close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
11 నుంచి.. పని చేసేచోటే టీకా

  100కుపైగా ఉద్యోగులుంటే చాలు
  ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకూ అనుమతి

ఈనాడు, దిల్లీ: ఈనెల 11వ తేదీనుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వారు పనిచేసే చోటే టీకా అందించే కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌భూషణ్‌ రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ఈ మేరకు ఆయన అన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ‘‘ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన విషయం అందరికీ తెలుసు. ఈ వయసు వాళ్లు అత్యధికమంది ప్రభుత్వ, ప్రైవేటు సంస్థాగత కార్యాలయాలు, తయారీ, సేవారంగాల్లో పనిచేస్తున్నారు. లబ్ధిదారులందరికీ ఉపయోగకరమైన రీతిలో ఆచరణాత్మకంగా టీకా కార్యక్రమాన్ని నిర్వహించడానికి కేంద్రం నిరంతరం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే 100మందికిపైగా అర్హులైన వ్యక్తులు పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. ఇలాంటి కార్యాలయాలను సమీపంలోని వ్యాక్సినేషన్‌ సెంటర్‌తో జతచేసి టీకా కార్యక్రమాన్ని చేపట్టవచ్చు. అందువల్ల ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం అర్హమైన ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలతో మాట్లాడి పనిచేసేచోటే ఈనెల 11నుంచి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించాలి’’ అని రాజేష్‌భూషణ్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగుల్లో కేవలం 45 ఏళ్లపైబడిన వారికే వ్యాక్సిన్‌ ఇవ్వాలని, వారి కుటుంబసభ్యులతోసహా బయటివారెవ్వరినీ అనుమతించకూడదని సూచించారు. లబ్ధిదారులంతా ముందస్తుగా కొవిన్‌ యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని, అక్కడికక్కడే పేర్లు నమోదుచేసుకొనే అవకాశం కూడా కల్పించాలని పేర్కొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు