close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆరోగ్య సమాచారం డిజిటలీకరించాలి

 ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా వంటి మరో సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే ప్రపంచంలోని ప్రతి మానవుని ఆరోగ్య సమాచారాన్ని డిజిటలీకరించాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు సూచించారు. ఆరోగ్య వివరాల నమోదుపై ప్రభుత్వాలు చొరవ తీసుకోవడంతో పాటు ప్రజలను చైతన్యపరచాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాణ రక్షణ అంశంపై ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం) బుధవారం జపాన్‌ నుంచి  దృశ్యమాధ్యమంలో నిర్వహించిన ప్రపంచ సాంకేతిక పాలన శిఖరాగ్ర సదస్సులో కేటీఆర్‌ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ నుంచి పాల్గొని ప్రసంగించారు. ‘‘అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అన్ని దేశాల్లో వైద్యరంగంలో మౌలిక వసతుల కొరతను కరోనా సంక్షోభం ఎత్తిచూపింది. వివిధ దేశాలు సహకార ధోరణితో ఈ సంక్షోభానికి అంతం పలికేందుకు ఏడాదిగా నిరంతరం శ్రమిస్తున్నాయి. ప్రతీ ఒక్కరి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు వారి సమాచారం నిక్షిప్తం చేయడం ద్వారా వ్యాధులను తిప్పికొట్టవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు.
సాంకేతికతను జనం చెంతకు చేర్చాలని
‘‘సాంకేతిక పరిజ్ఞానం సామాన్యులకు అందుబాటులోకి తేవాలన్నదే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన. దీనికి అనుగుణంగా పౌరసేవలను అందిస్తున్నాం. సాంకేతికత వినియోగం రాష్ట్రంలో ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. దాన్ని మరింత పెంచితే ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అత్యవసర సమయాల్లో డ్రోన్ల సాంకేతికత వినియోగానికి సంబంధించి ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వేదికతో కలిసి ఓ పైలట్‌ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. దానిని పూర్తిస్థాయిలో విస్తరిస్తాం’’ అని మంత్రి చెప్పారు. సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ ప్రపంచ వ్యాప్తంగా 45 ప్రముఖ వైద్య, సాంకేతిక కంపెనీల అధిపతులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు