ప్రపంచంలోనే అత్యధికం

ప్రధానాంశాలు

ప్రపంచంలోనే అత్యధికం

దేశంలో ఒక్కరోజులో 89,129 కేసులు
అమెరికా, బ్రెజిల్‌లను మించి ఉద్ధృతి
మార్చి నుంచి మారిన పరిస్థితులు
ఏప్రిల్‌లో పెరిగిన కరోనా తీవ్రత

ఈనాడు, దిల్లీ: దేశంలో కరోనా రెండో అల ఉవ్వెత్తున ఎగుస్తోంది. గత 24 గంటల్లో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 89,129 కొత్త కేసులొచ్చాయి. అమెరికా, బ్రెజిల్‌లను మించి దేశంలో వైరస్‌ ఉద్ధృతి కనిపించింది. సెప్టెంబర్‌ 19 తర్వాత ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. రోజువారీ మరణాలు ఆ రెండు దేశాలకంటే తక్కువే ఉన్నప్పటికీ మునుపటితో పోలిస్తే అవి కూడా ఆందోళన కలిగించే రీతిలో పెరిగాయి. నవంబర్‌ 4 తర్వాత మరణాలు 700లను దాటడం ఇదే ప్రథమం. మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్‌లలో ఎప్పుడూ లేనన్ని ఎక్కువ కేసులొచ్చాయి. మరో 19 రాష్ట్రాల్లో గత రెండు వారాలను మించి గరిష్ఠ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ల్లోనూ పరిస్థితులు రోజురోజుకీ తీవ్రంగా తయారవుతున్నాయి.

ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాడు రోజువారీ కేసులు 20,035 మేర నమోదుకాగా, శనివారం నాటికి అవి 89,129కి చేరి 344% వృద్ధి నమోదుచేశాయి. రోజువారీ మరణాలు కూడా 256 నుంచి 714 (178%)కి చేరాయి. కేసులు, మరణాల పరంగా తొలి నుంచీ పదిరాష్ట్రాలే పైకీ కిందికి ఊగిసలాడుతూ వస్తున్నాయి. జనవరి 1 నాటికి మొత్తం పాజిటివ్‌ కేసుల్లో క్రియాశీలక కేసుల సంఖ్య 2.47%మేర ఉండగా, ఇప్పుడు అది 5.32%కి చేరింది. గత 24 గంటల్లో క్రియాశీలక కేసులు నికరంగా 44,213 మేర పెరిగాయి. గత రెండునెలల్లో పంజాబ్‌లో 12, దిల్లీ, హరియాణాల్లో 10, మహారాష్ట్రలో 9, ఛత్తీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌ల్లో 8, కర్ణాటకలో 6, తమిళనాడులో 4, ఉత్తర్‌ప్రదేశ్‌లో 3 రెట్ల మేర క్రియాశీలక కేసులు ఎగబాకాయి. ప్రస్తుతం దేశంలోని క్రియాశీలక కేసుల్లో 60% మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, ఛత్తీస్‌గడ్‌, కేరళ, పంజాబ్‌ (17.94%) ఆక్రమించాయి. మిగిలిన అన్నిరాష్ట్రాల్లో కలిపి 22.70%మేర క్రియాశీలక కేసులు ఉన్నాయి. 50% క్రియాశీలక కేసులు పది జిల్లాలకే పరిమితం అయ్యాయి. అందులో 8 జిల్లాలు మహారాష్ట్రవే (పుణే, ముంబాయి, నాగ్‌పుర్‌, ఠాణే, నాసిక్‌, ఔరంగాబాద్‌, అహ్మద్‌నగర్‌, నాందేడ్‌) కావడం విశేషం. ఆ తర్వాత ఈ జాబితాలో దిల్లీ, బెంగుళూరు అర్బన్‌లు చేరాయి. మొత్తం 12 రాష్ట్రాల్లో కేసులు పురోగమన దిశలో సాగుతున్నాయి. గత 24 గంటల్లో నమోదైన 714 మరణాల్లో 85.85% కేవలం ఆరు రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. ఇందులో మహారాష్ట్రలో 481 (67.36%) మంది చనిపోగా, తర్వాత పంజాబ్‌ (57), ఛత్తీస్‌గడ్‌ (43), ఉత్తర్‌ప్రదేశ్‌ (16), మధ్యప్రదేశ్‌ల్లో (16)  ఎక్కువమంది కన్నుమూశారు. ఏప్రిల్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య బాగా పెరుగుతూ వస్తోంది. 1న 72,330న కేసులు, 2న 81,466కి, 3కల్లా 89,129కి చేరాయి.

ఈ మూడురోజుల్లో వరుసగా 35%, 12.63%, 9.40% మేర వృద్ధి నమోదైంది. మార్చిలో కేసుల వృద్ధి విపరీతంగా పెరిగింది. ఈ నెలలో రోజుకు సగటున 35,763 కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్కనెలలో 9.9 శాతం మేర పెరిగాయి.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని