అణచివేత అంతమే విమోచన

ప్రధానాంశాలు

అణచివేత అంతమే విమోచన

బంగ్లాదేశ్‌ యోధులను ప్రస్తుతించిన ప్రధాని మోదీ
బంగబంధు కుమార్తెలకు గాంధీ పురస్కారం బహూకరణ
భారత సైన్యం, ఇందిరాగాంధీ పాత్రకు ప్రశంస  

ఢాకా: ఒకవైపు ఉత్సాహం, మరో వైపు నిరసనల నడుమ భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల బంగ్లాదేశ్‌ పర్యటన శుక్రవారం ఆరంభయింది. బంగ్లాదేశ్‌ విమోచన ఉద్యమం స్వర్ణోత్సవాల్లో ఆయన గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఇది బంగ్లాదేశ్‌ జాతిపిత, బంగబంధు ముజిబుర్‌ రహ్మాన్‌ శత జయంతి ఉత్సవాల సంవత్సరం కూడా కావడం ప్రాధాన్యం సంతరించుకొంది. తొలుత పోరాట యోధులకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ వారు ప్రాణాలను తృణప్రాయంగా వదిలారే తప్ప, అన్యాయాలు, అణచివేతలను వ్యతిరేకించకుండా మౌనంగా ఉండలేదని ప్రస్తుతించారు. అణచివేతకు అంతం పలకడానికే ఈ విమోచన ఉద్యమం జరిగిందని, ఇది స్ఫూర్తిదాయకమని అన్నారు. కొవిడ్‌ తలెత్తిన అనంతరం ప్రధాని మోదీ జరిపిన తొలి విదేశీ పర్యటన ఇదే... వీవీఐపీల కోసం నూతనంగా కొనుగోలు చేసిన బీ777 విమానం (ఎయిర్‌ ఇండియా వన్‌/ ఏఐ1)లో తొలిసారిగా ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాస్కు కట్టుకోవడంతో పాటు, ‘ముజిబ్‌ జాకెట్‌’ను ధరించడం విశేషం. ఢాకాలోని హజ్రత్‌ షాహజ్‌లాల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ఆయనకు స్వయంగా ఆహ్వానం పలికారు. 19 గన్‌ శాల్యూట్‌ స్వాగతం లభించింది. అక్కడ నుంచి నగరానికి 35 కి.మీ.దూరంలోని శవర్‌లో ఉన్న జాతీయ అమరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. అక్కడ పుష్పగుచ్ఛాన్ని ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. పర్యటనకు గుర్తుగా అర్జున వృక్షం మొక్కను నాటారు. ఈ సందర్భంగా ట్వీట్‌ చేస్తూ ‘‘బంగ్లాదేశ్‌ దేశభక్త అమరులకు హృదయపూర్వకంగా నివాళులు అర్పించాను. వారి ఘన త్యాగాలే ఈ గొప్ప దేశ ఆవిర్భావానికి కారణమయింది. లక్షలాదిమంది ప్రాణాలను త్యాగం చేశారే తప్ప మౌనంగా ఉండిపోలేదు. ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర ప్రదేశాన్ని సందర్శించి గౌరవించాలి. అన్యాయంపై జరిగే పోరాటం, ధర్మ పరిరక్షణలో వారు చూపిన సాహసం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తాయి. కపటం, అణచివేతలపై సత్యం, ధైర్యం సాధించిన విజయాలకు ఇక్కడి అమరవీరుల జ్యోతి చిరకాల చిహ్నంగా నిలుస్తుంది. దానికి భారతీయుల తరఫున ప్రార్థనలు చేశా’’ అని పేర్కొన్నారు.

సత్యాగ్రహంలో పాల్గొని జైలుకెళ్లా
నేషనల్‌ పెరేడ్‌ స్క్వేర్‌లో జరిగిన స్వాతంత్య్ర స్వర్ణోత్సవ సభలో ప్రసంగిస్తూ బంగ్లాదేశ్‌ విమోచనలో భారత సైన్యం కీలకపాత్ర పోషించిందని చెప్పారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్ర కూడా ప్రధానమైనదని అన్నారు. ‘ఆ సమయంలో నాకు 20-22 ఏళ్లు ఉంటాయి. బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర పోరాటానికి మద్దతుగా స్నేహితులతో కలిసి సత్యాగ్రహంలో పాల్గొన్నా. జైలుకు వెళ్లా’ అని గుర్తు చేసుకున్నారు. భారత్‌లో పర్యటించాలని 50 మంది బంగ్లాదేశ్‌ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. బంగ్లాదేశ్‌ విద్యార్థులకు ‘సుబర్ణో జయంతి’ ఉపకారవేతనాలు మంజూరు చేస్తామని ప్రకటించారు. బంగ్లాదేశ్‌ జాతిపిత ముజిబుర్‌ రహ్మాన్‌కు భారత ప్రభుత్వం ప్రకటించిన గాంధీ శాంతి పురస్కారాన్ని ఈ సందర్భంగా బహూకరించారు. దీన్ని ముజిబుర్‌ కుమార్తెలయిన ప్రధాని షేక్‌ హసీనా, ఆమె సోదరి షేక్‌ రెహానాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు హమీద్‌ పాల్గొన్నారు. షేక్‌ హసీనా ప్రసంగిస్తూ దక్షిణాసియాలో భారత్‌ కీలక పాత్ర పోషించాలని కోరారు.  
నాయకులతో చర్చలు
ప్రధాని హసీనా, విదేశాంగ మంత్రి ఎ.కె.అబ్దుల్‌ మోమెన్‌, 14 పార్టీల కూటమి నాయకులతో మోదీ చర్చలు జరిపారు. తీస్తా జలాల వివాదాన్ని పరిష్కరించాలని విపక్ష జాతీయ పార్టీ నాయకుడు రౌషాన్‌ ఎర్షాద్‌ కోరారు. బంగ్లాదేశ్‌ విమోచన ఉద్యమంలో పాల్గొన్న ‘ముక్తి జోద్ధా’లతోనూ భేటీ అయ్యారు. మైనార్టీల ప్రతినిధులు, ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ సభ్యులతో సమావేశమయ్యారు. ఉభయ దేశాల ప్రధానులు సంయుక్తంగా ఢాకాలో బంగబంధు- బాపు మ్యూజియంను ప్రారంభించారు. ఇరు దేశాల జాతిపితల జీవిత చరిత్రలను ఇందులో ప్రదర్శిస్తారు.
సంబంధాలు మెరుగుపడాలి
రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడాలని మోదీ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ‘డైలీ స్టార్‌’ పత్రికలో ఆయన వ్యాసం రాశారు. బంగబంధు హత్యకు గురికాకుండా ఉంటే భారత ఉపఖండంలో అభివృద్ధి మరోలా ఉండేదని తెలిపారు. భిన్నమైన అభిప్రాయాలు చెప్పారన్న కారణంతో ఆయనను హత్య చేయడం దారుణమని వ్యాఖ్యానించారు.  
సోనియా, ప్రపంచ నేతల అభినందనలు
స్వర్ణోత్సవాలు జరుపుతున్నందుకు బంగ్లాదేశ్‌ ప్రధాని హసీనాకు అభినందనలు తెలుపుతూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ వీడియో సందేశం పంపారు. బంగ్లాదేశ్‌ విమోచనలో ఇందిరాగాంధీ పాత్రను ఇందులో ప్రముఖంగా ప్రస్తావించారు. బ్రిటన్‌  ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తదితరులు సందేశాలు పంపించారు.
ప్రముఖులంతా ‘ముజిబ్‌ జాకెట్ల’లోనే
భారత్‌లో ‘నెహ్రూ కోటు’ ఎలాగో...బంగ్లాదేశ్‌లో ‘ముజిబ్‌ జాకెట్‌’ అలాగ... ప్రధాని మోదీ సహా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులంతా దీన్ని ధరించారు. ఖాదీ గ్రామీణ ఉద్యోగ సంస్థ పాలీ ఖాదీతో చేసిన 100 నల్లరంగు జాకెట్లను తయారు చేసింది.

మోదీ రాకకు నిరసనగా అల్లర్లు
నలుగురి మృతి

ఢాకా: మోదీ రాకను నిరసిస్తూ కొన్ని ఇస్లామిస్టు గ్రూపులు ఆందోళనకు దిగడంతో అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో ఇద్దరు విద్యార్థులు సహా నలుగురు మృతి చెందారు. మదర్సాలు నిర్వహించే హిఫాజత్‌ ఎ ఇస్లాం అనే ఇస్లామిక్‌ గ్రూపునకు చెందిన ఆందోళనకారులు చట్టోగ్రాం జిల్లాలోని హతజారీ ప్రాంతంలోని పోలీసు స్టేషనులో చొరబడి విధ్వంసం సృష్టించడంతో వారిని చెదరగొట్టడానికి బాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. ఈ సందర్భంగా గాయపడ్డ వారు అనంతరం ఆసుపత్రిలో మరణించారు. ఢాకాలోని ప్రధాన మసీదులో వివిధ వర్గాల ఆందోళన కారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. దీంట్లో ఇద్దరు పాత్రికేయులు సహా కనీసం 50 మంది గాయపడ్డారు. బ్రాహ్మణ్‌బారిలో రైల్వే కార్యాలయాలకు నిప్పుపెట్టి, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని