close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ముగ్గురు టీచర్లు, 12 మంది విద్యార్థులకు కరోనా

వేర్వేరు చోట్ల కొవిడ్‌ కేసుల నమోదు
రాష్ట్రంలో కొత్తగా 178 మందికి వైరస్‌.. మరొకరి మృతి

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే యంత్రాంగం: కరోనా తీవ్రత తగ్గిందని ప్రజలు నిబంధనలు పాటించడం లేదు. దీంతో అక్కడక్కడ కొవిడ్‌ కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. దీనికి నిదర్శనం సంగారెడ్డి జిల్లాలో 12 మంది విద్యార్థులకు, మంచిర్యాల జిల్లాలో ముగ్గురు ఉపాధ్యాయులకు, మేడారంలో ఇద్దరు ఆలయ ఉద్యోగులకు శనివారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రజలు కొవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, మాస్కులు ధరించాలని ప్రభుత్వం కోరుతోంది. రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా మరో 178 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం బాధితుల సంఖ్య 2,98,631కి చేరుకుంది. మహమ్మారికి చిక్కి మరొకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 1633కు పెరిగింది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీలో 30 కేసులు నమోదవగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా 20, రంగారెడ్డి 15, కరీంనగర్‌లో 10 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి.  సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 12 మందికి విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి మాజీద్‌ తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఉన్నత పాఠశాలలోని ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు మరో మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఒక టీచర్‌కు కరోనా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నెల రోజులుగా సమ్మక్క సారలమ్మ చిన్న జాతర విధుల్లో ఉన్న ముగ్గురు ఆలయ ఉద్యోగులకు ఆరోగ్య శిబిరంలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చిందని డీఎంహెచ్‌వో అప్పయ్య తెలిపారు.
అదుపులోనే కరోనా: సీఎస్‌
తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. పాజిటివ్‌ రేటు 0.43 శాతంగా ఉందని, ప్రతి రోజు 200 లోపే కేసులు నమోదవుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా మార్చి 1 నుంచి మూడో విడత టీకాల ప్రక్రియ ప్రారంభం కానున్నందున రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబా శనివారం దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. 

సంతలో ‘మహా’ ముప్పు

 

 

నిజామాబాద్‌ జిల్లా నవీపేటలో ప్రతి శనివారం నిర్వహించే మేకల సంత రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్‌గా పేరొందింది. ఇక్కడికి వచ్చే వ్యాపారుల్లో 75 శాతం మంది జిల్లాకు సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి వస్తుంటారు. సంతలో ఎక్కడా కరోనా నిబంధనలు అమలు చేయడం లేదు. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతుండడంతో ఇక్కడా కేసులు పెరుగుతాయని జిల్లావాసులు భయాందోళన చెందుతున్నారు.   

- న్యూస్‌టుడే, నవీపేట

తొలుత కొన్ని కేంద్రాల్లోనే టీకా

కరోనా టీకాను తొలుత కొన్ని కేంద్రాల్లోనే వేయనున్నారు. దేశవ్యాప్తంగా మార్చి 1 నుంచి 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు, 45-59 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా టీకా పంపిణీ కార్యక్రమానికి రెండురోజుల ట్రయల్‌రన్‌ కార్యక్రమం ఆదివారంతో ముగియనుంది. టీకా తీసుకునేవారు మార్చి 1 నుంచి అందుబాటులోకి రానున్న కోవిన్‌ 2.0 యాప్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. మార్చి 1 నుంచి తొలుత వారం రోజుల పాటు పైలట్‌ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇందులో ప్రధాన నగరాల పరిధిలో ముఖ్యమైన కేంద్రాల వివరాలు వస్తాయి. వీటి ఫలితాలను బట్టి మిగతావారికి టీకా కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.  సోమవారం కొందరు ప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు పరిమిత సంఖ్యలో టీకా వేయనున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ కేంద్రాల్లో టీకా కార్యక్రమం ఉచితంగా జరుగుతుందని ప్రజారోగ్య సంచాలకుడు డా.జి.శ్రీనివాసరావు తెలిపారు.
*  ఏపీలో ఈ నెలలో తొలిసారిగా శుక్రవారం అత్యధికంగా 118 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం 9 నుంచి శనివారం ఉదయం 9 గంటల మధ్య 37,041 నమూనాలు పరీక్షించారు.


నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో హైకోర్టు ఇటీవలే ప్రభుత్వానికి, ప్రజలకు సూచనలు చేసింది. జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రజలు వాటిని పట్టించుకోవడం లేదు. దీనికి నిదర్శనమే ఈ చిత్రం. శనివారం జూబ్లీ బస్టాండ్‌ నుంచి కాగజ్‌నగర్‌ వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణికులెవరూ మాస్కును ధరించలేదు. అలాగే ఆర్టీసీ సైతం బస్సులో శానిటైజర్‌ను అందుబాటులో ఉంచలేదు.

-ఈనాడు, హైదరాబాద్‌

Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు