close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రోజుకు లక్ష కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తాం: మంత్రి ఈటల

 ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌, కర్ఫ్యూలకు ఆస్కారం లేదు

ఈనాడు, హైదరాబాద్‌, రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అవసరమైతే రోజూ లక్ష వరకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. వ్యాక్సిన్లను 50 వేల నుంచి 1.5 లక్షలకు పెంచుతున్నామని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతోనూ, హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లోని ది ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ‘ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులోనూ మాట్లాడారు. ‘‘మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు ఉండటంతో ఇక్కడ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రతో సరిహద్దులు కలిగిన నిజామాబాద్‌ లాంటి జిల్లాల్లోని వైద్యసిబ్బంది సర్వసన్నద్ధంగా ఉన్నారు. జిల్లాల్లోని ఆసుపత్రుల్లో పడకలు, ఐసీయూలు, సిబ్బందిని అవసరమైన రీతిలో ఏర్పాటు చేసుకునేలా ఆదేశాలిచ్చాం.  ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌, కర్ఫ్యూలకు ఆస్కారం లేదు. గడిచిన ఏడాదిలో కొవిడ్‌ రోగుల చికిత్సకు రూ.500 కోట్లు ఖర్చు చేశాం. ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. కొవిడ్‌ సందేహాల నివృత్తికి త్వరలోనే టోల్‌ఫ్రీ నంబర్‌ అందుబాటులోకి తెస్తాం. రాష్ట్రంలో కొవిడ్‌ మరణాలు 0.05 శాతమే నమోదయ్యాయి. కొన్ని కార్పొరేట్‌, ప్రైవేటు ఆసుపత్రులు కొవిడ్‌ పరిస్థితులను వ్యాపారంగా మార్చుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.అలాంటి యాజమాన్యాలపై చర్యలు, లైసెన్సుల రద్దు తప్పదు’’ అని మంత్రి ఈటల అన్నారు. సదస్సులో అపోలో గ్రూప్స్‌- హాస్పిటల్స్‌ అధ్యక్షులు డా.కె.హరిప్రసాద్‌, సీసీఎంబీ డైరెక్టర్‌ డా.రాకేశ్‌ కె.మిశ్ర, ఆయూష్‌ శాఖ సంచాలకులు డాక్టర్‌ వి.ఎస్‌.అలగు వర్షిణి, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు రమాకాంత్‌ ఇనాని, సీఈఓ ఖ్యాతి నారావణె, ఎఫ్‌టీసీసీఐ హెల్త్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌ శేఖర్‌ అగర్వాల్‌, ఎఫ్‌టీసీసీఐ సీనియర్‌ ఉపాధ్యక్షుడు కె.భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు