విద్యార్థులపై కొవిడ్‌ కోరలు

ప్రధానాంశాలు

విద్యార్థులపై కొవిడ్‌ కోరలు

రాష్ట్రవ్యాప్తంగా 104 మందికి వైరస్‌

ఈనాడు డిజిటల్‌, న్యూస్‌టుడే యంత్రాంగం: రాష్ట్రంలో పాఠశాలలపై కొవిడ్‌ ప్రతాపం చూపుతోంది. ఫలితంగా పెద్దసంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు కరోనా బారిన పడి విలవిల్లాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పాఠశాలల్లో ఏకంగా 104 మంది విద్యార్థులకు కరోనా సోకింది.

36 మంది మైనార్టీ గురుకుల విద్యార్థినులకు కరోనా
తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 36 మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. మేడ్చల్‌ జిల్లా బాలానగర్‌ మండలానికి చెందిన మైనార్టీ గురుకుల పాఠశాలను నాగోలు బండ్లగూడలోని ఆనంద్‌చౌరస్తాలోని ఓ వాణిజ్య భవనంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ 165 మంది ఉంటున్నారు. వారిలో 25 మంది విద్యార్థులకు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేయగా 18 మందికి పాజిటివ్‌గా తేలింది. అనంతరం మిగిలిన విద్యార్థులు, 19 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో మరో 18 మంది విద్యార్థులకూ కరోనా ఉన్నట్లు తేలింది. వారందరినీ భవనంలోని అయిదో అంతస్తులో ఐసొలేషన్‌కు తరలించారు. నెగెటివ్‌ వచ్చిన విద్యార్థులను తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లిపోయారు.
* హైదరాబాద్‌లోని న్యూ బోయిన్‌పల్లి బాపూజీనగర్‌లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహంలో ముగ్గురు విద్యార్థులు కరోనా బారినపడ్డ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
* మంచిర్యాలలోని బాలికల పాఠశాలలో మంగళవారం కరోనా కేసుల సంఖ్య 28గా తేలింది. ఆరోగ్యశాఖ  ప్రత్యేక వైద్య శిబిరంలో 174 మందికి పరీక్షలు నిర్వహించగా 34 పాజిటివ్‌గా తేలాయి. ఇందులో 28 మంది విద్యార్థినులు.. ఆరుగురు తల్లిదండ్రులు  ఈ నేపథ్యంలో ఆ పాఠశాలకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. బెల్ల్లంపల్లిలోని ఓ ఉపాధ్యాయురాలికి, చెన్నూరులో ఓ ఉపాధ్యాయుడికి పాజిటివ్‌ వచ్చింది.
* కామారెడ్డి సమీప కస్తూర్బా విద్యాలయంలో 32 మంది విద్యార్థినులకు కరోనా సోకినట్లు నిర్ధారించారు.
* కరీంనగర్‌ నగరం సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం అయిదుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.


ఏపీలో 261 మందికి కరోనా..

అమరావతి, ఈనాడు: ఏపీలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. సోమవారం ఉదయం 9 నుంచి మంగళవారం ఉదయం 9గంటల వరకు 23,417 నమూనాలు 261 మందిలో (1.11శాతం) మందిలో పాజిటివ్‌గా తేలింది. కొత్తగా మరణాలు సంభవించలేదు.


ఒక్కరోజులోనే 60వేల పరీక్షలు
కొత్తగా 204 కొవిడ్‌ కేసులు

ఈనాడు,హైదరాబాద్‌: రాష్ట్రంలో ఒక్క రోజులోనే 60,263 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. గతేడాది కాలంలో ఒక్కరోజులోనే ఇంత భారీగా పరీక్షలు నిర్వహించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. జులై, ఆగస్టు మాసాల్లో రోజుకు 52-54వేల పరీక్షలు నిర్వహించిన సందర్భాలున్నాయే తప్ప.. 60వేలను దాటిన దాఖలాలు లేవు. ఈ నెల 15న(సోమవారం) రాత్రి 8 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు. కొత్తగా 204 కొవిడ్‌ కేసులు నమోదవగా.. మొత్తం బాధితుల సంఖ్య 3,01,522కు పెరిగింది. మహమ్మారి కారణంగా మరో 2 మరణాలు సంభవించగా, ఇప్పటి వరకూ 1,656 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో మొత్తం పరీక్షల సంఖ్య 92,99,245కు పెరిగింది. మరో 439 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. మరోపక్క రాష్ట్రంలో మరో 35,730 మందికి కొవిడ్‌ తొలిడోసు టీకాను వైద్యఆరోగ్యశాఖ పంపిణీ చేసింది. వీరిలో 60 ఏళ్లు పైబడినవారు 21,905 మంది ఉండగా.. 45-59 ఏళ్ల మధ్యవయస్కుల్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 11,787 మంది, వైద్యసిబ్బంది 1,164 మంది, పోలీసులు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్‌ సిబ్బంది 874 మంది చొప్పున టీకాలను పొందారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని