close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మాస్క్‌ లేకపోతే వెయ్యి జరిమానా

మరోసారి ప్రభుత్వ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా తీవ్రత దృష్ట్యా మాస్క్‌ ధరించని వారిపై అధికారులు జరిమానాల కొరడా ఝళిపించనున్నారు. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, ఇతర పని ప్రదేశాలు, ప్రయాణ సమయాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్‌లు ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించాలని.. విపత్తు నిర్వహణ చట్టంలోని 51 నుంచి 60 సెక్షన్లు, ఐపీఎస్‌ 188వ సెక్షన్‌ కింద కేసుల నమోదుతో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. డీజీపీ, కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, ఇతర అధికారులకు ఈ అధికారం ఉందని.. దీన్ని కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం గతంలో మాస్కుల ధారణ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దాన్ని ఎక్కువ మంది పాటించకపోవడంతో తాజాగా మరోసారి జారీ చేసింది.  బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ లేకుండా సంచరిస్తున్న వారిపై పోలీసులు నిఘా విస్తృతం చేశారు. స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా.. సీసీ కెమెరాల ద్వారా ఉల్లంఘనల్ని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. ముఖ్య కూడళ్లలోని సీసీ కెమెరాలకు ఈ సాంకేతికతను అనుసంధానం చేయడంతో మాస్క్‌ ధరించని వారెవరో సులభంగా తెలిసిపోతుంది. అనంతరం సమీపంలోని గస్తీ పోలీసులను అప్రమత్తం చేస్తుండటంతో వారు వెంటనే అక్కడికి చేరుకొని కేసులు నమోదు చేస్తున్నారు.  
రాష్ట్రవ్యాప్తంగా 6,478 ఈ-పెట్టీ కేసులు
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 5 నుంచి ఆదివారం ఉదయం 10.50 గంటల వరకు 6,478 కేసులు నమోదు చేశారు. వీటిలో హైదరాబాద్‌ కమిషనరేట్‌లో అత్యధికంగా 2,030 కేసులు నమోదయ్యాయి. రామగుండం కమిషనరేట్‌లో 938, రాచకొండ 670, సైబరాబాద్‌ 514, సంగారెడ్డి 349, కామారెడ్డి 272, సూర్యాపేట 257, వరంగల్‌లో 218 నమోదు చేశారు. వనపర్తి, భూపాలపల్లి, జగిత్యాలల్లో ఒక్కోటి నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసూ నమోదవ్వలేదు. కేసులు నమోదైన వారు న్యాయస్థానంలో రూ.1,000 జరిమానా చెల్లించాలని పోలీసులు స్పష్టంచేస్తున్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు