close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆక్రమణలే ముంచాయి

హైదరాబాద్‌ ముంపుపై నీతి ఆయోగ్‌ నివేదిక
ప్రకృతి వైపరీత్యాల నిర్వహణకు ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేదని ఆక్షేపణ  
వాతావరణ హెచ్చరికల వ్యవస్థను సరిగా వినియోగించుకోవడంలేదని వెల్లడి  
చెరువులను అనుసంధానించి వరదనీటిని మళ్లించాలని సూచన

ఈనాడు, దిల్లీ: జలవనరుల ఆక్రమణల వల్లే గత ఏడాది అక్టోబరులో హైదరాబాద్‌ను భారీ వరదలు ముంచెత్తాయని నీతి ఆయోగ్‌ పేర్కొంది. హుస్సేన్‌సాగర్‌ గట్లు, నాలాలన్నీ ఆక్రమణకు గురవడమే సమస్యకు ప్రధాన కారణమని స్పష్టంచేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకప్పుడు చెరువులు, కుంటలు, బావుల వంటి చిన్నా, పెద్ద నీటివనరులు దాదాపు లక్ష వరకు ఉండేవని.. వాటి సంఖ్య ఇప్పుడు 185కి తగ్గిపోయిందని తెలిపింది. వాటిలోనూ సగానికి సగం చెరువుల ప్రవాహ మార్గాలన్నీ మూసుకుపోయాయని పేర్కొంది. హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వద్ద కాని, తెలంగాణ ప్రభుత్వం వద్ద కాని ప్రకృతి వైపరీత్యాల నిర్వహణకు సరైన ప్రణాళికే లేదని ఆక్షేపించింది. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను నివారించాలంటే జంటనగరాల్లోని డ్రైనేజీ వ్యవస్థ విస్తరణ, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సిఫార్సు చేసింది. నగరంలో ఎక్కడ వర్షం కురిసినా భూగర్భ డ్రైనేజీ ద్వారా మూసీ నదికి చేరేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌ నేతృత్వంలోని 16 మంది సభ్యులతో కూడిన కమిటీ వరదల నివారణపై ఓ నివేదికను రూపొందించింది. దేశంలోపల, సరిహద్దుల్లోనూ వరదల నియంత్రణ, నదీ యాజమాన్య కార్యకలాపాలపై ఈ అత్యున్నత నిపుణుల బృందం అధ్యయనం చేసి రూపొందించిన నివేదికలో హైదరాబాద్‌ వరదలకు కారణాలు, భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్పృశించింది. ‘‘గత ఏడాది అక్టోబరు 14న హైదరాబాద్‌ను పెనువరదలు ముంచెత్తాయి. కొన్నిచోట్ల 12 నుంచి 10 అడుగుల మేర నిలిచిపోయిన నీరు ఎన్నో కాలనీలను చుట్టుముట్టింది. భారీ వరదలు 33 నిండు ప్రాణాలు బలికాగా, కనీసం 37,409 కుటుంబాలు వీటివల్ల ప్రభావితమైనట్లు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అంచనా వేసింది. నగరానికి రూ. 670 కోట్ల నష్టం వాటిల్లినట్లు మున్సిపల్‌ మంత్రి చెప్పారు’’ అని నివేదిక పేర్కొంది.

వరదలకు కారణాలివే..

నగరంలోని చెరువులు పొంగి పొర్లడం వల్లే అత్యధిక నష్టం జరిగింది. హుస్సేన్‌సాగర్‌ నాలాల ఆక్రమణల వల్ల వరద నీరు కాల్వల బయట ప్రవహించింది. అదే సమస్యకు ప్రధాన కారణం. దానివల్లే వరద ప్రభావం తీవ్రత పెరిగి ఎక్కువ ప్రాంతం నీట మునిగింది.
గత కొన్ని దశాబ్దాలుగా జలవనరుల సంఖ్య దారుణంగా పడిపోయింది. ఉన్న 185 చెరువుల్లోనూ 75 చెరువుల ప్రవాహ మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయి.
ముందస్తుగా స్పష్టమైన వాతావరణ హెచ్చరికలు జారీచేసే డాప్లర్‌ రాడార్లను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడంలేదు. ప్రకృతి వైపరీత్య నిర్వహణపై సరైన దృష్టి పెట్టడంలేదు.

నివారణకు ఏం చేయాలి?

నగరంలో అత్యవసరంగా డ్రైనేజీ వ్యవస్థను విస్తరించాలి. అధిక వాననీటిని తీసుకోవడంలో చెరువులు, కాల్వలు, చిత్తడి నేలలు, వాటర్‌షెడ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాని జంటనగరాల్లో పట్టణీకరణ కారణంగా దురదృష్టవశాత్తు చిత్తడి నేలలన్నీ కనుమరుగవుతున్నాయి.
1989 - 2001 మధ్యకాలంలో హైదరాబాద్‌ నగరం 3,245 జలవనరులను కోల్పోయింది. అందువల్ల మున్ముందు పట్టణ ప్రణాళిక రూపకర్తలు హైడ్రో జియాలజీని పరిగణనలోకి తీసుకొని నిర్మాణాలు, అభివృద్ధి, భూ వినియోగానికి అనుమతిస్తేనే దీర్ఘకాలంలో వరద ముంపును నివారించడానికి వీలవుతుంది. చిత్తడి నేలలను కనుమరుగు చేసేలా నిర్మాణాలు చేపట్టకూడదు.
వరదల సమయంలో పోటెత్తే నీటిని మళ్లించేందుకు వీలుగా హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న 185 చెరువులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేయాలి. దీంతోపాటే వరదనీటి ప్రవాహాన్ని నియంత్రించేలా నాలాలను పునరుద్ధరించి, ఆక్రమణలను తొలగించాలి.
నాలాలు, డ్రెయిన్లు, నీటి ప్రవాహ మార్గాలు, వరద మైదానాల సరిహద్దులను స్పష్టంగా గుర్తించి, కొత్తగా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు వాటికి దూరంగా ఉండేలా పరిమితం చేయాలి.
కొత్త లేఅవుట్లకు అనుమతుల సమయంలోనూ ఇందుకు సంబంధించిన నిబంధనలన్నీ కఠినంగా అమలుచేయాలి.
ఎక్కడ వర్షం కురిసినా మూసీ నదిలోకి చేరేలా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను తీర్చిదిద్దాలి.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు