close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చిన్నాసుపత్రుల్లోనూ చికిత్స

20 పడకలకు మించి ఉన్న వాటికి అనుమతులు
కొవిడ్‌ రోగుల కోసం ప్రైవేటులో 30 వేల బెడ్‌లు
సామాజిక భవనాల్లో నిర్ధారణ పరీక్షలు
వైద్యఆరోగ్య శాఖ కీలక నిర్ణయాలు
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో కొవిడ్‌ చికిత్సలను మరింత అందుబాటులోకి తేవాలని వైద్యఆరోగ్య శాఖ భావిస్తోంది. ప్రైవేటులో కేవలం 100 పడకలకు పైబడిన పెద్దాసుపత్రులకే పరిమితమైన చికిత్సలను ఇకనుంచి 20 పడకలకు మించి ఉన్న చిన్న ఆసుపత్రుల్లోనూ అందించాలని నిర్ణయించింది. తద్వారా సుమారు మూడు వేల ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలలో కొవిడ్‌ చికిత్సలు అందుబాటులోకి వస్తాయి. ఇటీవల మంత్రి ఈటల రాజేందర్‌ సమక్షంలో నిర్వహించిన సమావేశంలో ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌హోంల ప్రతినిధులతో ఈ విషయంపై చర్చించారు. ఆసుపత్రులు దరఖాస్తు చేసుకుంటే.. వెంటనే అనుమతులు ఇస్తామని వైద్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఎక్కడికక్కడే చికిత్సలు
ప్రస్తుతం రాష్ట్రంలో 62 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 8,615 పడకలు, 244 ప్రైవేటు ఆసుపత్రుల్లో 12,297 పడకలు కరోనా చికిత్సలకు కేటాయించారు. మొత్తం 20,912 పడకలు అందుబాటులో ఉన్నాయి. శనివారం నాటి వైద్యఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం 6,818 పడకల్లో మాత్రమే రోగులు చికిత్స పొందుతున్నారు. కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో మాత్రం పెద్దసంఖ్యలో చేరుతున్నారు. వాటిలో పడకలు లభ్యమవడమూ కష్టంగా మారింది. జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోనూ ప్రస్తుతం కేసులు పెరిగిపోతున్నాయి. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రులకు రావడం కష్టతరమైంది. పైగా చికిత్సలకు రోజుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతుండటం సామాన్యులకు భారంగా మారుతోంది. కొవిడ్‌కు అందించాల్సిన చికిత్సపై వైద్యుల్లోనూ స్పష్టత వచ్చేసింది. అన్ని సందర్భాల్లోనూ పల్మనాలజిస్టు, అనస్తటిస్టు తదితర నిపుణులు లేకుండానే.. ఎంబీబీఎస్‌ వైద్యులూ చికిత్స అందించేందుకు అవకాశాలు మెరుగయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాల్లోనే ఎక్కడికక్కడ చికిత్స లభించేలా చూడాలని వైద్యఆరోగ్యశాఖ భావిస్తోంది. జిల్లా, డివిజన్‌, నియోజకవర్గ కేంద్రాల్లోని చిన్న ఆసుపత్రుల్లో చికిత్సలను అనుమతించడం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులపై భారం తగ్గుతుంది. 20 పడకల ఆసుపత్రుల్లో కనీసం సగం పడకలను కొవిడ్‌ రోగులకు కేటాయించనున్నారు. స్థానికంగానే చికిత్స అందించడం వల్ల రోగికి ఖర్చూ తగ్గుతుంది. మూడువేల చిన్న ఆసుపత్రుల ద్వారా సుమారు 30 వేల కొవిడ్‌ పడకలు అందుబాటులోకి రానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. వీటికి అదనంగా ప్రైవేటు వైద్యకళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులనూ సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నాయి. తద్వారా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యంలో కలిపి.. సుమారు 50 వేల పడకలు అందుబాటులో ఉండేలా వైద్యారోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది.

వేర్వేరు చోట్ల పరీక్షలు, టీకాలు

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ వైద్యంలో 1,064 కేంద్రాల్లో యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహిస్తుండగా.. 944 కేంద్రాల్లో టీకాలు వేస్తున్నారు. దాదాపు అన్ని పట్టణ, గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వీటిని ఏకకాలంలో చేస్తున్నారు. ఈక్రమంలో పెద్దసంఖ్యలో ప్రజలు గుమిగూడుతున్నారు. ఫలితంగా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదముంది. టీకాల కోసం వచ్చిన వారికీ సోకే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ సమక్షంలో ఉన్నతాధికారులు చర్చించారు. ఆదివారం నిర్వహించిన టెలీ సమీక్షల్లో జిల్లా ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. టీకాలు, సాధారణ వైద్యసేవలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే కొనసాగిస్తూ.. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలకు సమీపంలోని సామాజిక భవనాలను వినియోగించుకోవాలని ఆదేశించారు. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర శాఖల ఉన్నతాధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు