close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బీమాసురులు

అమాయకుల్ని హతమార్చి, ప్రమాదాలుగా చిత్రీకరించి రూ.కోట్లలో క్లెయిమ్‌లు
ఐదారుగురిని చంపిన ముఠా
పోలీసుల అదుపులో నిందితులు!
ఈనాడు, నల్గొండ-దామరచర్ల, న్యూస్‌టుడే

అదొక భయంకరమైన ముఠా. ఇద్దరు ప్రైవేటు బీమా ఏజెంట్లు.. కరడుగట్టిన హంతకులు.. ఇందులో సభ్యులు. వారికి కొందరు బ్యాంకు సిబ్బంది కూడా జత కలిశారు. అంతా కలిసి డబ్బు కోసం కిరాతక కార్యాలకు తెరలేపారు..
ఈ ముఠా సభ్యులు ముందుగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలు సేకరిస్తారు. కుటుంబ సభ్యులను ఒప్పించి వారి పేరుతో లక్షల రూపాయలకు బీమా చేస్తారు. ఒకట్రెండు కిస్తీలు తామే కట్టేస్తారు. కుటుంబ సభ్యుల (నామినీ)తో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఆ తర్వాత వీళ్ల ముఠాలోని కొందరు అనారోగ్యంతో ఉన్న ఆ వ్యక్తిని హత్య చేసి.. రోడ్డు మీదకు తెచ్చి పడేస్తారు. ఏ కారుతోనో ఢీకొట్టించి.. ప్రమాదంలో మృతిచెందినట్లుగా చిత్రీకరిస్తారు. పోలీసుల నుంచి ఎఫ్‌ఐఆర్‌ తీసుకుంటారు. దాని సాయంతో బీమా పాలసీని క్లెయిమ్‌ చేసుకుంటారు. విచారణకు వచ్చిన థర్డ్‌ పార్టీ సభ్యులను, డబ్బుల పంపిణీలో బ్యాంక్‌ సిబ్బందిని కూడా ‘మేనేజ్‌’ చేస్తారు. వచ్చిన మొత్తంలో 20 శాతం నామినీకి ఇచ్చి మిగతా మొత్తాన్ని తలా కొంత పంచుకుంటారు.
బీమా డబ్బుల కోసం గత మూడేళ్లలో ఏకంగా ఐదారుగురిని దారుణంగా హత్య చేసి ప్రమాదాలుగా చిత్రీకరించిందో ముఠా. ఈ దందాలో దామరచర్ల మండలంలోని ఓ తండాకు చెందిన ఇద్దరు ప్రైవేటు బీమా ఏజెంట్లు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. వీరితో పాటు గత కొన్ని సంవత్సరాలుగా హత్యలకు సహకరిస్తున్న మొత్తం 17 మంది నిందితులను నల్గొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్‌ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ దందాలో కీలక పాత్ర పోషించిన ఏజెంటు ఒకరు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉండగా.. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో వీరిని రిమాండ్‌ చేయనున్నట్లు ఓ అధికారి ‘ఈనాడు’కు వెల్లడించారు.
వెలుగులోకి ఇలా
నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం కొండ్రపోల్‌కు చెందిన దేవిరెడ్డి కోటిరెడ్డి వారం  రోజుల క్రితం అనుమానాస్పదంగా నార్కట్‌పల్లి - అద్దంకి రహదారి పక్కన మరణించారు. ఆయన ట్రాక్టర్‌ ఢీకొని చనిపోయాడని భార్య కుటుంబ సభ్యులను నమ్మించింది.
అంత్యక్రియల సమయంలో మృతదేహంపై ఉన్న పెద్దపెద్ద గాయాలను చూసి కోటిరెడ్డి తల్లిదండ్రులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కోటిరెడ్డి భార్యను గట్టిగా విచారించగా.. పక్క గ్రామానికి చెందిన ప్రియుడితో కలిసి బీమా డబ్బుల కోసం తామే కోటిరెడ్డిని హత్య చేసి ట్రాక్టర్‌తో తొక్కించామని వెల్లడించినట్లు తెలిసింది. ఈ హత్యలో పాలుపంచుకున్న బీమా ఏజెంటును అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుగొలిపే విషయాలు బయటపడినట్లు సమాచారం. మూడు సంవత్సరాలుగా ఇదే తరహాలో సదరు ఏజెంటు ఓ ముఠాను ఏర్పాటు చేసి ఐదారుగురి ప్రాణాలు తీసి ప్రమాదంగా చిత్రీకరించి బీమా డబ్బులను పంచుకున్నట్లు అంగీకరించాడు.

కొన్ని కిరాతకాలివి..

ఏడాది క్రితం రాళ్లవాగు తండాలో అనారోగ్యానికి గురై మృత్యువుకు చేరువలో ఉన్న వ్యక్తిని దారుణంగా హత్య చేసి మిర్యాలగూడ మండలం గూడూరు సమీపంలో నార్కట్పల్లి-అద్దంకి రహదారిపై వాహనం ఢీకొట్టి చనిపోయినట్లుగా చిత్రీకరించారు. అతనిపై ఉన్న రూ.కోటి బీమాను సదరు ఏజెంటు క్లెయిమ్‌ చేసుకొని నామినీకి మాత్రం నామమాత్రంగానే ముట్టజెప్పారని తెలిసింది.
మూడేళ్ల క్రితం ఇదే మండలంలోని బొల్లిగుట్టతండాలో ఒక వ్యక్తిని చంపేందుకు ఈ ముఠా పథకం వేసింది. పాలసీపై అతడి భార్యతో అవగాహన కుదుర్చుకుంది. బాధితుడికి అనుమానం రావడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. అసలుకే మోసం రానుందని గ్రహించిన సదరు ఏజెంటు వాళ్ల దగ్గర మాయమాటలు చెప్పి బయటపడ్డాడు.

గుంటూరు వ్యక్తితో మొదలు

గుంటూరు జిల్లా తెనాలి వద్ద 2018లో రహదారి ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు అక్కడి పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహానికి శవపంచనామా చేశారు. దేహంపై బలమైన గాయాలు ఉండటంతో అనుమానం వచ్చి సీసీ టీవీ ఫుటేజీలు, కాల్‌డేటా పరిశీలించారు. వాటి ఆధారంగా కుటుంబ సభ్యుల్లో ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. వాళ్లు దామరచర్ల మండలం రాళ్లవాగుతండాకు చెందిన ఓ ప్రైవేటు బీమా ఏజెంటు చెప్పిన ప్రకారం తామీ హత్య చేసినట్లు అంగీకరించాడు. అనారోగ్యంతో ఉన్న ఆ వ్యక్తిపై రూ. 50 లక్షలు బీమా చేసి, అతడిని చంపి తెచ్చి రోడ్డు మీద పడేసి కారుతో ఢీకొట్టి ప్రమాదంగా చిత్రీకరించారని సదరు నిందితుడు వెల్లడించాడు. ఈ కేసులో అరెస్టయిన సదరు ఏజెంటు బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ అదే దందాతకు తెరతీశాడు. గత మూడేళ్లలో దాదాపు ఐదారుగురిని ఇలా చంపినట్లు తెలిసింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు