ట్రైబ్యునళ్లకు బదిలీ అయ్యాయన్నారు. అయితే ఇక్కడ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా విచారణ ప్రక్రియ ఉందన్నారు. కక్షిదారులకు తమ వాదనలు వినిపించుకునే అవకాశం లేదన్నారు. న్యాయవాదులను కూడా అనుమతించడం లేదన్నారు. పాత రెవెన్యూ కోర్టుల్లో న్యాయవాదులకు అనుమతి ఉండేదన్నారు. ఇవేవీ లేకుండా 30 రోజుల్లో పరిష్కరించాలన్న గడువు నిర్దేశించిందన్నారు. ఇది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ సత్వరంగా పరిష్కరించడం మంచిదేనని, అయితే పరిష్కరించాలన్న హడావుడిలో చట్ట ప్రక్రియను పాటించకపోవడం సరికాదన్నారు. తమ వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వకుండా విచారణ చేపట్టడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని, దాన్ని ఎలా అనుమతిస్తారని ప్రశ్నించింది. ఇలా సహజ న్యాయసూత్రాలను విస్మరించి అనుసరించే విధానాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు