విద్యా సంస్థలన్నీ బంద్‌

ప్రధానాంశాలు

విద్యా సంస్థలన్నీ బంద్‌

నేటి నుంచే అమల్లోకి
వైద్య కళాశాలలకే మినహాయింపు
యథావిధిగా ఆన్‌లైన్‌ తరగతులు
శాసనసభలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నందున రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీలు, గురుకులాలు, హాస్టళ్లు తదితర విద్యాసంస్థలన్నీ బుధవారం నుంచి మూతపడనున్నాయి.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క వైద్య కళాశాలలు మాత్రం పనిచేస్తాయని వెల్లడించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి సబితారెడ్డి శాసనసభలో విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులకు గతంలో మాదిరిగానే ఆన్‌లైన్‌ విధానంలో తరగతులు కొనసాగుతాయని వెల్లడించారు.
ముందు జాగ్రత్తగా..
‘‘దేశంలో మరోమారు కరోనా వ్యాప్తి చెందుతోంది. మన రాష్ట్రంలోని విద్యాసంస్థల్లోనూ చెదురుమదురుగా కేసులు నమోదవుతున్నాయి. విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ పరిస్థితులను సమీక్షించి విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని.. ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నిటినీ ఈనెల 24 నుంచి తాత్కాలికంగా మూసివేయాని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆదేశాల నుంచి వైద్య కళాశాలలకు మినహాయింపు ఉంది’’ అని మంత్రి వెల్లడించారు.
ప్రారంభమై 2 నెలలు కాకముందే..
రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతులు, ఇంటర్‌ విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు మొదలయ్యాయి. అంటే రెండు నెలలు కూడా గడవలేదు. తరగతులు జరిగింది 40-43 రోజులే. ఆ తర్వాత 6, 7, 8 తరగతులకు ఫిబ్రవరి 24 నుంచి అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం ఒకరోజు ముందు ప్రకటించింది. పూర్తిస్థాయిలో విద్యాసంస్థలు సిద్ధం కావడానికి వారం రోజులు పట్టింది. ఫిబ్రవరి 24 నుంచే ప్రారంభమైనట్లు పరిగణనలోకి తీసుకున్నా గరిష్ఠంగా 23 రోజులే జరిగాయి. పదో తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నివేదించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్క మెడికల్‌ కళాశాలల తప్ప మిగిలిన అన్ని విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఓయూ హాస్టళ్లలో కూడా కేసులు నమోదు కావడంతో మున్ముందు వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరిగితే వైద్య కళాశాలల సేవలు అవసరమన్న భావనతోనే వాటిని కొనసాగిస్తున్నట్లు సమాచారం.

పునరాలోచించాలి: ట్రస్మా

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహించామని, ఆ కారణంగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాల సంఘం(ట్రస్మా) ఓ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం పునరాలోచన చేసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
* వార్షిక పరీక్షలు సమీపంలో ఉన్నందున కనీసం 9, 10 తరగతులను కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ కొనసాగించాలని పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నయ్య ప్రభుత్వాన్ని కోరారు. సర్కారు బడుల విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులను అవగాహన చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
* ఇంటర్‌, డిగ్రీ కళాశాలల్లో తరగతులను ప్రత్యక్షంగా నడపాలని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరి సతీష్‌ ప్రభుత్వాన్ని కోరారు. హాస్టళ్లలో మాత్రమే కొన్ని కరోనా కేసులు వస్తున్నాయన్నారు. ఇంటర్‌కు ప్రత్యక్ష తరగతులు నిర్వహించకుంటే జాతీయస్థాయి పరీక్షలైన జేఈఈ మెయిన్‌, నీట్‌ తదితర వాటిల్లో విద్యార్థులు నష్టపోతారని పేర్కొన్నారు.
పీఆర్‌టీయూ టీఎస్‌లో టీఐఈఆర్‌టీయూ విలీనం
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఇంక్లూసివ్‌ ఎడ్యుకేషన్‌ రీసోర్స్‌ టీచర్స్‌ యూనియన్‌(టీఐఈఆర్‌టీయూ)ను పీఆర్‌టీయూ టీఎస్‌లో విలీనం చేసినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిలువేరి వెంకటేశ్‌, ప్రధాన కార్యదర్శి సుమన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఉపాధ్యాయులు రావాలా? వద్దా?
స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
రావాల్సిందేనంటున్న అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయులు, అధ్యాపకులు విధులకు ప్రత్యక్షంగా హాజరు కావాలో.. లేదో ప్రభుత్వం స్పష్టంచేయకపోవడంతో వారిలో అయోమయం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి విద్యాసంస్థలన్నిటినీ మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం జీఓ జారీ చేశారు. ఆ జీఓ ఆధారంగా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన కూడా పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. వాటిలో ఎక్కడా ఉపాధ్యాయులు/అధ్యాపకుల గురించి పేర్కొనలేదు. రావద్దని ఎక్కడా చెప్పలేదు కాబట్టి ఉపాధ్యాయులు విధులకు హాజరుకావాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బీటెట్‌) సంచాలకుడు శ్రీనాథ్‌ మాట్లాడుతూ దానిపై రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉందని, బుధవారమైతే వెళ్లాల్సిందేనని స్పష్టంచేశారు.
కేంద్రీయ పాఠశాలలూ బంద్‌
రాష్ట్ర భూభాగంలో ఉన్నందున కేంద్రీయ విద్యాలయాలు (కేవీ), జవహర్‌ నవోదయ విద్యాలయాలు (జేఎన్‌వీ) కూడా మూసేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జేఎన్‌వీలు నెల క్రితమే 10, 12 తరగతులను ప్రారంభించాయి.
ప్రాక్టికల్స్‌ ఎలా?
సీబీఎస్‌ఈ బోర్డు పది, 12వ తరగతి విద్యార్థులకు మార్చి 1 నుంచి ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తోంది. ఇప్పుడు వాటిని కొనసాగించాలో లేదో తెలియడంలేదని ఆయా పాఠశాలల యాజమాన్యాలు అంటున్నాయి.
పాలిటెక్నిక్‌ పరీక్షలు వాయిదా
పాలిటెక్నిక్‌ డిప్లొమా మొదటి, అయిదు సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 24 నుంచి జరగాల్సి ఉండగా.. వాటిని వాయిదా వేసినట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బీటెట్‌) కార్యదర్శి డాక్టర్‌ సి.శ్రీనాథ్‌ తెలిపారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని