close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భార్య, బిడ్డ బతికితే చాలనుకున్నా!

చిరుతతో పోరాడి గెలిచిన సాహసికుడి మనోగతం
ఆధునిక హొయ్సళగా స్థానికుల ప్రశంసలు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: పులి, చిరుత.. అని చెవినపడితేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఒకవేళ అకస్మాత్తుగా ఓ చిరుత ఎదురుపడితే ప్రాణాలు గాల్లో కలిసినంత పనవుతుంది. అలాంటిది పిడుగులా మీదపడ్డ చిరుతతో భీకరంగా పోరాడి పైచేయి సాధించాడు కర్ణాటకకు చెందిన కొబ్బరికాయల వ్యాపారి  రాజగోపాల్‌ నాయక్‌. భార్యాబిడ్డలను కాపాడుకునేందుకు గత సోమవారం కర్ణాటకలోని హాసన జిల్లా బైరగొండనహళ్లిలో ఆయన చూపిన తెగువ యావత్‌ దేశ ప్రజల ప్రశంసలు అందుకుంది. ఆ నాటి ఘటనతో తీవ్రంగా గాయపడి, కోలుకుంటున్న 38 ఏళ్ల రాజగోపాల్‌ ‘ఈనాడు డిజిటల్‌’ ప్రతినిధితో తన అనుభవం పంచుకున్నారు.

‘‘ఆ రోజు ఆలూరులోని బంధువుల ఇంట పెళ్లికి భార్య, కుమార్తెతో బైక్‌పై వెళ్లి తిరిగి వస్తున్నా. చుట్టూ దట్టమైన పొదలున్న మట్టి రోడ్డు మీదుగా మా ఊరు బెండెకెరు తాండాకు చేరుకోవాలి. 100 మీటర్లు వెళ్తే ఊరు చేరుకుంటాం అనగా నా భార్య భాగ్యాబాయి ‘ఏదో మన దగ్గరకు పరిగెడుతూ వస్తోంది’ అని చెప్పింది. నక్క కావొచ్చని చెప్పా. అంతలోనే వేగంగా వచ్చిన ఆ మృగం నా భార్య కాలు పట్టుకుంది. భాగ్యాబాయి గట్టిగా అరుస్తూ కిందపడిపోయింది. మా కుమార్తె, నేనూ బైక్‌పై నుంచి రోడ్డుపై పడ్డాం. బైక్‌ పొదల్లోకి దూసుకెళ్లింది. లేచి చూస్తే నా భార్య కాలు నోట కరుచుకున్న చిరుత కనిపించింది. క్షణం వృథా చేయకుండా కుమార్తెను దూరంగా ఉండమని చెప్పి చిరుతను కాలితో తన్నా. అది ఆమెను వదిలి నాపై పడింది.


పారిపొమ్మని అరిచా

చిరుత నన్ను గోళ్లతో రక్కుతూ, నోట కరిచేందుకు చూసింది. దాని నుంచి తప్పించుకుంటూ నా భార్య, కుమార్తెను ఉరకమని అరిచా. ఆ క్షణంలో నేనైతే బతకను భార్య, బిడ్డను రక్షిస్తే చాలనుకుని పోరాడా. చిరుత పదే పదే తలను నోట కరిచేందుకు వస్తుండటంతో ఇక లాభం లేదనుకుని దాని నోట్లో ఎడమ చేయిని దూర్చా. కుడి చేత్తో దాని మెడపై పిడిగుద్దులతో ఎదురుదాడి చేశా. మోచేయి వరకు దాని నోట్లోకి దూర్చి పట్టు చిక్కకుండా చేశా. కుడి చేత్తో కిందకు పడేసి దానిపై కూర్చున్నా. అప్పటి వరకు పెద్దగా గాండ్రిస్తున్న ఆ మృగం కాస్త నెమ్మదించింది. దాని పైనుంచి లేద్దామనుకుంటే మళ్లీ కదిలింది. చేసేదిలేక దాని మెడపై కొడుతూనే ఉన్నా. చివరికి లేవలేకపోయింది. అప్పటికే మా ఊరివైపు పరుగు పెడుతున్న నా భార్య మధ్యలోనే పడిపోయింది. నా కుమార్తె అరుస్తూ వెళ్లి ఊళ్లో వాళ్లని తీసుకొచ్చింది. బాగా గాయాలవటంతో ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. 25 నిమిషాల పాటు దానితో పోరాడా. నా గుద్దులతోనే అది చచ్చి ఉంటుంది. ఆపై ఊళ్లోవాళ్లు వచ్చి కర్రలతో కొట్టారని తెలిసింది’’.


ఆధునిక హొయ్సళ!

10 నుంచి 14వ శతాబ్ది వరకు కర్ణాటకలోని హాసన జిల్లాను హొయ్సళ రాజులు పాలించారు. అప్పట్లో ‘సళ’ అనే యువకుడిని తన జైన గురువు దేవాలయంలోకి చొరబడిన పులిని చంపమని ఆదేశిస్తాడు. పులితో పోరాడేందుకు ‘సళ’ను ఉత్సాహపరుస్తూ ఆ గురువు ‘హోయ్‌ సళ’ (ఎదుర్కో సళ) అని పిలుపునిచ్చాడు. దాంతో సళ వెళ్లి పులిని చంపాడు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ‘హొయ్సళ’ పేరు మార్మోగింది. ఆ పోరుగడ్డకు చెందిన రాజగోపాల్‌ భార్యాబిడ్డలను రక్షించుకునేందుకు చిరుతను మట్టుబెట్టారు. అతని సాహసాన్ని గుర్తించిన హాసన జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆయనకు ‘ఆధునిక హొయ్సళ’ బిరుదుతో సత్కరించింది.

చూస్తూ అల్లాడిపోయా

మా ఆయన చిరుతతో పోరాడుతుంటే అక్కడే పశువులు కాస్తున్న కొందరు దగ్గరకు కూడా రాలేదు. ఆయన మమ్మల్ని పారిపొమ్మని చెబుతున్నా వదిలి వెళ్లలేకపోయా. రాళ్లతో చిరుతను కొడదామంటే ఆయనకు తగులుతుందేమోనని భయపడ్డా. అటు ఊళ్లోకి పోలేక, చూస్తూ ఉండలేక అల్లాడిపోయా. ఆ చిరుత చేస్తున్న దాడి చూస్తే ఆయన బతకడేమో అనుకున్నా. మాలో ఎవ్వరం బతకమని అనుకున్నా. ఆయన ధైర్యమే కాపాడింది.

- భాగ్యాబాయి, రాజగోపాల్‌ భార్య

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు