నేటి నుంచి వృద్ధులకు కరోనా టీకా

ప్రధానాంశాలు

నేటి నుంచి వృద్ధులకు కరోనా టీకా

తొలిరోజు 48 ప్రభుత్వ, 45 ప్రైవేటు ఆసుపత్రుల్లో కేంద్రాలు
డీహెచ్‌, డీఎంఈల వెల్లడి

ఈనాడు- హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం నుంచి సుమారు 50 లక్షల మందికి కరోనా టీకా వేయనున్నారు. 60 ఏళ్లు పైబడినవారికి, 45-59 ఏళ్ల మధ్యవయస్కుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి తొలిరోజు పరిమిత కేంద్రాల్లో మాత్రమే టీకాలు వేస్తారు. దాదాపు 1,500 కేంద్రాల్లో వేయాలని ముందు నిర్ణయించినా.. ప్రారంభం రోజున ఎటువంటి గందరగోళానికి తావివ్వకూడదనే ఉద్దేశంతో  ఆ సంఖ్యను 93కు కుదించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నవారికి మాత్రమే తొలివారం అనుమతిస్తారు. కార్యక్రమం సాఫీగా కొనసాగే విధానాన్ని బట్టి.. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోకుండా నేరుగా కేంద్రానికి వచ్చి టీకా వేయించుకునే వారి విషయాన్ని పరిశీలించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. మార్చి 1న రాష్ట్ర వ్యాప్తంగా 48 ప్రభుత్వ, 45 ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకాలు వేస్తారు. ఒక్కో కేంద్రంలో గరిష్ఠంగా రోజుకు 200 మందికి ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి ఉచితంగా వేస్తారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక డోసు ఖరీదు రూ.150.. సేవా రుసుం గరిష్ఠంగా రూ.100 వరకూ వసూలు చేసుకోవచ్చు. అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువగా వసూలు చేయడానికి వీల్లేదని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులు సేవా రుసుంను పూర్తిగా మాఫీ చేసి కూడా టీకాలు ఇవ్వవచ్చనీ, లేదా కొంతమేరకు తగ్గించి వసూలు చేసుకోవచ్చని వారు పేర్కొన్నారు. తొలిరోజు కార్యక్రమం ఉదయం 10.30 గంటలకు మొదలవుతుందని, సాధారణంగా అయితే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ కొనసాగుతుందని వివరించారు. కొవిన్‌ 2.0 యాప్‌లో సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకూ నమోదు చేసుకున్నవారికి కూడా వారు ఎంపిక చేసుకున్న కేంద్రంలో టీకాలు వేస్తామన్నారు. కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో డీహెచ్‌, డీఎంఈలు ఆదివారం విలేకరులతో మాట్లాడారు.

ధ్రువపత్రాల అప్‌లోడ్‌ ముఖ్యం
‘‘ప్రస్తుతం జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలు, పట్టణాల్లో మాత్రమే కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఇది  కనీసం ఐదారు నెలలు కొనసాగుతుంది. కాబట్టి ఎవరూ తమకు లభించదేమోననే ఆందోళన చెందొద్దు. 60 ఏళ్లు దాటిన వారు ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఓటరుకార్డు తదితర ఏదో ఒక గుర్తింపు కార్డును అప్‌లోడ్‌ చేయాలి. 45-59 ఏళ్ల మధ్యవయస్కులు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లుగా.. వైద్యుడు ఇచ్చిన ధ్రువపత్రాన్ని అప్‌లోడ్‌ చేయాలి. టీకా పొందేటప్పుడు సంబంధిత ధ్రువపత్రాల ఒరిజనల్స్‌ను వెంట తీసుకురావాలి. తొలిరోజు సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులకు కూడా టీకాలను వేస్తాం. ప్రజల్లో అపోహలు తొలగించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం. టీకా వేయించుకొని ఇంటికెళ్లాక ఏమైనా అసౌకర్యం కలిగితే.. 104 నంబరుకు కాల్‌ చేసి వైద్యసాయం పొందొచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బుధ, ఆదివారాలు మినహా అన్ని రోజుల్లోనూ టీకాలను వేస్తాం. ప్రైవేటులో వారం రోజుల పాటు వేసినా ఎటువంటి అభ్యంతరాల్లేవు’’ అని ప్రజారోగ్య సంచాలకుడు తెలిపారు. వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘వైద్య సిబ్బంది పర్యవేక్షణలోనే టీకాలను వేస్తారు. ప్రైవేటుకు టీకాలను ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. యాప్‌లో వివరాలు నమోదు చేసిన తర్వాత సెల్‌ఫోన్‌కు ఏ తేదీన ఏ సమయానికి కేంద్రానికి వెళ్లాలో ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. మొదటి డోసు తీసుకున్నప్పుడే రెండోడోసు ఎప్పుడు తీసుకోవాలో తెలుస్తుంది. రెండోడోసు తీసుకోవడం ద్వారా కొవిడ్‌ టీకా పొందినట్లుగా ధ్రువపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది’’ అని చెప్పారు.

కేంద్రం ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు
టీకా కేంద్రానికి దారి తెలియక గందరగోళ పడాల్సిన పని లేదు. ఎందుకంటే కొవిన్‌ 2.0 యాప్‌నకు జీపీఎస్‌ను అనుసంధానించారు. టీకా పొందాలనుకున్న తేదీ, సమయం, పంపిణీ కేంద్రాన్ని ఎంపిక చేసుకుంటే.. ఆ యాపే పంపిణీ కేంద్రానికి దారి చూపిస్తుంది. ఈ యాప్‌ సేవలను కొవిన్‌ అధికారిక వెబ్‌సైట్‌ ccovin.gov.ine లోకి ప్రవేశించి వినియోగించుకోవచ్చని వైద్యవర్గాలు తెలిపాయి.

టీకా వేయనున్న ఆసుపత్రుల జాబితా  


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని