తొలి పోరులో పైచేయి ఎవరిదో!

ప్రధానాంశాలు

తొలి పోరులో పైచేయి ఎవరిదో!

బెంగాల్‌, అస్సాంలలో నేడే తొలి దశ పోలింగ్‌
ఈనాడు ప్రత్యేక విభాగం

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న పశ్చిమ బెంగాల్‌, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో అసలు తంతుకు రంగం సిద్ధమైంది! తొలి దశలో భాగంగా బెంగాల్‌లో 30 స్థానాలకు, అస్సాంలో 47 సీట్లకు శనివారం పోలింగ్‌ జరగనుంది. పశ్చిమ బెంగాల్‌లో అధికార పీఠం కోసం తృణమూల్‌, భాజపా హోరాహోరీగా తలపడుతుండటం.. కాంగ్రెస్‌-వామపక్షాలు-ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ కూటమి కూడా గట్టిగానే ప్రయత్నిస్తుండటంతో మొదటి దశలో ఎన్నికలు జరిగే స్థానాల్లో ఎవరిది పైచేయి అవుతుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఈ దఫా ఎవరి వైపో..  
తొలి దశలో పోలింగ్‌ జరగనున్న స్థానాలన్నీ.. గిరిజనుల ప్రాబల్యమున్న బంకురా, పురూలియా, ఝార్‌గ్రామ్‌, పశ్చిమ మేదినీపుర్‌, తూర్పు మేదినీపుర్‌ జిల్లాల్లోనివే. ఈ ఐదు జిల్లాలు ఒకప్పుడు వామపక్షాలకు కంచుకోటలు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తృణమూల్‌కు పట్టం కట్టాయి. అయితే- 2019 సార్వత్రిక ఎన్నికల్లో అవి భాజపా వైపు మొగ్గుచూపాయి.
ఆ 30 స్థానాల్లో 2016 నాటి ఫలితాలిలా..
పార్టీ         గెల్చుకున్న సీట్లు   వచ్చిన ఓట్లు (శాతాల్లో)
తృణమూల్‌      27                50.39
కాంగ్రెస్‌          2                 6.01
ఆర్‌ఎస్‌పీ         1                 1.29
భాజపా          0                 8.6
సీపీఎం          0                 19.1

ఐదు సీట్లపై అందరి చూపు..
బెంగాల్‌లో శనివారం పోలింగ్‌ జరగనున్న వాటిలో ప్రధానంగా ఐదు స్థానాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అవి..
1. ఖేజురీ
ఇది ఎస్సీ రిజర్వుడు సీటు. భాజపా నేత సువేందు అధికారి తండ్రి సిసిర్‌ అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంథీ లోక్‌సభ స్థానం పరిధిలో ఉంది. కుమారుడితో పాటే సిసిర్‌ ఇటీవల కమలదళంలో చేరారు. ఇక్కడ భాజపా తరఫున శంతను ప్రామాణిక్‌ పోటీ చేస్తున్నారు.
2. పురూలియా
గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి సుదీప్‌ ముఖర్జీ విజయం సాధించారు. ఇటీవల ఆయన భాజపాలో చేరారు. ఆ పార్టీ తరఫున బరిలో నిలిచారు. 2016లో ఇక్కడ గెలుపు అంతరం ఐదు వేల ఓట్ల కంటే తక్కువగా నమోదైంది.
3. బాఘ్‌ముండీ
ఇదీ కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానమే. రెండు సార్లు విజేతగా నిలిచిన నేపాల్‌ చంద్ర మహతో కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్నారు. 2016 ఎన్నికల్లో భాజపాకు ఇక్కడ కేవలం 5.96% ఓట్లు దక్కాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో పురూలియా లోక్‌సభ స్థానాన్ని భాజపా గెల్చుకుంది.
4. ఖరగ్‌పుర్‌
బెంగాల్‌ భాజపా అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మేదినీపుర్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ఈ సీటు ఉంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే దినేన్‌ రాయ్‌ని తృణమూల్‌ మళ్లీ పోటీలో నిలిపింది. కమలదళం తరఫున తపన్‌ భుయా బరిలో ఉన్నారు.
5. మేదినీపుర్‌
సిట్టింగ్‌ ఎమ్మెల్యే మృగేంద్ర నాథ్‌ మైతీని కాదని నటి జూన్‌ మాలియాకు తృణమూల్‌ టికెట్‌ ఇచ్చింది. భాజపా నుంచి సమిత్‌ కుమార్‌ దాస్‌ పోటీలో నిలిచారు.
25% మందికి నేర చరిత్ర
తొలి దశ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 25% మందికి నేర చరిత్ర ఉన్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదికలో తేలింది. అత్యధికంగా ఖేజురిలో 34 మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

నలుగురికి ఆస్తులేవీ లేవట!
బెంగాల్‌లో శనివారం మొత్తం 191 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 19 మంది కోటీశ్వరులు. నలుగురు అభ్యర్థులు తమకు ఆస్తులేవీ లేవని ప్రకటించడం గమనార్హం.
తొలి దశలో పోలింగ్‌ జరగనున్న 30 స్థానాల్లో ఏ ఒక్కటీ భాజపాకు సిట్టింగ్‌ స్థానం కాదు. అయితే- ఇటీవల ఆ పార్టీ బాగా పుంజుకుంది. ప్రస్తుతం తృణమూల్‌కు గట్టి పోటీ ఇస్తోంది.
పోలింగ్‌ జరగనున్న స్థానాలు - 30
పోలింగ్‌ కేంద్రాలు - 10,288
మొత్తం అభ్యర్థుల సంఖ్య- 191. ఇందులో పురుషులు- 170 మంది, మహిళలు- 21 మంది
తొలి దశ పోలింగ్‌ జరగనున్న స్థానాల్లో ఓటర్ల సంఖ్య - 73.92 లక్షలు. వారిలో పురుషులు- 37.64 లక్షలు, మహిళలు: 36.28 లక్షలు
ఫలితాలు - మే 2న

అస్సాంలో త్రిముఖ పోరు
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో తొలి దశలో భాగంగా మొత్తం 264 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సీఎం సర్బానంద సోనోవాల్‌, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రిపున్‌ బోరా, అసోం గణ పరిషద్‌ (ఏజీపీ) అధ్యక్షుడు అతుల్‌ బోరా, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేశబ్‌ మహంత, అసోం జాతీయ పరిషద్‌ (ఏజేపీ) అధ్యక్షుడు లురిజ్యోతి గొగొయ్‌, రైజొర్‌ దళ్‌ అధ్యక్షుడు అఖిల్‌ గొగొయ్‌ తదితర ప్రముఖులు మొదటి దశ ఎన్నికల్లోనే బరిలో ఉన్నారు. పలు స్థానాల్లో అధికార భాజపా-ఏజీపీ కూటమి, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాజోత్‌ కూటమి, ఏజేపీ-రైజొర్‌దళ్‌ కూటమి మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది.
పోలింగ్‌ జరగనున్న స్థానాలు - 47
పోలింగ్‌ కేంద్రాలు - 11,537
మొత్తం అభ్యర్థుల సంఖ్య - 264. ఇందులో పురుషులు- 241 మంది, మహిళలు- 23 మంది
తొలి దశ పోలింగ్‌ జరగనున్న స్థానాల్లో ఓటర్ల సంఖ్య - 81.09 లక్షలు. వారిలో పురుషులు- 40.77 లక్షలు, మహిళలు: 40.32 లక్షలు
ఫలితాలు - మే 2న


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని