
ప్రధానాంశాలు
ఓట్ల లెక్కింపు చేపట్టవద్దని హైకోర్టు స్పష్టీకరణ
సింగిల్ జడ్జి ఉత్తర్వుల రద్దు
15న సింగిల్ జడ్జి వద్ద
ఈ వ్యాజ్యం విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ఆ రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం బుధవారం అనుమతిచ్చింది. సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యం పరిష్కారం అయ్యేంత వరకు ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రకటన చేయవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) స్పష్టం చేసింది. పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిలువరిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఈనెల 6న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) విధించలేదని పిటిషనర్, వ్యాజ్యంలో పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం లేదని ఎస్ఈసీ వివిధ అంశాల్ని లేవనెత్తిన నేపథ్యంలో లోతైన విచారణ అవసరమని అభిప్రాయపడింది. వివాదాస్పద అంశాల్ని తేల్చాల్సి ఉందని పేర్కొంది. తెదేపా నేత వర్ల రామయ్య దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి వద్ద ఈనెల 15న విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎస్ఈసీ కార్యదర్శి కన్నబాబు మంగళవారం రాత్రి అత్యవసరంగా అప్పీల్ దాఖలు చేయగా... దానిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఇందులోభాగంగా... ‘సింగిల్ జడ్జి నిర్ణయాన్ని పరిశీలిస్తే మధ్యంతర ఉత్తర్వులిస్తూనే.. రిట్ పిటిషన్‌ను అనుమతిచ్చినట్లయింది. రిట్ పిటిషన్ విచారణ పెండింగ్‌లోనే ఉంది. తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్ఈసీని ఆదేశించడం చూస్తుంటే తుది ఉత్తర్వులిచ్చినట్లు కనిపిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చాక నిర్వహించిన గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయంలో కోడ్‌ను నాలుగు వారాల పాటు విధించలేదన్న విషయాన్ని సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు. వ్యాజ్యం దాఖలు చేసే అర్హత పిటిషనర్‌కు ఉందా లేదా అన్నది నిర్దిష్టంగా తేల్చలేదు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని సింగిల్ జడ్జి ఆదేశాల్ని రద్దు చేస్తున్నాం. ఈనెల 8న ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తున్నాం...’ అని ధర్మాసనం పేర్కొంది.
డివిజన్ బెంచ్ తీర్పుపై సుప్రీంకి వెళ్తాం: వర్ల రామయ్య
ఈనాడు డిజిటల్, అమరావతి: పరిషత్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తెదేపా సుప్రీంకోర్టును ఆశ్రయించనుందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వెల్లడించారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘తెదేపా అధినేత చంద్రబాబు ఈ మేరకు ముఖ్యనేతలందరితో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకోవటంతో పాటు న్యాయ సలహా తీసుకున్నారు. అరాచక ప్రభుత్వంపై ఎంతవరకైనా పోరాడాలని నిర్ణయించాం. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ప్రకారం జరిగిన అవకతవకలు సరిదిద్దుకునే అవకాశం ఉన్నా.. ఏపీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఎన్నికల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుని డివిజన్ బెంచ్ అప్పీల్‌కు వెళ్లారు...’’ అని వర్ల మండిపడ్డారు.
పోలింగ్ నేడే
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టు సింగిల్ జడ్జి మంగళవారం ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ బుధవారం కొట్టివేయడంతో పోలింగ్‌పై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. దీంతో 7,220 ఎంపీటీసీ, 515 జడ్పీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 7,735 స్థానాలకు 20,840 మంది పోటీలో ఉన్నారు. సుమారు 2,44,71,002 మంది గ్రామీణ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది.
ప్రధానాంశాలు
దేవతార్చన

- కరోనా వ్యాక్సిన్ ఎవరెవరు వేసుకోకూడదు?
- వైరస్ ప్రభావం త్వరలో తారస్థాయికి
- ప్రేమించిన వ్యక్తితో కూతురు వెళ్లిపోయిందని...
- పిల్లల్లో పెరుగుతున్న ముప్పు
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- నేను ఎస్టీ కాదని రుజువు చేయగలరా?
- భారత ఔషధ అవసరాలను అర్థం చేసుకున్నాం
- Tiktok స్టార్ భార్గవ్ చిప్పాడ అరెస్ట్
- జార్జ్ ఫ్లాయిడ్ హత్య: పోలీస్ అధికారే దోషి
- ఈసారి దిల్లీ