టీకాలు మరో వారం వరకే..

ప్రధానాంశాలు

టీకాలు మరో వారం వరకే..

తగ్గిపోతున్న డోసుల నిల్వలు
కేంద్రం నుంచి 3,4 రోజుల్లో రాకుంటే ఇబ్బందే

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో టీకా డోసుల నిల్వలు తగ్గిపోతున్నాయి. రాష్ట్రానికి సుమారు 24 లక్షలకు పైగా కొవిన్‌ టీకా డోసులు సరఫరా చేయగా.. ఇప్పటికే 16.80 లక్షల డోసులు పంపిణీ చేశారు. మరో 8 లక్షల డోసులు అందుబాటులో ఉన్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రోజుకు సగటున 70-75 వేల మందికి తొలి, మలిడోసులు కలుపుకొని టీకాలను అందిస్తున్నారు. ఇదే ఒరవడిలో టీకాలను పంపిణీ చేస్తే కేవలం 7-8 రోజులకు మాత్రమే సరిపోతాయి. మున్ముందు రోజుకు లక్ష-లక్షన్నర మందికి కూడా టీకాలివ్వాలని వైద్యశాఖ ప్రణాళికలు రూపొందిస్తున్న తరుణంలో.. మూణ్నాలుగు రోజుల్లో రాష్ట్రానికి డోసులను కేంద్రం పంపించకపోతే..పంపిణీ ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదముందని వైద్యవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయుల్లో, ప్రైవేటులో 20 పడకల ఆసుపత్రుల్లోనూ టీకాలను ప్రస్తుతం పంపిణీ చేస్తుండగా.. పని ప్రదేశాలు, గేటెడ్‌ కమ్యూనిటీ ఇళ్ల వద్ద కూడా టీకాలను ఇవ్వాలని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో.. రానున్న రోజుల్లో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ మరింత వేగంగా జరిగే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి సమయానుకూలంగా టీకాలను సరఫరా చేయకపోతే.. ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలుంటాయని వైద్యవర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి టీకాలను పంపించడంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో పదేపదే సంప్రదించినా.. సానుకూల స్పందన రావడం లేదని, కేంద్ర అధికారులు త్వరితగతిన స్పందించకపోతే టీకాల పంపిణీకి ఆటంకం ఏర్పడే అవకాశాలుంటాయని  వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ముఖ్యంగా రెండోడోసు పొందాల్సిన వారికి మరింత జాప్యం కలుగుతుందన్నారు. దీంతో ప్రజల్లో అనవసర ఆందోళనలకు ఆస్కారమిచ్చినట్లు అవుతుందన్నారు.
టీకాకు ముందుకు రాకుంటే ఎలా?
కరోనా కట్టడిలో ముందుండే వైద్యసిబ్బంది టీకాల స్వీకరణలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్‌ సిబ్బంది కూడా ఆశించిన రీతిలో టీకాలను పొందడానికి ముందుకు రాకపోవడం గమనార్హం. రాష్ట్రంలో 3,31,097 మంది వైద్యసిబ్బంది, 2,57,239 మంది ఇతర ఉద్యోగులు టీకా పొందడానికి తమ సమాచారాన్ని నమోదు చేసుకున్నారు. కానీ వీరిలో 2,28,663 (69 శాతం) మంది వైద్యసిబ్బంది, 1,19,143 (46.31 శాతం) మంది ఇతర ఉద్యోగులు మాత్రమే ఇప్పటివరకు తొలిడోసు టీకాలను పొందారు. తొలిడోసు పొందడంలోనే భారీగా వెనుకడుగు వేశారంటే.. 28 రోజుల తర్వాత రెండోడోసు స్వీకరించడంలోనూ ముందుకు రాకపోవడం వైద్యవర్గాలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా ప్రజారోగ్య సంచాలకులు విడుదల చేసిన సమాచారంలో.. 1,72,072 మంది (75 శాతం) వైద్యసిబ్బంది మాత్రమే రెండోడోసు తీసుకోగా, 67,829 (56.93 శాతం) మంది పోలీసులు, రెవెన్యూ తదితర ఉద్యోగులు మాత్రమే రెండోడోసును తీసుకోవడం గమనార్హం. తొలిడోసు తీసుకొని, రెండోడోసును గనుక తీసుకోకపోతే.. వ్యాక్సిన్‌ పనిచేయదనీ, ఆ టీకా నిరుపయోగంగా మారినట్లేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. భయాందోళనలను వీడి ఇప్పటికైనా టీకాలను పొందడానికి ముందుకు రావాలని సూచిస్తున్నారు. తాజాగా ఈనెల 7న (బుధవారం) 65,468 మంది తొలిడోసును, 6,084 మంది రెండోడోసును స్వీకరించారు. తొలిడోసును పొందినవారిలో 45 ఏళ్లు దాటినవారు 65,233 మంది ఉన్నారు. మొత్తంగా రాష్ట్రంలో 14,03,416 మంది తొలిడోసును, 2,76,906 మంది రెండో డోసు కొవిడ్‌ టీకాలను తీసుకున్నారు. రాష్ట్రంలో 3.31 శాతం టీకాలు వృథా అయినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని